తోడేళ్ల వరుస దాడులకు అసలు కారణమిదే!
ఆ తోడేళ్లు రేబిస్ వ్యాధి బారిన పడి ఉండటమే ఇందుకు కారణమై ఉండొచ్చన్నారు. లేదా వాటికి 'కెనైన్ డిస్టెంపర్ వైరస్' సోకి ఉంటుందని తెలిపారు.
By: Tupaki Desk | 11 Sep 2024 5:39 AM GMTగత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్ లోని బహరయిచ్ జిల్లాలో తోడేళ్లు వరుస దాడులతో ప్రజలను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఆరు తోడేళ్ల గుంపు ఒకేసారి పగబట్టినట్టు ప్రజలపైన దాడులు చేస్తున్నాయి. తోడేళ్ల దాడుల్లో ఇప్పటికే 8 మంది మరణించారు. 20 మంది గాయపడ్డారు. వీరిలో అత్యధికులు చిన్నారులే. దీంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.
ఈ తోడేళ్ల గుంపు ఉత్తరప్రదేశ్ లోని బహరయిచ్ జిల్లాలో 50 గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున అటవీ సిబ్బందిని, పోలీసులను దింపిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఐదు తోడేళ్లను బంధించింది. ఆరో తోడేలు కోసం వేట సాగిస్తోంది. తోడేళ్లను పట్టుకోవడానికి ఏకంగా డ్రోన్లను వినియోగించింది.
అయితే అసలు తోడేళ్లకు మనుషులపై ఆకస్మాత్తుగా ఎందుకింత కోపమొచ్చింది.. అవి ఇందుకింత రాక్షసంగా ప్రవర్తించాయనే అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తోడేళ్లు ఇలా వరుసగా ప్రజలపై దాడులకు పాల్పడటం అసాధారణమని 'ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్' అధినేత ఎస్పీ యాదవ్ తెలిపారు. ఆ తోడేళ్లు రేబిస్ వ్యాధి బారిన పడి ఉండటమే ఇందుకు కారణమై ఉండొచ్చన్నారు. లేదా వాటికి 'కెనైన్ డిస్టెంపర్ వైరస్' సోకి ఉంటుందని తెలిపారు.
తోడేళ్లు ప్రజలపై వరుస దాడులకు పాల్పడటం గత పదేళ్లలో ఇదే మొదటి సారి అని ఎస్పీ యాదవ్ చెబుతున్నారు. ఈ తోడేళ్లలో దేనికైనా రేబిస్ వ్యాధి వచ్చి ఉండవచ్చన్నారు. దీన్ని గుర్తించేందుకు అటవీ శాఖ సర్వేలు నిర్వహిస్తోందని తెలిపారు. అయితే.. తోడేళ్ల నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారా మాత్రమే కచ్చితమైన కారణం తెలుస్తుందని ఎస్పీ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడారు.
రేబిస్, కెనైన్ డిస్టెంపర్ వైరస్ లు కొన్నిసార్లు పులుల వంటివాటి ప్రవర్తనను కూడా మార్చగలవని ఎస్సీ యాదవ్ అంటున్నారు. ఈ వైరస్ సోకితే మనుషులను చూసి అవి భయపడవన్నారు. ఈ నేపథ్యంలోనే తోడేళ్లు కూడా దాడి చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
ఎస్పీ యాదవ్ చెబుతున్నట్టు ప్రభుత్వం నిర్వహించే పరీక్షల ద్వారా తోడేళ్లు ఎందుకింత క్రూరంగా ప్రవర్తిస్తున్నాయో తేలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐదు తోడేళ్లను అధికారులు బంధించడం వాటికి పరీక్షలు నిర్వహించనున్నారు.