Begin typing your search above and press return to search.

జగన్ ని ఓడగొట్టింది రెడ్లు నా ?

కులం లేనిదే మనిషి లేడు. మనిషి ఆస్తి అస్తిత్వం కులం ప్రాంతం మతం ఇలా చాలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   13 Jun 2024 3:56 AM GMT
జగన్ ని ఓడగొట్టింది రెడ్లు నా ?
X

కులం లేనిదే మనిషి లేడు. మనిషి ఆస్తి అస్తిత్వం కులం ప్రాంతం మతం ఇలా చాలా ఉన్నాయి. నీవు ఎవరివి అని అడిగితే ఏమి చెబుతారు. పేరు చెబుతారు. ఆ పేరులోనే కులం ఉంటుంది తోక లేకపోయినా కులం సౌండ్ ఇండైరెక్ట్ గానైనా ఉంటుంది. అలా మనిషి అస్తిత్వం గా కులం మారిపోయింది.

భారదేశం లాంటి సనాతన దేశంలో కులం కూడు పెడుతుందా అంటే గద్దెను అందిస్తుంది. రాజుని చేస్తుంది. కాదనుకుంటే జాతకం మారుతుంది. జగన్ విషయంలో అక్షరాలా జరిగింది ఇదే అని వైసీపీ ఓటమి వెనక అసలైన గ్రౌండ్ రిపోర్ట్ చెబుతోంది. అహం బ్రహస్మీ అని జగన్ అనుకున్నారో లేదో తెలియదు కానీ రెడ్డి అన్న పవర్ ఫుల్ ట్యాగ్ ని మాత్రం లైట్ తీసుకున్నారు అన్నదే రిజల్ట్స్ చెప్పిన అసలైన సత్యం.

జగన్ ఎందుకు ఓడారు అంటే జవాబులు లేని ప్రశ్నలు ఎన్నో. అలాగే ఎన్నో అర్ధం కాని జవాబులూ ఉంటాయి. అందులో చాలా తప్పులు కనిపిస్తాయి. అదే జగన్ గెలిస్తే ఈ తప్పులు ఏవీ ఎవరికీ కనిపించవు. కానీ ఇపుడు జగన్ అయిదేళ్ల పాలనలో బూతద్ధంతో వెతికిపట్టి తప్పుల అన్వేషణ చేస్తున్న వారే ఎక్కువ.

ఇవన్నీ పక్కన పెడితే జగన్ అధికారంలోకి రావడానికి కానీ ఆయన పార్టీ పురుడు పోసుకోవడానికి కానీ ఆయన రాజకీయ అస్తిత్వం వెనక ఊపిరిగా నిలిచిన వారు కానీ చూస్తే బలమైన రెడ్లు కనిపిస్తారు. వారికి జగన్ కి మధ్య బంధం ఏంటి అంటే కులమే. మా వాడు అన్న దానితోనే కలుపుకున్నారు. జగన్ తోనే తమ రాజకీయ పయనం అనుకున్నారు

జగన్ కి సీఎం కుర్చీ అంత సులువుగా దక్కలేదు. ఆయన 2009 సెప్టెంబర్ 2న తండ్రి వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యేనాటికి మూడు నెలల ఎంపీ మాత్రమే. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినపుడు ఆయన వెన్నంటి ఉన్నది బలమైన రెడ్డి సామాజిక వర్గమే. జగన్ కోసం కాంగ్రెస్ ని వదిలేసి వచ్చిన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది వారే కనిపిస్తారు.

ఆనాటి నుంచి జగన్ రాజకీయ పోరాటం మొదలెడితే 2019 నాటికి అధికారం అందుకున్నారు మరి ఈ పదేళ్ళలో జగన్ వెంట నడిచిన వారు తమ ఆస్తులు అమ్ముకున్నారు. కోట్లు తీసి ఖర్చు పెట్టారు. జగన్ కోసం అప్పటి అధికార పార్టీలకు కన్నెర్ర అయ్యారు. టార్గెట్ గా మారారు. అయినా సరే మా జగన్ గెలిస్తే చాలు అనుకున్నారు.

జగన్ మీటింగులకు కానీ పోరాటాలకు కానీ ఆఖరుకు రెండేళ్ళ పాటు సాగిన పాదయాత్రకు కానీ ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఖర్చు పెట్టింది జనాలను పోగు చేసింది జగన్ చుట్టూ వలయంగా ఏర్పడింది రెడ్లు కాక మరి ఎవరు అంటే జవాబు అదే అవుతుంది తప్ప వేరొకటి కాదు.

అంతలా జగన్ కోసం పనిచేసిన రెడ్లకు జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక సామాజిక న్యాయం పేరు చెప్పి దూరం పెట్టారు అన్నది కఠిన వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీలో ఏర్పడితే రెడ్లకు జనాభాతో సంబంధం లేకుండా ఎక్కువ పదవులు దక్కేవి. దానికి కారణం వారు ప్రభావవంతమైన సామాజిక వర్గం. వారి వల్ల మిగిలిన సామాజిక వర్గాలు ప్రభావితం అవుతాయి.

ఏపీలో చూసుకుంటే కనీసం డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలలో రెడ్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. సమాజంలో వారు భాగమవుతూ జగన్ చెబుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో కలసి మెలసి ఉంటూ అందరి హితం కోసం పనిచేయడం చాలా దశాబ్దాల నుంచే అలవాటు చేసుకున్నారు. అలాంటి రెడ్లను పక్కన పెట్టడం వల్ల వారు పూర్తిగా కుమిలిపోయారు.

తమ ప్రభుత్వం అని అనుకోవాల్సిన చోట పరాయివారుగా మారిపోయారు. పై స్థాయిలో తన వంది మాగధులు లాంటి ఒక నలుగురైదుగురు రెడ్లను జగన్ సమాదరించవచ్చు కాక కానీ క్షేత్ర స్థాయిలో రెడ్ల పరిస్థితి మాత్రం దారుణం. అంతే కాదు వైసీపీ 151 సీట్లలో గెలిస్తే అందులో మూడవ వంతు అంటే 50 దాకా రెడ్లు నాడు గెలిచారు.

మరి ఆ లెక్క ప్రకారం చూసుకున్నా పాతిక మంది మంత్రులలో వారికి కచ్చితంగా దక్కాల్సింది మూడవ వంతు కదా అన్న వాదన ఉంది. అంటే తొమ్మిది మంత్రి పదవులు అన్న మాట. అది కాకపోయే అందులో సగం కూడా లేవు. మూడు నాలుగు అని ఇచ్చి బహుజనులకు అంటూ సింహ భాగం పంచేయడం ద్వారా జగన్ తన సొంత రాజకీయ పునాదులు వేసుకోవాలని చూశారు.

అందులో తప్పేమీ లేదు. కానీ ముందుగా తనను సమాదరించిన వారి రుణం తీర్చుకుంటూ మెల్లగా తరువాత ఎన్నికల నాటికి తన సొంత రాజకీయ సిద్ధాంతాన్ని అమలు చేసుకుంటూ పోతే ఏమో కానీ అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టినట్లుగా రెడ్ల మీద పగ పట్టినట్లుగా పదవులలో కోత పెట్టడం వల్లనే వారంతా దూరం అయ్యారు అన్నది సిసలైన నగ్న సత్యం అంటున్నారు.

అదే చంద్రబాబు కమ్మ కులం నుంచి తనను వేరుగా చూపించుకోవడానికి ఇష్టపడరు. వారు కూడా ఆయనను తమ ప్రతినిధిగా చూసారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల్లో ఓడాక కులం అవసరం తెలుసుకుని చాలా లౌక్యంగా నడచుకున్నారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో గోదావరి జిల్లాలలో జనసేన ప్రభంజనం కనిపించింది.

కానీ జగన్ మాత్రం నేల విడిచి సాము చేశారు అని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ ని నెత్తిన పెట్టుకుని లక్షల మెజారిటీ ఇచ్చిన కడపలోనే వైసీపీకి ఘోర పరాజయంతో పలకరించారు. ఇక మతం గురించి వస్తే ఇది హిందూ జనాభా అధికంగా ఉండే మతం. జగన్ హిందూ ధర్మాన్ని పాటించకుండా వారిని అవమాన పరచారు అన్నది ఉంది. దేవాలయాలకు వెళ్ళినపుడు తన సతీమణిని ఆయన పక్కన పెట్టుకుని వెళ్ళి ఉంటే బాగుండేది అని కూడా అంటున్నారు. కానీ జగన్ అలా చేయలేదు. దాంతో ఆయన మీద ఉన్న మత్ర ముద్రను ప్రత్యర్ధులు పెంచి రాజకీయ లబ్దిని పొందారు.

అదే విధంగా మరి కొన్ని కారణాలు చూస్తే కనుక ఉద్యోగులు - నిరుద్యోగులు కూడా జగన్ని ఓడించారు. ఉద్యోగుల డిమాండ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని జగన్ మీద వారు కోపం పెంచుకున్నరు. అలాగే నిరుద్యోగుల విషయంలో నోటిఫికేషన్లు నిర్లక్ష్యం చేశారని వారు ఫైర్ అయి ఓట్లు వేయలేదు.

ఇంత జరిగినా జగన్ వైసీపీ బలం బాగానే ఉంది. ఎలా అంటే సింగిల్ గా పోటీ చేసిన వైసీపీకి కూటమికి మధ్య 20 లక్షల ఓటు బ్యాంకు మాత్రమే తేడా ఉన్నది. ఈసీ వివరాల ప్రకారం టీడీపీకి 1.53 కోట్లు, వైసీపీకి 1.32 కోట్ల ఓట్లు పోలయ్యాయి. జనసేన పార్టీకి 28 లక్షలు, బీజేపీకి 9.5 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 5.8 లక్షల ఓట్లు దక్కించుకుంది. అలా బలంగానే వైసీపీ ఉందని చెప్పుకోవాలి

అలాగే సంస్థాగతంగా వైసీపీ బలంగానే ఉంది. భవిష్యత్తులో పుంజుకునే పరిస్థితి ఉన్నది. అయితే గెలుపు కోసం చేయాల్సింది చాలా ఉంది. నేను మారానూ అని జగన్ అనిపించుకోవాలి. కేవలం ఏసీ గదుల్లో కూర్చుని ప్రజల నాడిని అంచనా వేసే సలహాదారుల్ని పక్కకు పెట్టాలి. జనాల్లో తిరిగే నిజమైన నాయకుల్ని కార్యకర్తల్ని నమ్మాలి. దూరమైన సామాజిక వర్గాలను చేరదీయాలి. రెడ్ల విశ్వాసం పూర్తిగా పొందాలి. తన పేరులోని రెడ్డి ట్యాగ్ పవర్ ఏంటో అర్థం చేసుకుని గమనం సాగిస్తే బూత్ లెవెల్ క్యాడర్ కి భరోసాగా నిలిస్తే పార్టీలో అందరికీ బాధ్యుడిగా కనిపిస్తే పార్టీతోనే అంతా అని విశ్వసిస్తే జగన్ కి మంచి రోజులు వస్తాయని అంటున్నారు.