ఏపీ పాలిటిక్స్.. పటాకులు సైలెంట్.. మతాబులు పేలుతున్నాయ్..!
ఏపీలో షర్మిల-జగన్ వివాదంతోపాటు.. జంపింగుల జోరు కూడా దీపావళిని ముందుగానే తెచ్చేసింది.
By: Tupaki Desk | 24 Oct 2024 5:30 PM GMTదీపావళి సీజన్ వచ్చేసింది. ఏ ఇంట చూసినా.. దీపావళి గురించే చర్చ. పైగా వచ్చిన పండుగ నెలాఖరులో రావడం.. ఆ పాటికి జీతాలు పడతాయో.. లేదో.. చేతిలో చిల్లిగవ్వ ఉంటుందో ఉండదో అనే బెంగ సామాన్య జనాల్లో కొట్టాడుతోంది. ఇక, రాజకీయాల్లోనూ దీపావళి ముందు జోష్ కనిపిస్తోంది. ఏపీ రాజకీయా ల్లోనే కాదు.. దేశరాజకీయాల్లోనూ ఈ దీపావళి మరింత హాట్‌గా మారిపోయింది. ఏపీలో షర్మిల-జగన్ వివాదంతోపాటు.. జంపింగుల జోరు కూడా దీపావళిని ముందుగానే తెచ్చేసింది.
ఊహించినవి జరిగితే.. మజా ఏముంటుంది? ఊహించని జరిగితేనే మజా.. మస్తు! ఇప్పుడు వైసీపీనుంచి కూడా అలానే ఊహించని విధంగా నాయకులు జంపింగులు కనిపిస్తున్నాయి. ``జగనే నాప్రాణం..`` అన్న వారు.. ``జగన్ కోసం.. ఏమైనా చేస్తాం`` అని వీరావేశంతో నోరు చేసుకున్న నాయకులు కూడా.. జంపింగు ల బాట పడుతున్నారు. వీరిలో అనేక మంది ఫైర్ బ్రాండ్లే ఉన్నారు. అంటే.. ఒకరకంగా పటాకులన్న మాట. మీడియా ముందుకు వచ్చి దులిపేసే రకం!
పోతుల సునీత, బాలినేని శ్రీనివాసరెడ్డి టైపు నాయకులు. కానీ, చిత్రంగా ఇలాంటి ఫైర్ బ్రాండ్లు సైలెంట్ అయిపోయారు. కానీ.. మతాబుల వంటి వారు మాత్రం రెచ్చిపోతుండడం గమనార్హం. పెద్దగా గళం లేని వారు.. ఏదో సున్నిత వాక్యాలతో మీడియా మీటింగులు పెట్టి.. మమ అనిపించిన వారు ఇప్పుడు వచ్చి.. గళాలు సవరించుకోవడం.. నిప్పులు చెరగడం చూస్తే.. మతాబులు పేలుతున్నాయా? అనే విస్మయం వ్యక్తమవుతోంది. సహజంగానే మతాబులు కాలతాయే తప్ప.. పేలవు. కానీ, వాసిరెడ్డి పద్మ వంటిమతాబు లు పేలుతున్నాయి.
ఈ విషయంపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. నిజానికి వైసీపీ అదికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో మంది ఎదురు చూసినా.. వారిని పక్కన పెట్టి.. వాసిరెడ్డికి కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవిని అప్పగించారు. ఆమె మరిచిపోయి ఉండొచ్చు. ఇక, ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. తన జోక్యం లేకుండా కూడా అప్పట్లో సీఎం జగన్ వ్యవహరించారు. అంటే సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చారు. బడ్జెట్ కూడా ఇచ్చారు. అయితే.. ఇవన్నీ.. పాత పటాకులు. ఇప్పుడు కొత్త పండుగ వచ్చింది.. కాబట్టి.. కొత్తగా ఉండాలనే వ్యూహంతో ఉన్నట్టుగా ఉన్నారు. అందుకే మతాబులైనా.. పేలుతున్నాయి!!