మణిపూర్ ఘోరాలకు అసలు కారణం ఏమిటి?
మణిపూర్ లో ఏమి జరుగుంది.. ఏందుకు జరుగుతుంది.. మనం వింటున్న వాటిలో ఎంత నిజం.. చూస్తున్నవాటిలో ఏదీ నిజం.. ఈ మారణకాండకు ఎవరు కారణం.
By: Tupaki Desk | 22 July 2023 12:30 PM GMTమారణకాండకు ఎవరు కారణం.. ఈ ఘోరంలో డబుల్ ఇంజిన్ పాత్ర ఎంత.. అసమార్ధత పాలు ఎంత.. అత్యంతబలమైన కేంద్ర బలగాలు రంగంలోకి దిగినా పరిస్థితి ఇంత ఘోరంగా ఎందుకు మారిపోయింది.. అనేది ఇప్పుడు చూద్దాం..!
మణిపూర్ జనాభా దాదాపు 30 నుంచి 35 లక్షలు ఉంటుంది. ఇక్కడ మైతి, నాగ, కూకి అనే మూడు తెగల జనాభా నివసిస్తుంటారు. మైతి తెగలో ఎక్కువగా హిందువులూ, కొంతమంది ముస్లింలు కూడా ఉంటారు. మణిపూర్ జనాభాలో సుమారు 60శాతం వీళ్లే ఉంటారు. ఫలితంగా అసెంబ్లీలో 60 మందిలో 40 మంది ఎమ్మెల్యేలు ఈ తెగలకు చెందినవారే ఉంటారు. ఇక ఆ రాష్ట్రానికి ఇప్పటివరకూ 12 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే.. అందులో 10 మంది మైతీలే కావడ్దం గమనార్హం.
మణిపూర్ లో చుట్టూ కొండలమధ్య ఉండే ఇంఫాల్ లోయలో చుట్టూ ఈ మైతీలు ఉంటారు. అంటే ఆ రాష్ట్రంలోని అతి స్వల్ప భూభాగంలోనే వీరి ఆధిపత్యం ఉంటుంది. మిగిలిన 90శాతం భూభాగం అంటే ఇంఫాల్ లోయచుట్టు ఉండే కొండప్రాంతాల్లో నాగ, కుకీ తెగలకు చెందినవారు ఉంటారు. వీళ్లు ప్రధానంగా క్రీస్టియన్లు!
మణిపూర్ లో ఉన్న 34 షెడ్యూల్ తెగల్లో ఎక్కువగా నాగ, కుకీలకు చెందినవారే ఉన్నారు. అయితే తమకు కూడా ఎస్టీ హోదా ఇవ్వాలని మైతీ తెగకు చెందినవారు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 2023 ఏప్రిల్ 19న నాలుగు వారాల్లోగా మైతీ తెగవారికి ఎస్టీ హోదాను ఇచ్చే అంశాన్ని పరిగణించాలని మణిపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి కూడా సిఫారసు చేయాలని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
ఎన్నికల సీజన్ కావడంతో మైతీలకు ఎస్టీ హోదాను కల్పించడానికి ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందని తెలియడంతో కూకీలు నిరసన బాట పట్టారు. దాదాపు రెండు నెలలుగా ఈ రెండు తెగల ప్రజలు రాళ్లు రువ్వుకుంటున్నారు. ఇళ్లు తగలబెట్టుకుంటూనే ఉన్నారు. ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.
ఈ ఘర్షణలవల్ల ఇప్పటివరకూ సుమారుగా 200 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. పరిస్థితి చేయిదాటిపోవడంతో స్థానికంగా ప్రజల మధ్య కమ్యునికేషన్ ని కట్ చేయాలని ప్రభుత్వం భావించింది. ఫలితంగా ఇంటర్నెట్ ఆగిపోయింది. ఇదే సమయంలో కేంద్రం బలగాలను మొహరించింది. ఎన్ని చేసినా మణిపూర్ లో జరుగుతున్న ఆ హింసను మాత్రం ఎవ్వరూ ఆపలేకపోయారు.
కొన్ని రోజులు ఈ విషయంపై మౌనం వహించిన ప్రధాని నరేంద్ర మోడీ... పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అయినా ఏదో ఒక ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒక్కరోజు ముందు మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్లపై ఊరేగించిన సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ ఘటన మే 4న తౌబాల్ జిల్లాలో జరిగినట్లు పోలీసులు వెళ్లడించారు. ఈ లైంగిక వేదింపులపై మే 18న అంటే... ఘోరం జరిగిన సుమారు రెండు వారాల తర్వాత కాంగ్ పోక్సీ జిల్లాలో ఎఫ్.ఐ.ఆర్. నమోదైంది. అంటే మసిపూసి మారేడు కాయచేయాలని ప్రభుత్వ పెద్దలు భావించారా అనే అనుమానాలు ఈ సందర్భంగా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ ఎఫ్.ఐ.ఆర్. లో ఉన్న వివరాల ప్రకారం మే 3వ తేదీన సుమారు 800 - 900 మంది తౌబాల్ జిల్లాలో ఉన్న తమ గ్రామంపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పరిస్థితులు తీవ్రంగా మారడంతో ఇద్దరు మహిళలు, ఒక యువతి, ఆ యువతి తండ్రి, సోదరుడితో కలిసి అడవుల్లోకి పారిపోయారు.
ఆ సమయంలో ఆ విషయాన్ని గమనించిన పోలీసులు.. వారిని రక్షించి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తుండగా... స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో నిందితులు వారిని అడ్డగించారు. ఆ సమయంలో పోలీసులు ఏమి చేశారనే విషయం మాత్రం వెలుగులోకి రావడం లేదు. పోలీసుల చేతిలో తుపాకులు లేవా.. లేక, గుండేల్లో ధైర్యం లేదా.. అదీగాక, ప్రభుత్వం నుంచి ఉత్తర్వ్యులు లేవా.. లేకపోతే, వారిలో కూడా మైతీ సానుబూతిపరులున్నారా? అనేది మిస్టరీగా మారిందని తెలుస్తుంది.
పోలీసుల సంగతి కాసేపు పక్కనపెడితే... వారి నుంచి తన కూతురిని రక్షించుకోవాలనుకున్న యువతి తండ్రిని అక్కడికక్కడే చంపేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించారు. అంతే కాకుండా యువతిపై బహిరంగంగా సమూహికంగా అత్యాచారం కూడా చేశారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె సోదరుడిని అక్కడికక్కడే చంపేశారు. ఇదంతా ఎఫ్.ఐ.ఆర్. లో నమోదైంది.
కానీ... దుండగులు అడ్డుకున్న సమయంలో పోలీసుల పాత్రపై మాత్రం నమోదైనట్లు తెలియలేదు! అయితే ఈ వీడియో వెలుగులోకి వచ్చాక మరో విషయం బయటపడిందని తెలుస్తుంది. మణిపూర్ లో ఘర్షణలు జరుగుతున్నది రిజర్వేషన్ ల వల్ల కాదు.. ప్రత్యేక వ్యవస్థ కోసం కూడా అని అంటున్నారు!! అయితే… కారణం రిజర్వేషన్స్ అయినా, ప్రత్యేక వ్యవస్థ అయినా బలవుతున్నది మాత్రం బలహీనులైన కూకీలే అనే మాటలు వినిపిస్తున్నాయి!
ఇప్పటివరకూ అంతా అనుకుంటున్నట్లు కూకీ తెగ మణిపూర్ లోనే కాకుండా... ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్ లోని అనేక కొండ తెగలలో ఇదీ ఒకటి. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ వీరున్నారు. అయితే చాలాకాలం వరకూ వీరికి ఎలాంటి గుర్తింపూ లభించలేదు. భారతదేశంలో చాలా మంది వెనుకబడిన వర్గాల లాగానే వీరు కూడా నిర్లక్ష్యానికి బలయ్యారు.. అంతకంటే ముందు గుర్తింపుకు నోచుకోకున్నారు.
కానీ భారత్ లోకి మిషనరీల రాకతో కుకీలలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది. మిషనరీల కార్యకలాపాలు వీరిలో గణనీయమైన సాంఘిక, సాంస్కృతిక రాజకీయ మార్పులను తీసుకొచ్చాయి. అయితే కూకీ ప్రజలు 1917 - 1919 మధ్యకాలంలో “కుకీ అటానమీ మూమెంట్”పేరుగో మొదటిసారి బ్రిటీష్ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేశారు. అప్పటివరకూ స్వతంత్ర నాయకులచేత పాలించబడిన కుకీలు ఓటమి తర్వాత బ్రిటీష్ వారి ఆధీనంలోకి వచ్చారు.
దానితర్వాత బ్రిటీష్ - ఇండియా, బ్రిటీష్ - బర్మా పరిపాలనల మధ్య వారి భూభాగం విభజించబడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీతో వీరు బ్రిటీషర్లపై పోరాటం చేసినట్లు తెలుస్తుంది. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత కూకీలలోని దాదాపు 50 తెగలను వారు ఆవిర్భవించిన ప్రాంతం, వారు మాట్లాడే బాష, మాండలికం ఆధారంగా భారత ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించింది.
ఇక మణిపూర్ విషయానికొస్తే... కూకీలు తమకు ప్రత్యేక వ్యవస్థ కావాలని ఎప్పటినుంచో అడుగుతూనే ఉన్నారు. కొండప్రాంతంలో ఉండే తమకూ.. లోయ ప్రాంతంలో ఉండే మైతీలకూ ఒకే వ్యవస్థ ఏమిటి అనేది వారి ప్రశ్న. ఇప్పుడు వీళ్ల ప్రత్యేక వ్యవస్థ మాట అటుంచితే... మైతీలకు కూడా ఎస్టీ హోదా గురించి ఆలోచించమని ఇచ్చే తీర్పు కుకీలను మరింత రెచ్చగొట్టింది.
ఇప్పుడు ఈ రావణకాష్టం రిజర్వేషన్ కోసమా, ప్రత్యేక వ్యవస్థ కోసమా, మరోడిమాండ్ కోసమా అనేది పక్కనపెడితే... జరుగుతున్న ఘోరాలు మాత్రం దారుణం! మైతీల చేతిలో బలవుతున్న కూకీల పరిస్థితి అత్యంత దయణీయం! ఫలితంగా... వీరిపై జరుగుతున్న దాడులను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా చేతకాని స్థితిలోకి వెళ్లిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ఇందుకు కారణం ఎవరు..? తమ మనుగడను ప్రశ్నార్ధకం చేయొద్దని చెప్పే ప్రయత్నం చేస్తున్న కూకీలా... తమకు కూడా ఎస్టీ హోదా ఇవ్వమని అడుగుతూ, అగ్రవర్ణ ఆధిపత్యం మైకంలో కూకీల మహిళలను చెరబడుతున్నారన్న పేరు సంపాదించుకున్న మైతీలా... ఇంత రచ్చ జరుగుతున్నా స్పందించని వ్యవస్థలా... అన్నీ తెలిసీ అసమర్ధులుగా చూస్తూ ఉండిపోయారనే పేరు సంపాదించుకున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలా... అధికారం చేతిలో ఉండి ప్రజలను సర్ధుబాటుచేయలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వ నాయకులా...? ఈ విషయంలో ఎవరి అవగాహన, ఎవరి నిర్ణయం, ఎవరి అభిప్రాయం వారికి వదిలేస్తే... బలవుతున్నది బలహీనుడే.. తలబడుతున్నది భారతమాతే!