Begin typing your search above and press return to search.

విజయమ్మతో జేసీ భేటీ.. అసలు కారణం ఇది!

కాగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి వెళ్లిన ఆస్పత్రి జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో ఉందని చెబుతున్నారు. ఆ ఆస్పత్రిలో అనుకోకుండా విజయమ్మ తారసపడటంతో జేసీ పలకరించారు.

By:  Tupaki Desk   |   30 July 2024 8:54 AM GMT
విజయమ్మతో జేసీ భేటీ.. అసలు కారణం ఇది!
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మతో తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ లో ఉన్న విజయమ్మ నివాసంలో ఆమెను జేసీ ప్రభాకర్‌ రెడ్డి కలిశారని వార్తలు వచ్చాయి. అర గంట పాటు అక్కడ ఉన్న జేసీ ఆమె ఆరోగ్యం, జగన్, షర్మిల రాజకీయ భవిష్యత్తు తదితర అంశాలపై చర్చ జరిపినట్టు టాక్‌ నడిచింది.

ఈ నేపథ్యంలో విజయమ్మతో తన భేటీపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పష్టత నిచ్చారు. హైదరాబాద్‌ లో ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లిన జేసీ ప్రభాకర్‌ రెడ్డికి అదే హాస్పిటల్‌ వెయిటింగ్‌ లాంజ్‌ లో విజయమ్మ కనిపించారు. దీంతో ఆమెను మర్యాదపూర్వకంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి పలకరించారు. అంతేతప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని జేసీ ప్రభాకర్‌ రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా స్పష్టత నిచ్చారు.

దీంతో ఊహాగానాలకు బ్రేక్‌ పడింది. అలాగే జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. విజయమ్మను లోటస్‌ పాండ్‌ లోని ఆమె నివాసంలో కలవలేదని వెల్లడైంది. ఆస్పత్రి వెయిటింగ్‌ లాంజ్‌ లో విజయమ్మ కనిపించడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా పలకరించారు. ఆమె బాగోగుల గురించి తెలుసుకున్నారు. అంతేతప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్వయంగా జేసీనే ప్రకటించారు. దీంతో ఊహాగానాలకు తెరపడింది.

కాగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి వెళ్లిన ఆస్పత్రి జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో ఉందని చెబుతున్నారు. ఆ ఆస్పత్రిలో అనుకోకుండా విజయమ్మ తారసపడటంతో జేసీ పలకరించారు. దీంతో ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. విజయమ్మతో జేసీ ఏం మాట్లాడి ఉంటారనే దానిపై చర్చ జరిగింది. అయితే అదంతా ఏమీ లేదని జస్ట్‌ మర్యాదపూర్వక పలకరింపేనని తేలింది.

వైఎస్సార్‌ ఉన్నప్పుడు జేసీ బ్రదర్స్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. అనంతపురం జిల్లాలో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జేసీ బ్రదర్స్‌ 2014లో టీడీపీలో చేరారు. తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా, అనంతపురం నుంచి ఎంపీగా జేసీ దివాకర్‌ రెడ్డి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వీరికి బదులుగా వీరిద్దరి కుమారులు బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక ఇటీవల ఎన్నికల్లో జేసీ కుటుంబంలో ఒక్కరికే సీటు దక్కింది. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డి విజయం సాధించారు.

జేసీ ప్రభాకర్‌ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్‌ గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో తాడిపత్రిలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. దీంతో జేసీ ప్రభాకర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టారు.