బ్యాంకులకు ఆర్ బీఐ వార్నింగ్.. 30దాటితే రోజుకు రూ.5వేలు ఫైన్
కారణం ఏదైనా కానీ ఆస్తిపత్రాల్ని బ్యాంకుల్లో పెట్టి రుణం తీసుకునే లక్షలాది మందికి మేలు చేసే మాట ఒకటి ఆదేశ రూపంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) జారీ చేసింది.
By: Tupaki Desk | 14 Sep 2023 4:30 AM GMTకారణం ఏదైనా కానీ ఆస్తిపత్రాల్ని బ్యాంకుల్లో పెట్టి రుణం తీసుకునే లక్షలాది మందికి మేలు చేసే మాట ఒకటి ఆదేశ రూపంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) జారీ చేసింది. ఇప్పటివరకు బ్యాంకులో పెట్టిన ఆస్తిపత్రాల్ని తిరిగి ఇచ్చేందుకు నీర్ణత కాల వ్యవధిపై పెద్ద పట్టింపు లేనట్లుగా బ్యాంకులు వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి వాటికి చెక్ చెప్పిన ఆర్ బీఐ.. బ్యాంకులు అనుసరించాల్సిన గైడ్ లైన్స్ ను పక్కాగా వెల్లడించాయి.
రుణాల్ని పూర్తిగా చెల్లించిన తర్వాత 30 రోజుల్లో ఆస్తిపత్రాల్ని తిరిగి ఇచ్చేయాలని తేల్చి చెప్పింది. ఒకవేళ.. ఈ రూల్ ను పాటించని పక్షంలో సదరు బ్యాంకు 30 రోజుల తర్వాత నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను బుధవారం జారీ చేసింది. ఇందులో పేర్కొన్న కీలక అంశాల్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఎందుకుంటే.. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో బ్యాంకుల్లో ఆస్తిపత్రాల్ని ఉంచి రుణం తీసుకోవటం జరిగేదే.
ఖాతాదారు తమ ఆస్తుల్ని పూచీకత్తుగా పెట్టి తీసుకున్న రుణాల్ని పూర్తిగా చెల్లించిన తర్వాత కొన్ని ఆర్థిక సంస్థలు వ్యవహరిస్తున్న తీరులో తేడా ఉండటం.. దీనిపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆర్ బీఐ ఈ కీలక ఆదేశాల్ని జారీ చేసింది. తాజాగా బ్యాంకులకు ఆర్ బీఐ జారీ చేసిన ఆదేశాల్ని చూస్తే..
- తాజా నిబంధనలు డిసెంబరు 2023 నుంచి అమల్లోకి వస్తాయి. ఆ తేదీ లేదంటే ఆ తర్వాత నుంచి ఆస్తిపత్రాల్ని విడుదల చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ ఈ రూల్స్ ను ఫాలో కావాల్సిందే. ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన చార్జీలను కూడా తొలగించాల్సిందే.
- రుణాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత నుంచి 30రోజుల్లో వారికి సంబంధించిన ఒరిజినల్ స్థిర.. చరస్తులకు సంబంధించిన దస్తావేజుల్ని తిరిగి ఇచ్చేయాలి. వాటిని ఎక్కడ తీసుకోవాలన్న విషయాన్ని బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు రుణగ్రహీతకు స్పష్టం చేయాల్సిందే.
- అప్పు ఇచ్చిన బ్యాంకు బ్రాంచిలోనా.. ఇతరత్రా ఏదైనా ఆఫీసు నుంచి సదరు డాక్యుమెంట్లు తీసుకోవాలా? అన్నది బ్యాంకులు చెప్పాలి. ఈ రెండింటిలో అప్పు తీసుకున్న వ్యక్తి చెప్పిన చోట పత్రాల్ని తిరిగి ఇచ్చేయాలి.
- అప్పు తీసుకునేటప్పుడు బ్యాంకు సిద్ధం చేసిన డాక్యుమెంట్లులోనే రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత ఎన్ని రోజుల్లో ఎక్కడ? ఏ టైంకుఆ డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చే అంశాన్ని స్పష్టంగా పేర్కొనాలి.
- ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి కానీ వ్యక్తులు కానీ మరణించిన పక్షంలో వారి చట్టబద్ధమైన వారసులకు ఆ పత్రాల్ని ఇవ్వటానికి అనుసరించే రూల్ గురించి రుణం ఇచ్చే ఆర్థిక సంస్థ సమాచారం ఇవ్వాలి. అన్నీ విషయాల్ని బ్యాంకులకు సంబంధించిన వెబ్ సైట్ లో స్పష్టం చేయాలి.
- రుణాన్ని చెల్లించిన 30 రోజుల తర్వాత కూడా కస్టమర్ కు పత్రాల్ని అందించని పక్షంలో ఆలస్యానికి కారణం చెప్పాలి. ఒకవేళ ఆలస్యానికి కారణం బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు అయితే అందుకు ప్రతిగా ప్రతి రోజు రూ.5వేల చొప్పున పరిహారం చెల్లించాలి.
- పూచీకత్తుగా ఇచ్చిన ఒరిజినల్ పత్రాలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ డ్యామేజ్ అయితే.. వాటి డూప్లికేట్ కాపీలు పొందేందుకు సదరు సంస్థలు రుణదాతకు సహకారాన్నిఅందించాలి. అందుకు అయ్యే ఖర్చులన్నీ భరించాలి. దీని కోసం మరో 30 రోజులు అదనంగా తీసుకోవాలి. అప్పటికి ఆలస్యమైతే.. రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.