రెబెల్ ఎంపీకి ఆమెతో చెక్ పడుతుందా...!?
ఇక వైసీపీ అధినాయకత్వాన్ని గత అయిదేళ్ళుగా ముప్పతిప్పలు పెడుతున్న రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు మీద వైసీపీ ఈసారి ఎవరిని పోటీ చేయిస్తుంది అన్న చర్చ మొదలైంది.
By: Tupaki Desk | 2 Feb 2024 4:18 PM GMTవైసీపీ అధినాయకత్వం శుక్రవారం రాత్రి రిలీజ్ చేసిన ఆరవ జాబితాలో అనేక ఇంట్రెస్టింగ్ సీట్లు ఉన్నాయి. అందులో గోదావరి జిల్లాలకు చెందిన ఎంపీ సీట్లు రెండు ఉన్నాయి. వీటి విషయంలో మొదట అనుకున్న పేర్లు వేరు. ప్రచారంలో ఉన్న పేర్లు వేరు అయితే వైసీపీ ఎంపిక చేసిన వారి పేర్లు వేరు అని అంటున్నారు.
ఇక వైసీపీ అధినాయకత్వాన్ని గత అయిదేళ్ళుగా ముప్పతిప్పలు పెడుతున్న రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు మీద వైసీపీ ఈసారి ఎవరిని పోటీ చేయిస్తుంది అన్న చర్చ మొదలైంది. అనేక పేర్లు కూడా వచ్చాయి. అందులో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి దివంగత నటుడు యూవీ క్రిష్ణం రాజు సతీమణి పేరు కూడా సీరియస్ గా పరిశీలిస్తున్నారు అని అనుకున్నారు.
ఇటీవల క్రిష్ణం రాజు జయంతి వేళ ఆయన సతీమణి శ్యామలాదేవి మొగల్తూరులో మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్ ని నిర్వహించారు. ఆ సమయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. రాజకీయ ప్రవేశంపైన ఆమె సస్పెన్స్ లో ఉంచేశారు. దాంతో ఆమెకు వైసీపీ టికెట్ ఖాయం అనుకున్నారు. ఆమెను నర్సాపురం ఎంపీ సీటు నుంచి పోటీ చేయిస్తారు అని కూడా ప్రచారం సాగింది.
అయితే ఇపుడు గూడూరు ఉమాబాల పేరుని అనూహ్యంగా తెర పైకి తెచ్చారు ఇంతకీ ఆమె ఎవరు ఏమిటి అన్నది ప్రస్తుతానికి మీడియా వద్ద పూర్తి సమాచారం అయితే లేదు, కానీ సోషల్ ఇంజనీరింగ్ తోనే నర్సాపురం సీటు కొట్టాలని వైసీపీ హై కమాండ్ నిర్ణయించుకుని మరీ ఆమెకు నర్సాపురం ఇచ్చారని అంటున్నారు.
అదే విధంగా రాజమండ్రి ఎంపీ సీటు విషయంలో ప్రముఖ సినీ డైరెక్టర్ వీవీ వినాయక్ తో పాటు ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ తీరా చూస్తే ఈ సీటుకు గూడూరు శ్రీనివాస్ పేరు ప్రకటించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వడం ద్వారా ఇక్కడ కూడా సోషల్ ఇంజనీరింగ్ ని వైసీపీ ఫాలో అయిందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ ఆరవ జాబితాలో రఘురామకు ప్రత్యర్ధి ఎవరో తెలిసిపోయింది. మరీ అటు రఘురామ ఇటు ఉమాబాలలో విజేత ఎవరు అన్నది కొద్ది నెలలలో తేలనుంది.