Begin typing your search above and press return to search.

జనవరి 1న ఒక్కరోజులో 56.84 కోట్ల లావాదేవీలు

ఈ మధ్యనే ముగిసిన డిసెంబరు 31న దేశ ప్రజలు రికార్డు స్థాయిలో డిజిటల్ చెల్లింపుల్ని జరిపిన వైనం బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   4 Jan 2025 6:12 AM GMT
జనవరి 1న ఒక్కరోజులో 56.84 కోట్ల లావాదేవీలు
X

డిజిటల్ చెల్లింపుల దూకుడు మామూలుగా లేదు. సులువుగా ఉండే వాటిని అలవాటు చేయాలే కానీ మనోళ్లు ఎంతలా చెలరేగిపోతారన్న దానికి డిజిటల్ చెల్లింపుల అంశమే ఒక పెద్ద ఉదాహరణగా చెప్పాలి. 2016లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) పద్దతిలో మొబైల్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి చెల్లింపులు జరిపే తీరుకు దేశ ప్రజలు భారీగా అలవాటు పడిపోయారు. ఎంతలా అంటే.. ఈ రోజున రూ.500 నోటు తీసుకెళ్లి చిల్లర నోట్లు కావాలంటే తెగ తిరగాల్సిన పరిస్థితి. చివరకు రూపాయి.. రెండు రూపాయిలు లాంటి చిరు మొత్తాల్ని సైతం మొబైల్ ద్వారా చెల్లింపులు జరిపే తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. చిరు వ్యాపారులు సైతం దీన్నే ప్రోత్సహించటంతో డిజిటల్ పేమెంట్ల చెల్లింపులు భారీగా సాగుతున్నాయి.

నగరాల్లో మొదలైన ఈ ట్రెండ్ క్రమంగా పల్లెలకు పాకటమే కాదు.. ఈ రోజున పెద్ద ఎత్తున పేమెంట్లు డిజిటల్ పద్దతిలోనే సాగుతున్న పరిస్థితి. క్షణాల్లో ఎక్కడి నుంచైనా.. ఎక్కడికైనా గరిష్ఠంగా లక్ష రూపాయిల వరకు బ్యాంక్ ఖాతా నుంచి బ్యాంక్ ఖాతాకు.. మొబైల్ నెంబరుకు.. యూపీఐ ఐడీ.. క్యూఆర్ కోడ్ కు సురక్షితంగా.. సులువుగా ఉండే డిజిటల్ చెల్లింపుల్ని యూపీఐ సుసాధ్యం చేసింది.

దీంతో అందరూ డిజిటల్ పేమెంట్ల బాట పడుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే ముగిసిన డిసెంబరు 31న దేశ ప్రజలు రికార్డు స్థాయిలో డిజిటల్ చెల్లింపుల్ని జరిపిన వైనం బయటకు వచ్చింది. ఒక్క డిసెంబరు 31 రోజున యావత్ దేశం మొత్తం రూ.93,148 కోట్ల విలువైన లావాదేవీలు జరిపినట్లుగా తేల్చారు. యూపీఐ చరిత్రలో 2016 ఏప్రిల్ నుంచి 2025 జనవరి 1 వరకు ఒక రోజులో అత్యధిక లావాదేవీలుజరిగిన రికార్డును డిసెంబరు 31, 2024 నమోదు చేసింది. ఈ జోరు జనవరి 1 రోజున కూడా సాగింది. ఈ ఏడాది మొదటి రోజున రూ.81,015.97 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.అంటే.. రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా యూపీఐ ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1.74 లక్షల కోట్లు కావటం విశేషం.

గడిచిన ఏడాది డిసెంబరు ఒక్క నెలలోనే సగటున రోజుకు 74,990 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లుగా తేల్చారు. యూపీై లావాదేవీల సంఖ్య గత నెలలో 8 శాతం దూసుకెళ్లింది. మొత్తంగా డిసెంబరులో 1,673 కోట్లుగా లావాదేవీలు ఉంటే.. నవంబరులో ఈ సంఖ్య 1548 కోట్లుగా ఉంది. లావాదేవీల విలువ (రూపాయిల్లో) డిసెంబరు ఒక్క నెలలోనే రూ.23.25 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది నవంబరులో ఇది రూ.21.55 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం.