Begin typing your search above and press return to search.

ఏపీలో రెడ్లు అంద‌రూ కుత‌కుత‌.. ఉడికిపోతున్నారుగా...!

ఈ ప్రభావం తాజాగా జరిగిన ఎన్నికల్లో తీవ్రంగా పడింది. దీంతో రెడ్డి సామాజిక వర్గం జగన్‌కు చాలావరకు దూరమైపోయింది

By:  Tupaki Desk   |   17 July 2024 4:30 PM GMT
ఏపీలో రెడ్లు అంద‌రూ కుత‌కుత‌.. ఉడికిపోతున్నారుగా...!
X

రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం చాలా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గాన్ని సాధ్యమైనంత దూరంగా పెట్టింది. కేవలం సజ్జ‌ల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలా కొంతమంది అత్యంత సన్నిహితులైన రెడ్డి నాయకులను మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేరదీశారు. వారిని మాత్రమే ప్రభుత్వంలో కీలకమైన భాగస్వాములుగా చేర్చుకున్నారు. అదే సమయంలో ఇతర రెడ్డి సామాజిక వర్గాన్ని, 2019 ఎన్నికల సమయంలో వైసీపీని ఆర్థికంగా ఆదుకున్న రాజకీయంగా మద్దతు ఇచ్చిన కీలకమైన రెడ్డి నేత‌ల‌ను జగన్ పట్టించుకోలేదు.

ఈ ప్రభావం తాజాగా జరిగిన ఎన్నికల్లో తీవ్రంగా పడింది. దీంతో రెడ్డి సామాజిక వర్గం జగన్‌కు చాలావరకు దూరమైపోయింది. ఉదాహరణకు 2014లో టిడిపి తరఫున గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2019 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీలోకి వచ్చారు. అయితే ఆయన ఓడిపోయినా.. పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం ఉంటుందని భావించారు. కానీ జగన్ ఆయనను పట్టించుకోలేదు. ఈ ప్రభావం గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు స్థానాల్లో బలంగా పడింది. పైకి ఎవరూ చెప్పకపోయినా అంతర్గత సమాచారం ప్రకారం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు.

అదేవిధంగా నెల్లూరు జిల్లాలోనూ ఒకరిద్దరూ కీలకమైన రెడ్డి నాయకులు వైసీపీకి యాంటీగా వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్‌ను ఓడించి తీరాలని కంకణం కట్టుకుని అదేవిధంగా పనిచేశారు. దీంతో నెల్లూరులో కూడా వైసిపి పరిస్థితి దారుణంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో ఏ రెడ్డి సామాజిక వర్గం అయితే పార్టీకి అండగా ఉందో.. ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే.

జగన్ వల్ల తనకు ఏదో మేలు జరుగుతుందని భావించిన రెడ్డి సామాజిక వర్గం 2019లో వైసీపీకి అండగా నిలబడింది. 2024 వచ్చేసరికి తమ వ్యాపారాలు దెబ్బతిన‌డం, తమకు ప్రాధాన్యం లేకపోవడం రాజకీయంగా తమకు ఎలాంటి మద్దతు లభించక పోవ‌డం కార‌ణంగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామం వల్లే నెల్లూరులో అన్ని స్థానాల్లోనూ వైసీపీ ఓడిపోగా టిడిపి గెలుపు గుర్రం ఎక్కింది. ఇది ఒక రకంగా చంద్రబాబు గ్రహించాల్సిన విషయం.

ఇప్పుడు ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం ముగ్గురికి మాత్రమే రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఇచ్చారు. వాటిల్లోనూ కీలకమైన శాఖలు ఇవ్వకపోవడం రెడ్డి సామాజిక వర్గాన్ని ఆవేదనకు గురిచేస్తుంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కేడర్ను పట్టించుకోవడం లేదని కూడా రెడ్డి సామాజిక వర్గంలో చర్చ‌ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ స్థాయిలో ఐఏఎస్ అధికారులను గమనిస్తే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అందరినీ చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే పక్కన పెట్టేశారు.

ఐపీఎస్ అధికారులను కూడా పక్కన పెట్టేసారు. అదే విధంగా రెడ్డి సామాజిక వర్గంపై క్షేత్రస్థాయిలో టిడిపి నాయకులు బురదజల్లే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. సమాజానికి మేలు చేయకపోగా దోచుకుంటారనే దారిలో టిడిపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలతో రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు ఆందోళనలో పడింది. జగన్ ను కాదని చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందుకు తాము చింతించే పరిస్థితి వస్తుందా అని రెడ్లు భావించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు ఈ విషయంలో జాగ్రత్తపడి రెడ్డి సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో కూడా పార్టీకి వారు అండగా ఉండే అవకాశం ఉంది.