రిపోర్టు: వరుసలో బీఆర్ఎస్ టాప్.. తర్వాత వైసీపీ.. టీడీపీనే!
అందులోని రెండు పార్టీలు అయితే.. ఏపీకి చెందినవిగా తేల్చింది ఏడీఆర్ సంస్థ. ఇంతకూ ఆ మూడు పార్టీలు వివరాల్లోకి వెళితే..
By: Tupaki Desk | 11 Jan 2025 9:30 AM GMTఆసక్తికర విషయాన్ని వెల్లడించింది తాజా నివేదిక. దేశంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల జాబితాలో నిలిచిన మూడు పార్టీలు తెలుగు రాష్ట్రాలకుచెందినవి కావటం విశేషం. అందులోని రెండు పార్టీలు అయితే.. ఏపీకి చెందినవిగా తేల్చింది ఏడీఆర్ సంస్థ. ఇంతకూ ఆ మూడు పార్టీలు వివరాల్లోకి వెళితే..
విరాళాల సాధనలో బీఆర్ఎస్ టాప్ స్థానంలో నిలిస్తే..తర్వాతి స్థానంలో వైసీపీ.. మూడో స్థానంలో తెలుగుదేశం పార్టీ నిలిచాయి. అయితే.. ఈ నివేదికను విశ్లేషించిన సమయానికి మొదటి రెండు స్థానాల్లో ఉన్న పార్టీలు అప్పట్లో అధికార పక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు పార్టీలకు రూ.216.76 కోట్లు లభించినట్లుగా పేర్కొన్నారు. ఇందులో బీఆర్ఎస్ కు రూ.154.03 కోట్లు విరాళాల రూపంలో అందినట్లుగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించింది.
దేశంలోని 57 ప్రాంతీయ పార్టీలను విశ్లేషించగా.. అందులో 18 పార్టీలు మాత్రమే చెప్పిన సమయానికి తమకు అందిన విరాళాల వివరాల్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేశాయి. గడువు ముగిసిన తర్వాత 2 -164 రోజుల వ్యవధి ఆలస్యంతో మరో 17పార్టీలు తమ వివరాల్ని అందించాయి. బీజేడీ.. నేషనల్ కాన్ఫరెన్స్ సహా ఏడు పార్టీలు తమకు సదరు ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి విరాళాలు అందలేదని పేర్కొన్నాయి.
అదే సమయంలో 28 ప్రాంతీయ పార్టీలకు అందిన రూ.216.76 కోట్లకు సంబంధించిన విరాళాల్ని ఏడీఆర్ సంస్థ విశ్లేషించింది. బీఆర్ఎస్ కు 47 మంది నుంచి అందిన విరాళాల విలువ రూ.154.03 కోట్లు కాగా.. వైసీపీకి రూ.16 కోట్లు.. తెలుగుదేశం పార్టీకి రూ.11.92 కోట్లు లభించాయి. విరాళాల్లో 90.5 శాతం బీఆర్ఎస్.. వైసీపీ.. టీడీపీ.. డీఎంకే.. సీపీఐలకు అందాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో కొన్ని పార్టీలకు అందిన విరాళాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఇందులో జేఎంఎం 3685 శాతంతో టాప్ లో ఉంటే.. జననాయక్ జనతా పార్టీ 1997 శాతం.. టీడీపీ 1795 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీకి.. శిరోమణి అకాలీదదళ్ లాంటి పార్టీలకు విరాళాలు తగ్గాయి.
రాజకీయ పార్టీలకు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చిన వాటిల్లో 78 శాతం కార్పొరేట్.. వ్యాపార సంస్థలే ఉన్నాయి. మిగిలిన మత్తం వ్యక్తుల ద్వారా అందినట్లుగా నివేదిక వెల్లడించింది. ఢిల్లీకి చెందిన దాతల నుంచి అత్యధికంగా రూ.107.09 కోట్లు అందాయని.. తర్వాతి స్థానంలో తెలంగాణ నుంచి రూ.62.99 కోట్లు.. ఏపీ నుంచి రూ.8.39 కోట్లు అందినట్లుగా రిపోర్టు వెల్లడించింది.