షర్మిలకు రెడ్ సిగ్నల్... కాంగ్రెస్ లో విలీనం బిగ్ డౌట్....?
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా బలహీన వర్గాలకు చెందిన నేతలు మెజారిటీ అంతా షర్మిల చేరిక తెలంగాణాలో కాంగ్రెస్ కి తీరని నష్టం చేకూరుస్తుందని అంటున్నారుట.
By: Tupaki Desk | 12 Aug 2023 7:25 AM GMTవైఎస్సార్టీ ఎపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణా రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారు. ఈ మేరకు ఆమె గత కొంతకాలంగా తన డిమాండ్లను ఆలోచనలను కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వానికి ముందుగానే తెలియచేశారు.
ఇక షర్మిల సేవలను ఏపీ తెలంగాణాలలో రెండింటా ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ హై కమాండ్ సరేనంది దీంతో రెండు రోజుల పాటు షర్మిల ఢిల్లీలో మకాం వేశారు. ఈ క్రమంలో ఆమె డీకే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్ తోనూ చర్చలు జరిపారు. ఇక ఫైన్ ఫ్రైడే రోజున కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో ఆమె చర్చలు జరిపిన నేపధ్యంలో కాంగ్రెస్ పెద్దల మనోగతం తెలిసి షాక్ తిన్నారని అంటున్నారు.
షర్మిల తెలంగాణా నుంచి రాజకీయాలను చేయాలనుకోవడం పట్ల టీ కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా బలహీన వర్గాలకు చెందిన నేతలు మెజారిటీ అంతా షర్మిల చేరిక తెలంగాణాలో కాంగ్రెస్ కి తీరని నష్టం చేకూరుస్తుందని అంటున్నారుట.
వారు ఇదే మాటను హై కమాండ్ కి చెప్పి తన వ్యతిరేకతను తెలియచేశారు అని అంటున్నారు ఆమె కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి ఏపీ రాజకీయాల్లో పనిచేసుకుంటే అభ్యంతరం లేదని పార్టీ పెద్దలకు చెప్పారట. అలా కాకుండా ఆమె తెలంగాణా నుంచి పాలిటిక్స్ అంటే తామంతా నో చెబుతామని పేర్కొన్నారుట.
ఇక నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి వంటి వారు మాత్రం షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. షర్మిల వల్ల తెలంగాణా కాంగ్రెస్ కి మేలు చేకూరుతుందని అంటున్నారు. అయితే మెజారిటీ టీ కాంగ్రెస్ నేతల మాటలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు అసలు కబురు చల్లగా చెప్పారని టాక్.
ఆమె తన పార్టీని విలీనం చేసి ఏపీ రాజకీయాల్లో పనిచేసుకోవాలని సూచిస్తున్నారుట. దీంతో షర్మిల తన నిర్ణయాన్ని తరువాత చెబుతాను అంటూ రాత్రికి రాత్రే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అయ్యారని అంటున్నారు.
మరి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా చేయరా అన్నది చూడాలని అంటున్నారు. ఆమె తెలంగాణా నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లాలని చూస్తున్నారని అంటున్నారు. ఆమె తన రాజకీయ కార్యక్షేత్రంగా తెలంగాణాను ఎన్నుకుంటున్నారు అని అంటున్నారు. అయితే ఆమెను వైఎస్సార్ తనయగా ఆంధ్రా మూలాలు ఉన్న నాయకురాలిగా టీ కాంగ్రెస్ లోని చాలా మంది చూస్తున్నారు.
ఆమెను కనుక తెలంగాణాలో క్రియాశీలం చేస్తే అది కేసీయార్ కి అడ్వాంటేజ్ గా మారి మరోమారు బీయారెస్ గెలిచేందుకు ఊపిరి పోస్తుంది అని అంటున్నారు. ఈ ఆందోళంతోనే చాలా మంది షర్మిలను తెలంగాణాకు వద్దు అని అంటున్నారు. అయితే టీయారెస్ బీయారెస్ అయిన నేపధ్యంలో ఇంకా ప్రాంతీయ రాజకీయాలకు తావు ఉండదని మరి కొందరు అంటున్నారు. షర్మిల పైగా తెలంగాణాలోనే పుట్టి పెరిగి కోడలు అయిపోయారని ఆమెను ఆహ్వానించాల్సిందే అని అంటున్న వారూ ఉన్నారు.
మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో షర్మిల విలీనం ఏమి అవుతుంది అన్నది చర్చగా ఉంది. ఇంకో విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఆమె పార్టీని విలీనం చేసుకున్నాక అసలు విషయం చెప్పి ఉంటే ఏమయ్యేదో కానీ ముందే చెప్పడం బెటర్ అయింది అని అంటున్నారు. ఏది ఏమైనా షర్మిల ఇపుడు మళ్లీ పొలిటికల్ క్రాస్ రోడ్ లో ఉన్నారా లేక తన సొంత పార్టీతోనే ఎన్నికల్లో పోరాడుతారా అన్నది చూడాలని అంటున్నారు.