Begin typing your search above and press return to search.

బీర్ బాటిళ్లతో హైదరాబాద్ బిల్డర్ ను బీదర్ లో చంపేశారు

హైదరాబాద్ కు చెందిన బిల్డర్ ఒకరు బీదర్ లో దారుణహత్యకు గురయ్యారు.

By:  Tupaki Desk   |   28 May 2024 4:46 AM GMT
బీర్ బాటిళ్లతో హైదరాబాద్ బిల్డర్ ను బీదర్ లో చంపేశారు
X

హైదరాబాద్ కు చెందిన బిల్డర్ ఒకరు బీదర్ లో దారుణహత్యకు గురయ్యారు. జనసేన పార్టీ నేతగా.. క్యాసినో కింగ్ గా పేరున్న 49ఏళ్ల వయసున్న కుప్పాల మధు హత్య ఉదంతం కుత్భుల్లాపూర్..కూకట్ పల్లి.. శేరిలింగం పల్లి నియోజకవర్గాల్లో షాకింగ్ గా మారింది. తన ముగ్గురు స్నేహితులతో కలిసి బీదర్ కు వెళ్లిన మధు.. హైదరాబాద్ కు తిరిగి రాలేదు. ఆయన డెడ్ బాడీ నిర్జన ప్రదేశంలో పడి ఉన్న వైనం షాకింగ్ గా మారింది.

డబ్బుల విషయంలో స్నేహితులతో తలెత్తిన ఆరోపణలే ఆయన ప్రాణాలు తీశాయన్న వాదన ఒకవైపు.. వివాహేతర సంబంధమే కారణమన్న వాదన మరోవైపు వినిపిస్తోంది. బీర్ బాటిళ్లతో పదే పదే కడుపులో పొడిచేయటం ద్వారా నిందితులు దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం హతుడి నుంచి రూ.20 లక్షలు విలువ చేసే బంగారం.. రూ.కోటి క్యాష్ తీసుకొని ఊడాయించినట్లుగా భావిస్తున్నారు.

ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురం నుంచి ముప్ఫై ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చారు కుప్పాల మధు. కుత్భుల్లాపూర్ లోని చింతల్ ను అడ్డాగా చేసుకొని ఆయన మణికంఠ ట్రావెల్స్ పేరుతో వ్యాపారాన్ని నడిపాడు. మొదట్లో కార్లను అద్దెకు ఇచ్చిన అతడు.. కొన్నేళ్ల క్రితం బిల్డర్ గా మారారు. ఆయనకు భార్య.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓవైపు వ్యాపారం జోరుగా చేసే అతనికి క్యాసినో లో మంచి ప్రావీణ్యం ఉందని చెబుతారు. అతడిది మంచి హ్యాండ్ గా చెబుతారు.

ఇంటి నుంచి క్యాసినోకు వెళితే ఇంటికి లక్షలాది రూపాయిలు ఇంటికి తీసుకురావటమే తప్పించి పోగొట్టుకోవటం అన్నది తెలీదన్న పేరు ఆయనకున్నట్లుగా మధు గురించి తెలిసిన వారు చెబుతున్నారు. క్యాసినో ప్రముఖుడిగా పేరున్న చికోటి ప్రవీణ్ తోనూ మధుకు సత్ సంబంధాలు ఉన్నట్లుగా చెబుతారు. తొలుత ఆటగాడిగా తర్వాతి రోజుల్లో క్యాసినో ఏజెంట్ అవతారం ఎత్తిన మధు.. గోవా.. మలేసియా.. బెంగళూరు.. కర్ణాటకలోనిపలు ప్రాంతాల్లో నిర్వహించే క్యాసినోలతో పాటు.. సింగపూర్.. దుబాయ్ లో నిర్వహించే క్యాసినోలకు వెళుతుంటారని చెబుతారు.

జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉండే మధు.. ఈ మధ్యన ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయటంతో.. ఆయన తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తన రెండో కుమార్తె పెళ్లి నిశ్చయం కావటంతో ఆగస్టులో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 23న అమలాపురం నుంచి వచ్చిన మధు.. తర్వాతి రోజున తన స్నేహితులతో కలిసి కారులో బీదర్ కు వెళుతున్నట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వస్తానని చెప్పిన మధు.. మళ్లీ తిరిగి రాలేదు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బీదర్ కు వెళ్లిన మధు.. ఆ రోజు రాత్రి రూ.60 లక్షల నుంచి రూ.కోటివరకు గెలుచుకున్నట్లుగా చెబుతున్నారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు స్నేహితులు మధుతో బలవంతంగా బీర్ తాగించి.. డబ్బుల విషయంలో గొడవ పడినట్లుగా తెలుస్తోంది. జాతీయ రహదారి పక్కన మూసి ఉన్న దాబా వద్దబీర్ బాటిళ్లతో ముప్ఫై సార్లు పొడిచి హత్య చేసినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆపై మధు ఒంటి మీద ఉన్న బంగారంతో పాటు.. డబ్బుల్ని తీసుకొని నిందితులు ఊడాయించారు.

శనివారం ఉదయం ఓ పశువుల కాపరి అటువైపు వెళ్తూ మధు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీని మధుదిగా గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. హత్యకు అసలు కారణం ఏమిటి? మధుతో కలిసి వెళ్లిన వారు ఎక్కడున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. నిందితుల్ని పట్టుకుంటేనే హత్య వెనుకున్న అసలు నిజం బయటకు వస్తుందని చెబుతున్నారు.