గెలుపు గుర్రమెక్కబోతున్న టీడీపీ రెడ్లు వీరే...?
ఈ నేపధ్యంలో ఎంతమంది రెడ్లు ఈసారి టీడీపీ నుంచి గెలుస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది.
By: Tupaki Desk | 16 Aug 2023 1:30 PM GMTఏపీలో కులం లేదు అనుకుంటే తప్పే. అది రాజకీయాల్లో లేదు అనుకుంటే అంతకంటే పెద్ద తప్పు లేదు. కులాల చుట్టూ సంకుల సమరం సాగడమే ఏపీలో దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయం. దీనికి ఎవరూ అతీతం కాదు. ఏపీలో అధికార వైసీపీలో రెడ్లకు కొంత ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అన్నది ప్రచారంలో ఉన్న మాట. అలాగే టీడీపీలో కమ్మలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకుంటారు.
అంతమాత్రం చేత ఇతర కులాలేవీ ఈ రెండు పార్టీలలో ఉండవనుకుంటే పొరపాటు. వైసీపీలో గత ఎన్నికల్లో దాదాపుగా నలభై నుంచి నలభై అయిదు దాకా రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారని అంచనా ఉంది. వైసీపీలో కమ్మ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక టీడీపీలో రెడ్డి సామాజికవర్గానికి గత ఎన్నికల్లో కనీసంగా ఇరవై మంది దాకా రెడ్డి కులస్థులకి టికెట్లు ఇచ్చినా ఏ ఒక్కరూ గెలవలేకపోయారు.
అయితే ఈసారి కూడా టీడీపీ తనదైన సామాజిక న్యాయం అమలు చేస్తూ గ్రేటర్ రాయలసీమ జిల్లాలలో రెడ్లకు టికెట్లు ఎక్కువగా ఇస్తోంది. ఒక్క కర్నూల్ లోనే తొమ్మిది మంది రెడ్లకు టికెట్లు ఈసారి దక్కవచ్చు అని అంటున్నారు. అలాగే కడప, చిత్తూరు, నెల్లూరులలొ కూడా రెడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మధ్యనే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన రెడ్డి ఎమ్మెల్యేలలో ఆనం రామనారాయణరెడ్డికి కోటం రెడ్డి శ్రీధర్ కి టికెట్లు ఖాయమని అంటున్నారు.
ఈ నేపధ్యంలో ఎంతమంది రెడ్లు ఈసారి టీడీపీ నుంచి గెలుస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది. ఆనం రామనారాయణరెడ్డికి టికెట్ ఎక్కడ అన్నది తెలియకపోయినా ఆయన గెలుపు కోసం శ్రమించాల్సి ఉంటుందని అంటున్నారు. అలాగే నెల్లూరు రూరల్ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి టికెట్ కన్ ఫర్మ్ అయింది కానీ ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకరరెడ్డితో గట్టి ఫైట్ నే ఎదుర్కోబోతున్నారని టాక్.
ఇక కర్నూల్ లో చూసుకుంటే బనగానపల్లిలో బీసీ జనార్ధనరెడ్డికి ఈసారి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా కడుతున్నారు. అదే విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరులో చూస్తే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఈసారి గెలుపు అంచులను తాకుతారు అని లెక్క వేసుకుంటున్నారు. ఇదే జిల్లాలో చూస్తే అమరనాధ రెడ్డికి కూడా పలమనేరులో గెలుపు పిలుపు వినిపించవచ్చు అంటున్నారు.
అనంతపురంలో చూసుకుంటే తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ లో ఒకరు అయిన జేసీ ప్రభాకరరెడ్డి ఈసారి గెలుస్తారు అని అంటున్నారు. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూర్ లో ప్రవీణ్ కుమార్ రెడ్డికి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న రాచమల్లు ప్రసాదరెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కలసివచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక కర్నూల్ జిల్లా మంత్రాలయంలో తిక్కారెడ్డి, అదే విధంగా నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు గెలుపు కోసం కష్టపడాల్సి ఉంది అని అంటున్నారు.
ఏది ఏమైనా ఈసారి టీడీపీ నుంచి కూడా కొందరు రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి వస్తారని అంటున్నారు. ఇక రాయలసీమ జిల్లాలలో ఆ సామాజికవర్గం మీద టీడీపీ గట్టి ఆశలు పెట్టుకుంది. వైసీపీ కంచుకోటలలో రెడ్డి అభ్యర్ధులనే ఏరి కోరి బరిలోకి దించడం ద్వారా సైకిల్ జోరు పెంచాలని అనుకుంటోంది. మరి టీడీపీ ఆశలు ఫలిస్తాయా అన్నది చూడాలి. ఏది ఏమైనా గతంలో వచ్చినట్లుగా వైసీపీకి మొత్తానికి మొత్తం సీట్లు అయితే ఈసారి ఈ జిల్లాలలో రావు అని అంటున్నారు.