ఉమ్మడి చిత్తూరులో ఆ ముగ్గురు రెడ్లదే హవా..?
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో ఏ పనికావాలన్నా.. ఆ ముగ్గురు రెడ్డి నాయకులతోనే అవుతుందా?
By: Tupaki Desk | 16 Aug 2023 5:52 AM GMTఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో ఏ పనికావాలన్నా.. ఆ ముగ్గురు రెడ్డి నాయకులతోనే అవుతుందా? వైసీపీ అధిష్టానం కూడా ఫుల్ పవర్ ఆ ముగ్గురు రెడ్డి నాయకులకే అప్పగించిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. దీంతో ఇతర సామాజిక వర్గాల నాయకులు పార్టీపై గుర్రుగా ఉంటున్నారనే వాదన వినిపిస్తోంది. అంతా రెడ్డి మయం.. అంటూ.. తిరుపతిలోను.. చిత్తూరులోనూ విమర్శలు కూడా వస్తున్నాయి.
ఉమ్మడి చిత్తూరులోని చంద్రగిరి తదితర ప్రాంతాల్లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఇక, పుంగనూరు, పీలేరు, పలమనేరు వంటి నియోజకవర్గాలు సహా కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పుతున్నారు. అసలు జిల్లాలో మూడొంతులకు పైగా నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డితో పాటు ఆయన తనయుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి హవాయే నడుస్తుంటుంది.
ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈ తండ్రి , కొడుకులను కాదని రాజకీయం చేసే పరిస్థితి లేదు. ఇక, ఇప్పుడు తిరుమలలో భూమన కరుణాకర్‌రెడ్డికి పగ్గాలు అప్పగించారు. అంటే మొత్తంగా చూస్తే.. ఈ ముగ్గురు రెడ్డి నాయకుల చేతుల్లోనే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉందనే ప్రచారం అయితే సాగుతుండడం గమనార్హం.
మరి.. ఈ పరిణామం వైసీపీకి ఎంత వరకు మేలు చేస్తుందనేది పరిశీలిస్తే.. అంతా రెడ్డి సామాజిక వర్గమే పెత్తనం చలాయిస్తోందని.. వైసీపీలోని ఇతర సామాజిక వర్గాలు అంటున్నాయి. దీనివల్ల తమకు ప్రాధాన్యం లేకుండాపోతోందని.. మంత్రి నారాయణ స్వామి వంటి వారు.. తరచుగా విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అంటే.. ఎలా చూసుకున్నా.. ఉమ్మడి చిత్తూరులో రెడ్డి నాయకుల ఆధిపత్యం.. వచ్చే ఎన్నికల్లో కొంత ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.