Begin typing your search above and press return to search.

రాజారెడ్డి రాజ్యాంగం Vs రెడ్ బుక్ రాజ్యాంగం!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని విపక్షం వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   13 March 2025 10:00 PM IST
రాజారెడ్డి రాజ్యాంగం Vs రెడ్ బుక్ రాజ్యాంగం!
X

ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన సాగుతుందా? లేదా? గతంలోనూ, ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతోంది. అధికారంలో ఎవరు ఉన్నా మన రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి. చట్టం, న్యాయం, పాలన ఏదైనా సరే రాజ్యాంగ సూత్రాలను అనుసరించాల్సిందే.. కానీ, ఏపీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై కన్నా, మరో రెండు రాజ్యాంగాలు అంటూ ఎక్కువ ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం నడుకున్నారని విమర్శలు వినిపిస్తే.. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండగా, రాజారెడ్డి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగంపై విమర్శలు, ప్రతి విమర్శలు ఏంటి? ఈ సెపరేట్ రాజ్యాంగాలకు ఎండ్ పాయింట్ ఉండదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని విపక్షం వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రలో అంకురార్పణ జరిగిన రెడ్ బుక్.. ఇప్పుడు పాలనకు గీటురాయిగా మారిందని వైసీపీ ఆరోపిస్తోంది. నారా లోకేశ్ రెడ్ బుక్ ప్రకారం తమ నేతలపై కేసులు, అరెస్టులు, వేధింపులు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని, టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు, అనుచత వ్యాఖ్యలు, తిట్లు, బూతులు, వేధింపులతో రెచ్చిపోయారని టీడీపీ ఎదురుదాడి చేస్తూ గుర్తు చేస్తోంది. ఈ విధంగా రెండు పార్టీలు దేశ రాజ్యాంగానికి బదులుగా తమ సొంత అజెండాను అమలు చేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ సొంత అజెండాల అమలులోనూ ఒక్కోపార్టీ ఒక్కో పంథా అనుసరించడం ఆసక్తి రేపుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల నుంచి పార్టీ అధినేత చంద్రబాబు వరకు అరెస్టుల పరంపర కొనసాగింది. అర్థరాత్రి అరెస్టులే కాకుండా, శని ఆదివారాల్లో పోలీసులు నోటీసులతో వచ్చి రాత్రికిరాత్రే ఎత్తుకుపోయేవారు. అదేవిధంగా అనుమతిలేని నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు అంటూ టీడీపీ నేతలు, వారి అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై బుల్డోజర్ పడేది. ఈ పరిస్థితుల్లో తమ కార్యకర్తలను వేధించడానికి రాజారెడ్డి రాజ్యాంగం అనే పదాన్ని ప్రయోగించి వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది టీడీపీ. అయితే వైసీపీ తనపై వస్తున్న విమర్శల విషయంలో పెద్దగా పట్టంచుకోలేదు. మరీ ముఖ్యంగా రాజారెడ్డి రాజ్యాంగం అనే పదాన్ని తప్పుబట్టడమో.. లేదనో, ఉందనో చెప్పనూలేదు. కానీ, ఇప్పుడు టీడీపీ యువనేత లోకేశ్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రెడ్ బుక్ ప్రకారం చర్యలు ఉంటాయని తేల్చిచెబుతూ తన రూటు సెపరేటు అంటూ స్పష్టం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో బాగా పాపులర్ అయిన రెడ్ బుక్ ఆ తర్వాత మరింత ట్రెండింగులోకి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉండగా, రెడ్ బుక్ పేరును గేళి చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆ పేరు వింటేనే భయపడిపోతున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా రెడ్ బుక్ ప్రకారం తమను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. అయితే ప్రతిపక్షం విమర్శలపై టీడీపీ స్పందిస్తూ.. ఔను రెడ్ బుక్ అమలు చేస్తున్నామంటున్నా, విపక్షం ఎదుర్కోలేకపోవడమే రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధికారంలో ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ఏ పనిచేసినా వెంటనే కోర్టును ఆశ్రయించి టీడీపీ నేతలు రక్షణ పొందేవారు. కానీ, ఇప్పుడు రెడ్ బుక్ ప్రకారం నడుచుకుంటూ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నా, కోర్టుల్లో తగిన ఆధారాలు చూపలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో రాజారెడ్డి రాజ్యాంగం కన్నా రెడ్ బుక్ రాజ్యాంగమే పవర్ ఫుల్ అంటూ చర్చ జరుగుతోంది.

రెడ్ బుక్ రాజ్యాంగంపై విపక్షం విమర్శలను ధాటిగా ఎదుర్కొంటున్నారు మంత్రి నారా లోకేశ్. తన పాదయాత్రలో రాసుకున్న ప్రకారం ఒక్కో చాప్టర్ పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అరెస్టు అయిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, మాజీ ఎంపీ నందిగాం సురేశ్, వైసీపీ నేతలు పోసాని క్రిష్ణమురళితోపాటు మరికొందరు రెడ్ బుక్ లో పేర్లు ఉన్నవారే అని టీడీపీ చెబుతోంది. దీంతో గతంలో తమ పేర్లు రాస్తున్నామని లోకేశ్ చేసిన హెచ్చరికలను లైట్ తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. పక్కా ఆధారాలు సేకరిస్తూ కేసుల్లో ఇరికిస్తుండటంతో చాలా మంది సైలెంట్ అయిపోతున్నారని అంటున్నారు. మీరు మమ్మల్ని మాట్లాడిస్తే, రెడ్ బుక్ బయటకు వస్తుందని కొందరు వైసీపీ నేతలు జంకుతుండటంతో రెడ్ బుక్ వారిని భయపెట్టిందని అంటున్నారు. మొత్తానికి ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే రాజారెడ్డి రాజ్యాంగం కన్నా రెడ్ బుక్ రాజ్యాంగమే ఎక్కువ ఎఫెక్ట్ చూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.