ఈ 'పుష్పరాజ్' పైనే పవన్ దృష్టి!
స్మగ్లింగ్ చేసేవారిని పట్టుకోవాలని పవన్ కళ్యాణ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
By: Tupaki Desk | 6 July 2024 7:04 AM GMTముఖ్యంగా రాయలసీమలో కడప, కర్నూలు జిల్లాల్లో మాత్రమే లభించే అరుదైన ఎర్రచందనం మొక్కలను నరికేసి ఆ దుంగలను విదేశాలకు స్మగ్లింగ్ చేసేవారిని పట్టుకోవాలని పవన్ కళ్యాణ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం విదేశాలకు తరలిపోయిందనే విమర్శలు ఉన్నాయి.
ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లర్ అనే ఆరోపణలున్న విజయానందరెడ్డికి చిత్తూరు అసెంబ్లీ సీటును వైసీపీ కట్టబెట్టింది. ఎర్రచందనం అక్రమ ర వాణాకు సంబంధించి ఆయనపై పలు కేసులు ఉండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం ఎర్రచందనం అక్రమ రవాణాలో ఉందన్నారు. నేపాల్ కు అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని విమర్శించారు.
నేపాల్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డికి చెందిన చందనం దుంగలు పట్టుబడ్డాయని, ఈ ఫైల్ తన టేబుల్ పైనే ఉందని పవన్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న అసలైన పుష్పరాజ్.. పెద్దిరెడ్డి కుటుంబమేనన్నది పవన్ అనుమానమని అంటున్నారు.
ఈ క్రమంలో పవన్ ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించారు. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని తక్షణమే పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశిస్తూ అటవీశాఖ మంత్రిగా పవన్ తన తొలి ప్రధాన ఆదేశాలు జారీ చేశారు. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాపై తక్షణమే విచారణ జరిపించాలన్నారు.
ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని పవన్ ఆదేశించారు. నిఘా వ్యవస్థను పటిష్ఠపరచాలని సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారందర్నీ అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎక్కడెక్కడ ఎర్రచందనం డంప్ లు ఉన్నాయో గుర్తించి, ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ను నడిపిస్తున్న కీలక సూత్రధారులను పట్టుకోవాలన్నారు. వారు తప్పించుకోవటానికి వీల్లేకుండా పక్కాగా కేసులు నమోదు చేయాలని కోరారు. అలాగే నేపాల్ లో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలను తిరిగి ఏపీకి తీసుకురావటంపై దృష్టి సారించాలన్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో గతంలో అరెస్టై ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నవారి కార్యకలాపాలు, వారు ఎవరెవరితో లావాదేవీలు కొనసాగిస్తున్నారనే అంశాలపై నిఘా ఉంచాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఇప్పటి వరకూ నమోదు చేసిన కేసులు, వాటిలో ఎన్నింటిలో శిక్షలు పడ్డాయి? ఎన్ని వీగిపోయాయి? అందుకు కారణాలేంటి తదితర అంశాలతో తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా వైఎస్సార్ జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో పట్టుబడ్డ ఎర్రచందనం డంప్ నకు సంబంధించిన నివేదికను ఆ జిల్లా అటవీ శాఖాధికారులు పవన్ కళ్యాణ్ కు అందజేశారు. అక్కడ రూ.1.6 కోట్ల విలువైన 158 దుంగలు పట్టుబడ్డాయని చెప్పారు. ఈ కేసులో పలువురు అరెస్టు చేశామని.. ఈ వ్యవహారంతో పలువురు స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నాయని గుర్తించామని అధికారులు పవన్ కు వివరించారు.
కాగా కడపలోని శ్రీగంధం డంపింగ్ యార్డుపై నిఘా పెంచాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎర్రచందనం దుంగలను అడ్డుకునేందుకు చెక్ పోస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాలో అసలైన పుష్పరాజులు పట్టుబడతారో, లేదో చూడాల్సి ఉంది.