ఆర్బీఐ కొత్త నిబంధనలు... లాకర్ లో డబ్బులు దాచుకోవచ్చా?
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకు లాకర్ భద్రతపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
By: Tupaki Desk | 3 Oct 2023 4:53 AM GMTఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఇటీవల కుమార్తె పెళ్లి కోసమని ఓ మహిళ రూ.18 లక్షల మొత్తాన్ని బ్యాంక్ లాకర్లలో పెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె డబ్బులు దాచుకున్న సుమారు ఏడాదిన్నర తర్వాత వెళ్లి చూస్తే ఆ మొత్తం చెద పురుగులు తినేశాయి. ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము పోవడంతో ఆమె భోరుమంది. దీంతో లాకర్ నిబంధనలపై చర్చ మొదలైంది. ఇంతకీ బ్యాంక్ లాకర్లలో నగదు పెట్టొచ్చా? ఆర్బీఐ నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
నగలు, విలువైన ఆభరణాలు వంటివి ఇంట్లో ఉంచుకుంటే దొంగలు ఎత్తుకుపోతారేమోనని చాలామంది భయపడిపోతుంటారు. అందుకే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అలా ఇప్పటికే చాలామంది లాకర్లు తీసుకుని బ్యాంకుల్లో నగలు, విలువైన వస్తువులు, ఆస్తిపత్రాలు మొదలైన వాటిని దాచిపెడుతుంటారు. ఈ సమయంలో కొంతమంది నగదు కూడా పెడుతుంటారు!
ఆర్బీఐ కొత్త నిబంధనల్లో ఏముంది?
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకు లాకర్ భద్రతపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు బ్యాంకు లాకరులో ఉంచిన ఏ వస్తువులు పోయినా బ్యాంకు మేనేజ్మెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. బ్యాంక్ నిర్లక్ష్యం కారణంగా లాకర్ లో ఉన్న వస్తువులు పోతే.. లాకర్ అద్దెకు 100 రెట్లు వినియోగదారుడికి చెల్లించాల్సి ఉంటుంది.
అంటే... బ్యాంకులో ఏదైనా అగ్నిప్రమాదం జరిగినా.. లేక, దొంగతనం వంటివి జరిగినా.. అదీగాక, బ్యాంకు బిల్డింగే కూలిపోయి లాకర్ లో ఉన్న వస్తువులు ధ్వంసమైనా.. బ్యాంక్ మేనేజ్‌మెంట్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.
అయితే... బ్యాంక్ లాకర్లలో నగదు దాచిపెట్టడంపై మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. లాకర్లలో పెద్ద నోట్ల నిల్వలను అరికట్టడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఈ నిబంధనను తీసుకొచ్చింది. దీంతో పాటు బ్యాంకులో ఎలాంటి వస్తువులు దాచుకోవాలి.. మరెలాంటి వస్తువులు దాచకూడదనే దానిపై ఈ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది.
ఈ నిబంధనల ప్రకారం నగలు, బంగారం వంటి విలువైన వస్తువులు, పత్రాలను మాత్రమే లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించింది. కరెన్సీ నోట్లు, ఆయుధాలు, పేలుడు సామగ్రి, మాదక ద్రవ్యాలు, రేడియేషన్ పరికరాలు, చట్ట విరుద్ధమైన వస్తువులు వంటివి బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోకూడదు!