Begin typing your search above and press return to search.

ఎర్ర బుక్కు ని తట్టుకోవడం కష్టమేనా ?

పొరుగు రాష్ట్రంలో దీనిని స్పూర్తిగా తీసుకుని అక్కడ నేతలు పింక్ బుక్ అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Feb 2025 3:56 AM GMT
ఎర్ర బుక్కు ని తట్టుకోవడం కష్టమేనా ?
X

రెడ్ బుక్ తెలుగులో ఎర్ర బుక్. ఇది మొదట్లో నారా లోకేష్ యువ గళం సందర్భంగా పరిచయం చేసిన మాట. అప్పట్లో ఎర్ర బుక్ ఏంటో అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు ఏపీలో ఎర్ర బుక్ గురించే అతి పెద్ద చర్చగా ఉంది. ఎర్ర బుక్ రాజ్యాంగం అని వైసీపీ నిత్యం స్మరిస్తోంది. పొరుగు రాష్ట్రంలో దీనిని స్పూర్తిగా తీసుకుని అక్కడ నేతలు పింక్ బుక్ అని అంటున్నారు.

ఏపీలోనే వైసీపీ నేతలు కూడా తామూ ఒక బుక్ రాస్తామని చెబుతునారు. ప్రజలు కూడా కూటమి అరాచకాల మీద బుక్ రాయాలని కోరుతున్నారు. ఇలా ఇంతలా ఇన్నేసి బుక్స్ రాయించేలా చేసింది రెడ్ బుక్. ఇది ఇంతలా పాపులర్ అవుతుందని తాను కూడా అనుకోలేదని ఆ మధ్యన దావోస్ టూర్ లో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు కూడా.

ఇదిలా ఉంటే రెడ్ బుక్ అన్నది ప్రజలకు చెప్పే అమలు చేస్తున్నామని లోకేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 90 దాకా బహిరంగ సభలలో రెడ్ బుక్ ని చూపించి ప్రజల మధ్యనే ఈ విషయాలు చెప్పాను అన్నారు. తమను అప్పటి వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు వారి చేసిన అరాచకాల మీద తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చట్ట ప్రకారం న్యాయబద్ధంగా చర్యలు తీసుకుంటామని చెప్పామని అన్నారు.

ఇపుడు వల్లభనేని వంశీ ఒక దళితుడిని కిడ్నాప్ చేసిన ఘటనలో అరెస్ట్ అయ్యారని తొందరలో అనేక వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే రెడ్ బుక్ లో రాసుకున్న అక్రమాలు చేసిన అధికారులు నేతల విషయంలో చట్టపరమైన చర్యలు తప్పవని లోకేష్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఈ విషయంలో ప్రజల మధ్యనే అన్నీ చెప్పామని అంటున్నారు.

చూడబోతే వంశీ అరెస్ట్ అయ్యారు ఆయన తరువాత ఎవరు అన్న చర్చ కూడా వస్తోంది. అయితే రెడ్ బుక్ లో రాసిన పేర్లు ప్రకారం అందరి మీద సరైన ఆధారాలతో చట్టబద్ధంగానే అరెస్టులు కేసులు ఉంటాయని అంటున్నారు. ప్రజలలో రెడ్ బుక్ ని చూపించే ఇవన్నీ చేస్తున్నామని చెబుతున్నారు. కాబట్టి నాటి అరాచక పాలన చేసిన వారికి శిక్షలు పడితే ఎవరూ ఈ విషయంలో సానుభూతి చూపించే అవకాశమే లేదని టీడీపీ నేతలు అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడులు చేశారని అలాతే తమ ఇళ్ళ వద్దకు వచ్చి తాళ్ళతో కట్టారని లోకేష్ చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఏ ఒక్కరినీ వదిలేది లేదనే స్పష్టం అవుతోంది. దాంతో ఎర్ర బుక్కుని తట్టుకోవడం కష్టమే అన్న భావన వైసీపీలో ఏర్పడుతోంది.

ఎంత సైలెంట్ గా ఉన్నా ఎక్కడో ఉన్నా సరే సరైన టైం లో వారిని తెచ్చి కేసులు కట్టి ఆధారసహితంగా నిరూపిస్తామని కూటమి పెద్దలు చెబుతున్న దానిని బట్టి చూస్తే రెడ్ బుక్ టఫ్ టాస్క్ అని అర్ధమవుతోంది. వైసీపీ అధినాయకత్వం చెప్పినంత సులువుగా కేసులదేముందబ్బా అన్నదైతే ఎవరికీ ఉండదని అంటున్నారు. మొత్తానికి వైసీపీ శిబిరంలో రెడ్ బుక్ అలజడి రేపుతోందా అన్నది మాత్రం చర్చగానే ఉంది.