Begin typing your search above and press return to search.

హైకోర్టులో కేటీఆర్ కు రిలీఫ్... న్యాయవాదుల వాదనలు సాగాయిలా!

అవును... హైకోర్టులో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట లభించింది. ఇందులో భాగంగా... 10 రోజుల వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   20 Dec 2024 5:20 PM GMT
హైకోర్టులో కేటీఆర్  కు రిలీఫ్... న్యాయవాదుల వాదనలు సాగాయిలా!
X

ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (ఏ1) తో పాటు మున్సిపల్ శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ (ఏ2), హెచ్.ఎం.డీ.ఏ. అప్పటి చీఫ్ ఇంజినీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డి (ఏ3) తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయం అత్యంత హాట్ టాపిక్ గా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన కేటీఆర్... తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అసలు ఆ వ్యవహారంలో అవినీతే జరగలేదని.. అవినీతే లేనప్పుడు ఏసీబీ కేసు ఎక్కడుందని అన్నారు. వీటిని రేవంత్ మార్కు వేధింపులుగా అభివర్ణించారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఈ కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో కేటీఆర్ కు ఊరట దక్కింది.

అవును... హైకోర్టులో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట లభించింది. ఇందులో భాగంగా... 10 రోజుల వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో... డిసెంబర్ 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

హైకోర్టులో వాదనలు సాగాయిలా..!:

ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో తనపై నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్. ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ పై శుక్రవారం వాదనలు సాగాయి. ఈ సందర్భంగా... కేటీఆర్ తరుపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం... కేటీఆర్ పై పీసీ యాక్ట్ వర్తించదని.. ఆయన లబ్ధి పొందినట్లు ఎఫ్.ఐ.ఆర్. లో లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో... 14 నెలల తర్వాత ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారని.. ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారని.. ప్రజా ప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలని.. 18న ఫిర్యాదు అందగానే, 19న ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారని.. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే కేటీఆర్ పై కేసు పెట్టారని వాదించినట్లు తెలుస్తోంది.

అయితే.. ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన ఏజీ సుదర్శన్ రెడ్డి... అసలు ఎఫ్.ఐ.ఆర్. నమోదు ప్రాథమిక అంశం మాత్రమే అని.. అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదని.. దర్యాప్తు తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారని.. రెండు నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించి.. గవర్నర్ నిర్ణయానికి పంపారని.. ఆయన ఆమోదించిన తర్వాత కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు 10 రోజుల పాటు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని తెలిపింది.