రెడ్ల సంగతేంటి జగనన్నా ..!
ఈ నేపథ్యంలో కూటమి సర్కారు విషయంలో రెడ్లు ఆలోచనలో పడ్డారు. తమను కార్నర్ చేస్తూ.. వ్యాఖ్య లు సంధించిన అధికారికి పదవి ఇవ్వడంపై అసంతృప్తితోనూ ఉన్నారు.
By: Tupaki Desk | 9 Feb 2025 9:59 AM GMTవైసీపీకి వెన్నెముక ఎవరైనా ఉంటే.. అది రెడ్డి సామాజిక వర్గమే. గతంలో అధికారం కోల్పోయినప్పుడు వారే అండగా ఉన్నారు. తర్వాత.. అధికారం రావడంలోనూ కీలకంగా రెడ్డి సామాజిక వర్గమే పనిచేసింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. వారికి తగిన విధంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యం దక్కలేదు. ఇది రెడ్డి సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించి.. 2024 ఎన్నికలకు ముందు ఏకపక్షంగా అంతర్గత చర్చలు జరిపి.. కూటమికి జై కొట్టారు.
అయితే.. ఇప్పుడు అదే రెడ్లు కూటమి సర్కారు విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది నిజం. కొందరు పార్టీలతో సంబంధం లేకపోయినా.. కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్న తీరు, రెడ్లపై విమర్శలు చేస్తున్న తీరు వంటివి వారిని అసంతృప్తికి గురి చేస్తున్నాయి. మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.. కమ్మ వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మంటలు ఇంకా చల్లారలేదు. కానీ, ఆయనకు కీలకమైన పదవిని కట్టబెట్టారు. ఇది మరింత ఆగ్రహానికి గురయ్యేలా రెడ్లను ప్రేరేపించింది.
ఈ నేపథ్యంలో కూటమి సర్కారు విషయంలో రెడ్లు ఆలోచనలో పడ్డారు. తమను కార్నర్ చేస్తూ.. వ్యాఖ్య లు సంధించిన అధికారికి పదవి ఇవ్వడంపై అసంతృప్తితోనూ ఉన్నారు. ఈ సమయంలో జగన్ మీడియా ముందుకు వచ్చినా.. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పన్నెత్తు మాట కూడా వ్యాఖ్యానించలేదు. రెడ్డి సామాజిక వర్గానికి తాను అండగా ఉంటానని.. కలసి రావాలని కూడా పిలుపునివ్వలేదు. దీనిపైనా వారు ఆలోచనలో పడ్డారు. రెంటికీ చెడ్డ రేవడిగా తమ పరిస్థితి మారుతోందన్న ఆవేదన కనిపిస్తోంది.
నిజానికి ఇప్పుడు జగన్ కనుక రెడ్డి సామాజిక వర్గానికి పావలా వంతు మద్దతు ప్రకటిస్తే.. వారు ముప్పావలా వంతు దూసుకుపోయేందుకు రెడీగా ఉన్నారన్నది స్థానికంగా అన్ని జిల్లాల్లోనూ జరుగుతున్న చర్చ. కానీ.. కార్యకర్తలకు బూస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించిన జగన్.. తన సొంత సామాజిక వర్గాన్ని మాత్రం విస్మరించారు. ఇది రెడ్డి వర్గానికి రుచించడం లేదు. ఇప్పటికైనా జగన్ సామాజిక వర్గాల వారిగా .. అందరికీ ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. కీలకమైన రెడ్డి సామాజిక వర్గాన్ని దరిచేర్చుకుంటే తప్ప.. పోయిన ప్రాభవం దక్కడం కష్టమనే సూచనలు వస్తున్నాయి.