Begin typing your search above and press return to search.

మైక్రోసాఫ్ట్ సక్సెస్ వెనుక భారత్... బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సక్సెస్ వెనుక ఇండియన్స్ కృషి చాలా ఉందని కొనియాడారు.

By:  Tupaki Desk   |   16 Jun 2024 12:30 AM GMT
మైక్రోసాఫ్ట్  సక్సెస్  వెనుక భారత్... బిల్  గేట్స్  కీలక వ్యాఖ్యలు!
X

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్, ఫిలాంత్రపిస్ట్ అయిన బిల్ గేట్స్ తాజాగా మరోసారి భారత్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. దాదాపు ప్రతీ సందర్భంలోనూ భారత్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకునే ఆయన తాజాగా జిరోదా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో పాల్గొని మరోసారి ఈ విషయంపై స్పందించారు.

అవును... నిఖిల్ కామత్ హోస్ట్ చేసిన "పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్" అనే కొత్త సెగ్మెంట్ లో పాల్గొన్న బిల్ గేట్స్... భారత్ తో తనకున్న గొప్ప సంబంధాలు, ఎన్నో అనుబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సక్సెస్ వెనుక ఇండియన్స్ కృషి చాలా ఉందని కొనియాడారు. ఇదే సమయంలో... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపైనా చర్చించారు.

ఇందులో భాగంగా... భారత్ తో తనకు మంచి అనుబంధం ఉందని.. ఇక్కడ నుంచే నైపుణ్యమున్న గ్రాడ్యుయేట్లను మైక్రోసాఫ్ట్ లో నియమించుకుని సియాటెల్ కు తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతో వారు తిరిగి భారత్ కు వచ్చి డెవలప్మెంట్ సెంటర్ ను నెలకొల్పారని అన్నారు. ప్రస్తుతం ఇవి నాలుగు చోట్ల ఉన్నాయని.. అందులో సుమారు 25వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు.

ఇదే సమయంలో... మైక్రోసాఫ్ట్ విజయంలో భాగమైన చాలామంది అద్భుతమైన వ్యక్తులు భారత్ నుంచి వచ్చినవారే అని బిల్ గేట్స్ అన్నారు. ఇదే క్రమంలో... ప్రస్తుత మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ప్రశంసిస్తూ స్పందించిన బిల్ గేట్స్... తనకు భారత్ నుంచి దొరికిన అద్భుతమైన వ్యక్తుల్లో సత్య నాదెళ్ల అగ్రస్థానంలో ఉన్నారని.. ఇప్పుడు ఆయన సీఈవోగా గొప్పగా పనిచేస్తున్నారని అన్నారు.

ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనా బిల్ గేట్స్ స్పందించారు. ఇందులో భాగంగా.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉంటుందని వస్తున్న వాదనలను తోసి పుచ్చారు. పలు కీలకమైన రంగాల్లో ఏఐ తోడుగా ఉంటుంది, డెవలప్మెంట్ లో సాయపడుతుందని అన్నారు. దీంతో.. ఏఐపై బిల్ గేట్స్ అభిప్రాయం తెరపైకి వచ్చింది.