Begin typing your search above and press return to search.

లక్షల లీటర్ల లిక్కర్, బీరు... సంక్రాతి వేళ పాత రికార్డులు చెరిపేశారు!

సంక్రాతి సందర్భంగా ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పండుగ మూడు రోజుల్లోనూ మందుబాబులు సరికొత్త రికార్డులు సృష్టించారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Jan 2025 8:02 AM GMT
లక్షల లీటర్ల లిక్కర్, బీరు...  సంక్రాతి వేళ పాత రికార్డులు చెరిపేశారు!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన స్థాయిలో.. సంక్రాంతి సంబరాల్లో కోడిపందేలు, గుండాట, మరికొన్ని జూదక్రీడలతో పాటు మద్యం ఏరులై పారిన వ్యవహారం ఇటీవల కాలంలో ఏనాడు జరగలేదనే చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... పండుగ వేళ కోడి పందేల ప్రాంగణాల్లోనే మద్యం అందుబాటులో ఉంచడంతో మందుబాబులు చెలరేగిపోయారని అంటున్నారు.

అవును... సంక్రాతి సందర్భంగా ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పండుగ మూడు రోజుల్లోనూ మందుబాబులు సరికొత్త రికార్డులు సృష్టించారని అంటున్నారు. ఇందులో భాగంగా... భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల్లో కలిపి సుమారు రూ.400 కోట్ల విలువైన మద్యాన్ని ఊదేశారని అంటున్నారు.

ప్రధానంగా... సంక్రాంతి, కనుమ రెండు రోజుల్లో సరాసరిన రోజుకు రూ.150 కోట్ల మేర అమ్మకాలు జరిగాయని అంటున్నారు. దీంతో.. ఈ పండుగ వేళ మందుబాబుల సంబరాలు అంబరాన్ని అంటినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఒక్క ఉమ్మడి విశాఖ జిల్లాలోనే సుమారు రూ.52 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అంటున్నారు.

వాస్తవానికి ఏపీలో సాధారణ రోజుల్లో రోజుకు సగటున రూ.80 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని.. అయితే సంక్రాంతి ఎఫెక్ట్ తో మూడు రోజుల్లోనూ మొత్తం రూ.160 కోట్లు అదనంగా అమ్ముడైందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకూ 2.29 లక్షల కేసుల బీర్లు, 6.99 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి!

మరోపక్క... ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలోనూ మద్యం అమ్మకాలు జోరు జోరుగా సాగాయని చెబుతున్నారు. అక్కడ రెగ్యులర్ రోజుల్లో రూ.6 నుంచి 8 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతాయని అంటున్నారు. అయితే... 12, 13 తేదీల్లో రూ.28 కోట్లు 16న మరో రూ.24 కోట్లు అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

అంటే... సరాసరి రోజుకు రూ.17 కోట్ల చొప్పున పండుగ మూడు రోజులూ రూ.52 కోట్ల వరకూ విక్రయాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్క జీవీఎంసీ పరిధిలోనే మూడు రోజుల్లో రూ.24 కోట్ల అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. దీంతో... గతంలో సంక్రాంతికి ఎప్పుడూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదనే కామెంట్లు ఎక్సైజ్ శాఖ నుంచి వినిపిస్తున్నాయి!