కమలను గెలిపించమన్న ఓపెన్ ఏఐ.. వెన్నుపోటుతో ఓడించిన బైడెన్?
మనిషిని నమ్మడం కంటే.. మర మనిషిని నమ్మడం మేలేమో..? అమెరికా అధ్యక్ష ఎన్నికలను చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
By: Tupaki Desk | 10 Nov 2024 9:15 AM GMTమనిషిని నమ్మడం కంటే.. మర మనిషిని నమ్మడం మేలేమో..? అమెరికా అధ్యక్ష ఎన్నికలను చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. హోరాహోరీగా పోరాడినా భారత మూలాలున్న డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ ఎందుకు పరాజయం పాలయ్యారో ఎవరికీ అంతుపట్టడం లేదు. వివాదాస్పద చరిత్ర ఉన్నప్పటికీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఎందుకు గెలిపించారో తెలియడం లేదు. అయితే, దీనివెనుక కారణాల సంగతిని పక్కనపెడితే రెండు విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.
వ్యక్తిగతంగా తాను ఓడి.. పార్టీలో తనను ఓడించి
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి డెమోక్రాట్ అభ్యర్థిగా బరిలో దిగినా మధ్యలో తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఆయన సామర్థ్యంపై తీవ్ర అభియోగాలు వ్యక్తమైన నేపథ్యంలో చేసేదేం లేక వైదొలగారు. ఒకవేళ బైడెన్ ఎన్నికల రేసులో కొనసాగి ఉంటే.. ట్రంప్ ఏకంగా 400 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకునేవారని అధ్యక్ష నివాసం వైట్ హౌస్ చేసిన అంతర్గత సర్వేల్లో తేలిందట. మాజీ అధ్యక్షుడు ఒబామాకు స్పీచ్ రైటర్ గా పనిచేసిన జాన్ ఫ్రావూ చెప్పిన మాటే ఇది. బైడెన్ అమెరికా ఎన్నికల రేసులో నిల్చోవడమే అతిపెద్ద తప్పుగా ఆయన అభివర్ణించారు. అయితే, బైడెన్ రేసులో ఉండడం అత్యంత ఘోరమైన నిర్ణయంగా పేర్కొన్నారు. డెమోక్రట్లకు పూర్తిగా నష్టం జరిగే వరకూ కమల అభ్యర్థిత్వాన్ని ఆయన ఒప్పుకోలేదట. తన పాలన చరిత్రాత్మకం, దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత బలంగా ఉందంటూ గొప్పలు పోయారట. అలా అధ్యక్షుడి బృందం కమల కు వెన్నుపోటు పొడిచిందని.. కమల గెలవలేదంటూ మీడియాకు లీకులు కూడా ఇచ్చిందని పేర్కొన్నారు. కాగా, డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత నాన్సీ పెలోసీ కూడా జోబైడెన్ తొందరగా తప్పుకొని ఉంటే.. ఇతర అభ్యర్థులు వచ్చేవారని, ఓపెన్ ప్రైమరీలు జరిగేవని వివరించారు. హారిస్ పేరును బైడెన్ నామినేట్ చేసే సమయానికి ప్రైమరీలకు అవకాశమే లేకుండా పోయిందన్నారు. తద్వారా బైడెన్ పరోక్షంగా కమలాకు చేటు చేశారని వ్యాఖ్యానించారు.
ఓపెన్ ఏఐ మాత్రం..
మనిషి అయిన బైడెన్ దెబ్బకొట్టినా.. మర యంత్రమైన ఓపెన్ ఏఐ మాత్రం కమల గెలుపును కాంక్షించిందట. అధ్యక్ష ఎన్నికల్లో కమలకు ఓపెన్ ఏఐ ప్రచారం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రంప్ కు ఓటేసేలా నన్ను ఒప్పించు అని అడిగితే.. అందుకు నేను సహకరించలేను అని చెప్పిందట. అదే.. కమలకు ఓటేసేలా నన్ను ఒప్పించు అని అడిగితే మాత్రం.. ఆమెను ఎందుకు గెలిపించాలో పలు కారణాలు చెప్పిందట. ఈ నేపథ్యంలోనే ఓపెన్ ఏఐపై విచారణ జరిపించాలనే డిమాండ్లు వస్తున్నాయి.