పిఠాపురం వర్మ - బర్మా.. ఈ కామెంట్ల వెనుక కథేంటి.. ?
ఈ లోగా.. ఆయనపై వర్మ-బర్మా.. అంటూ కామెంట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. అయితే.. దీనివెనుక.. జనసేన కీలక నాయకుడు ఒకరు ఉన్నారనేది వర్మ వర్గీయులు చెబుతున్న మాట. నిజానికి వర్మకు అడ్డు పడుతున్నది కూడా ఆయనేనని అంటున్నారు.
By: Tupaki Desk | 31 July 2024 2:30 PM GMTపిఠాపురం నియోజకవర్గంలో గత 20 రోజులుగా సోషల్ మీడియాలో `వర్మ-బర్మా` వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం అందరికీ తెలిసిందే. ఎవరు వీటిని చేయిస్తున్నారన్నది పక్కన పెడితే.. అసలు వర్మ కామెంట్లతో రాజకీయంగా నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కోసం.. టికెట్‌ను త్యాగం చేశారు. ఎన్ ఎస్ వీఎస్ ఎన్ వర్మ. అంతేకాదు.. ఎన్నికల్లో పవన్‌ను గెలిపించేందుకు కూడా ప్రయాసపడ్డారు. గెలిపించారు. ఈ క్రమంలోనే తొలినాళ్లలో ఆయన హల్చల్ చేసినా..చంద్రబాబు ఇచ్చిన అభయంతో ఆయన వెనక్కి తగ్గారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సముచిత గౌరవం కల్పిస్తామని.. మంత్రి పదవి కూడా ఇస్తామని అంతర్గత చర్చల్లో వర్మకు హామీ ఇచ్చారు. అందుకేనా.. అన్నట్టుగా ఇప్పటికీ కూడా.. చంద్రబాబు మంత్రి వర్గంలో ఒక సీటును ఖాళీగా ఉంచారు. కానీ, 50 రోజులు అయిపోయినా.. ఇప్పటి వరకు వర్మకు ఎలాంటి సంకేతాలు లభించడం లేదు. అదేసమయంలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే.. ఒకటి జనసేన తీసుకుంది. మరొకటి టీడీపీ తీసుకుంది. ఈ సీటును తనకు ఇస్తారని వర్మ ఎదురు చూసిన మాట వాస్తవం. కానీ, అనూహ్యంగా టీడీపీ నుంచి సీ. రామచంద్రయ్యా, జనసేన నుంచి హరిప్రసాద్‌కు మండలికి ఎన్నికయ్యారు.
దీంతో వర్మ హర్టయ్యారు. ఇక, అప్పటి నుంచి ఆయన పెద్దగా బయటకు రావడం లేదు. ఈ లోగా.. ఆయనపై వర్మ-బర్మా.. అంటూ కామెంట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. అయితే.. దీనివెనుక.. జనసేన కీలక నాయకుడు ఒకరు ఉన్నారనేది వర్మ వర్గీయులు చెబుతున్న మాట. నిజానికి వర్మకు అడ్డు పడుతున్నది కూడా ఆయనేనని అంటున్నారు.కానీ, ఎవరూ బయట పడడం లేదు. వర్మకు ఏ పదవి ఇచ్చినా..నియోజకవర్గంలో నెంబర్ 1 లేదానెంబర్ 2గా మారిపోతారని.. ఇది జనసేనకు ఇబ్బంది అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట. అయితే.. ఎవరూ బయట పడడం లేదు.
కానీ, వర్మ అభిమానులు, అనుచరులు మాత్రం.. తమ నాయకుడిని అవమానిస్తున్నారనేది వారి మాట. అలాగని ఎవరూ బయటపడడం లేదు. ఈ వివాదం మున్ముందు ముదురుతుందా? లేక.. ఇక్కడితో సరిపెడతారా? అనేది చూడాలి. గతంలో వర్మ కారుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లోనూ జనసేన వర్గీయులే ఆయన కారుపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే.. దీనిని అప్పట్లో పవన్ జోక్యం చేసుకుని ఇరు పక్షాలకు సర్ది చెప్పారు. కానీ..ఇప్పుడు మాత్రం పవన్ తెలిసిందో లేదో తెలియదు కానీ.. ఆయన మాత్రం మౌనంగా ఉన్నారు. మొత్తంగా చూస్తే.. పిఠాపురంలో వర్మ రాజకీయం నివురు గప్పిన నిప్పు మాదిరిగా మారింది. ఏ క్షణంలో అయినా బ్లాస్ట్ కావొచ్చని అంటున్నారు పరిశీలకులు.