Begin typing your search above and press return to search.

ఆప్ ని స్ఫూర్తిగా తీసుకున్న బీజేపీ !

అయితే ఈ పేరు చాలా మందిని అనూహ్యం అయినా బీజేపీ పెద్దలు మాత్రం ఎపుడో డిసైడ్ చేసిన పేరుగా ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   19 Feb 2025 5:50 PM GMT
ఆప్ ని స్ఫూర్తిగా తీసుకున్న బీజేపీ !
X

ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేఖా గుప్తాను బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసిన సంగతి విధితమే. అయితే ఈ పేరు చాలా మందిని అనూహ్యం అయినా బీజేపీ పెద్దలు మాత్రం ఎపుడో డిసైడ్ చేసిన పేరుగా ప్రచారం సాగుతోంది. పైకి మాత్రం పర్వేష్ వర్మ పేరు ఎక్కువగా పాపులర్ అయింది.

ఒక వైపు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వస్తూండగానే పర్వేష్ వర్మ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకోవడంతో ఆయనే బీజేపీ సీఎం అని చివరి దాకా అంతా అనుకుంటూ వచ్చారు. పర్వేష్ వర్మ బలమైన అభ్యర్ధిగా సీఎం రేసులో నిలిచారు. అంగబలం అర్ధ బలం ఉన్న వారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉంది. ఒక సారి ఢిల్లీ ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా గెలించారు. తండ్రి సాహెబ్ సింగ్ వర్మ ఢిలీ మాజీ సీఎం. వీటికి మించి ఆప్ అధినేత మాజీ సీఎం కేజ్రీవాల్ ని ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు.

దాంతో ఆయనే కాబోయే సీఎం అని భావించారు. మరి అంతలా ప్రచారంలోకి వచ్చిన వర్మ ఎందుకు వెనక్కి వెళ్ళారు, రేఖా గుప్తా ఎందుకు ముందుకు వచ్చారు అన్నదే చర్చ. అయితే రేఖా గుప్తాను ఎంపిక చేయడం వెనక బీజేపీ ఆప్ ని స్పూర్తిగా తీసుకుంది అని అంటున్నారు. ఆప్ మధ్యతరగతి వర్గాల పార్టీగా ఉంది. పైగా ఆ పార్టీ నుంచి అతిషీని సీఎం గా కేజ్రీవాల్ చేశారు. ఆమె నిన్నటిదాకా సీఎం గా పనిచేశారు.

దాంతో బీజేపీ కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. ఇక చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అన్ని చోట్లా పురుషులే సీఎంలుగా ఉన్నారు. ఒక్క మహిళకూ చాన్స్ లేదు. దాంతో ఆ విధంగా మహిళా కోటాను కూడా భర్తీ చేస్తే ఢిల్లీ వంటి చైతన్యవంతమైన ప్రాంతంలో అది మంచి ఫలితాలను ఇస్తుందని బీజేపీ భావించింది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఆప్ ఓడినా 22 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉంది. దాంతో పర్వేష్ వర్మ లాంటి వారికి చాన్స్ ఇస్తే అది రాజకీయంగా భారీ సమరానికి దారి తీస్తుంది అని అంటున్నారు. అదే మహిళకు చాన్స్ ఇస్తే ఆప్ కూడా ఏమీ అనలేని పరిస్థితి ఉంటుందని లెక్కలేసి మరీ ఎంపిక చేశారు అని అంటున్నారు. ఇక మధ్యతరగతి వర్గాలను పూర్తిగా తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలోనూ ఆమెకు అవకాశం ఇచ్చారని చెబుతున్నారు.

అంతే కాదు బీజేపీ 48 సీట్లతో గెలిచింది. దాంతో ఎన్నో ఆశలు ఆకాంక్షలు ప్రజలలో ఉంటాయి. కొత్తవారికి చాన్స్ ఇస్తే వారి పనితీరునే జనాలు ముందుగా గమనిస్తారు. దాంతో మెల్లగా అయినా పాలనలో మంచి పనులు చూపించి మెప్పు పొందవచ్చు. ఈ విధంగా ఎన్నో రకాలైన ఆలోచనలతోనే బీజేపీ రేఖా గుప్తాకు చాన్స్ ఇచ్చింది అని అంటున్నారు.

ఇక పోతే రేఖ గుప్తా ఏమీ ఆషామాషీ నేత అయితే కారు. ఆమె దక్షిణ ఢిల్లీ నుంచి మేయర్ గా గతంలో పనిచేసారు. అలాగే ఆమె ఏబీవీపీ కాలం నుంచి బీజేపీలో పనిచేస్తూ వస్తున్నారు. ఢిల్లీ వర్సిటీ విద్యార్ధి విభాగానికి నాయకత్వం వహించారు. ఆమె చురుకైన రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. జనాలకు కూడా కొత్త తరం నాయకురాలిగా బీజేపీ పరిచయం చేయాలనుకుంటోంది. అన్నీ కలసి ఆమెకు అదృష్ట రేఖను మార్చేశాయని అంటున్నారు.