ఎర్ర సముద్రంలో కలకలం... రంగంలోకి పది దేశాలు!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన అనంతరం ఎర్ర సముద్రంలోని అలజడులు సృష్టించబడుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 19 Dec 2023 12:00 PM GMTఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన అనంతరం ఎర్ర సముద్రంలోని అలజడులు సృష్టించబడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇజ్రాయేల్ వనే అనుమానంతో ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో... తాజాగా యెమెన్ లోని తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి "స్వాన్ అట్లాంటిక్" అనే వాణిజ్య నౌకపైకి ఓ డ్రోన్, యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో అమెరికా రంగంలోకి దిగిందని తెలుస్తుంది.
అవును... హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలే లక్ష్యంగా ఎర్ర సముద్రంలో దాడులను మరింత తీవ్రం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా "స్వాన్ అట్లాంటిక్" అనే వాణిజ్య నౌకపై క్షిపణిని ప్రయోగించారు. సరిగ్గ ఇదే సమయంలో మరో బల్క్ కార్గో నౌక “ఎం/వి క్లారా”కు అత్యంత సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
ఈ రెండు దాడుల్లో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ చెబుతున్న సమయంలో... హౌతీ వర్గాలు ఈ దాడులపై స్పందించాయి. ఇందులో భాగంగా... ఈ నౌకలకు ఇజ్రాయెల్ తో సంబంధాలు ఉండటంతోనే దాడులు చేశామని చెప్పుకొచ్చాయి. వీటిలో స్వాన్ అట్లాంటిక్ షిప్ నార్వేకు చెందినదిగా తెలుస్తోంది.
ఇలా ఎర్ర సముద్రంలో నౌకలపై జరుగుతున్న దాడులపై అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్పందించారు. ఇందులో భాగంగా... ఈ దాడులపై చర్చించేందుకు పశ్చిమ ఆసియాలోని రక్షణ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎర్ర సముద్రంలో నౌకల రక్షణ కోసం "ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్"ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఎర్ర సముద్రంలో కార్యకలాపాలు పర్యవేక్షించే "టాస్క్ ఫోర్స్ 153" నాయకత్వం వహిస్తుందని తెలిపారు.
ఇదే క్రమంలో ఎర్ర సముద్రంలో నౌకలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన యూఎస్ రక్షణ మంత్రి ఆస్టిన్... ఈ దాడులను ఎదుర్కొనేందుకు.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రాంతీయ శక్తులన్నీ సమష్టిగా పోరాడాలని పేర్కొన్నారు. యెమెన్ నుంచి హౌతీ తిరుగుబాటుదారులు చేస్తున్న దాడులు అంతర్జాతీయ చట్టాలకు ప్రమాదకరంగా మారాయని అన్నారు.
ఇలా ఎర్ర సముద్రంలో నౌకల రక్షణకోసం అమెరికా ప్రారంభించిన "ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్" కార్యక్రమంలో బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, బహ్రెయిన్, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, సీషెల్స్ లు భాగస్వాములు కానున్నాయి.