Begin typing your search above and press return to search.

అవసరానికి మించి లాగుతున్న అంబటి.. ఇంత అవసరమా?

దీనిపై పవన్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ స్పందిస్తూ.. ఒక తల్లిగా తన అభ్యర్థ అంటూ ఒక వీడియోను విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   11 Aug 2023 4:28 AM GMT
అవసరానికి మించి లాగుతున్న అంబటి.. ఇంత అవసరమా?
X

అవసరానికి మించిన అటెన్షన్ తో లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో అనవసర అంశాలతో మైలేజీ వస్తుందని భావిస్తారు కానీ ప్రజలు అందుకు భిన్నంగా ఆలోచిస్తారన్న విషయాన్ని మర్చిపోతుంటారు. అర్థం చేసుకునేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. తాజాగా వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. బ్రో మూవీలో తనను పోలిన పాత్రను పెట్టారంటూ రచ్చ మొదలు పెట్టిన ఆయన ఎపిసోడ్ ను చూస్తే.. తనకు తాను కెలుక్కున్నారన్న అభిప్రాయమే ఎక్కువగా కలుగుతోంది.

సినిమా విడుదలైన తొలిరోజు చూసిన ఫ్యాన్స్ ఎవరూ శ్యాంబాబు క్యారెక్టర్.. అంబటి రాంబాబును ఉద్దేశించి పెట్టిందన్న విషయం అర్థమైంది లేదు. ఎప్పుడైతే మీమ్స్ వచ్చి.. నాటి అంబటి డ్రెస్ ను.. బ్రో మూవీలో శ్యాంబాబు పాత్ర డ్రెస్ ను సరిపోల్చినప్పుడు మాత్రమే కాస్తంత కనెక్టు అయ్యారు. ఆ విషయాన్ని మరీ అంత రచ్చ చేయకుండా.. సింఫుల్ గా రెండు మూడు మాటలు అనేసి.. అంబటి అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది.

చివరకు పవన్ తన సినిమా ప్రచారానికి తాను అవసరమయ్యానంటూ కూసింత వ్యంగ్యపు ఆవేదనను వ్యక్తం చేసి ఉంటే.. తగలాల్సిన దెబ్బ తగిలేది. అందుకు భిన్నంగా తనను పోలిన పాత్ర మీద భారీ ప్రెస్ మీట్.. పవన్ మీద విపరీతంగా రియాక్టు కావటం చాలామందికి నచ్చలేదు. దీనికి కారణం లేకపోలేదు. గతంలో పవన్ ను ఉద్దేశించి.. పవన్ ను ఇమిటేట్ చేసేలా.. అచ్చం ఆయనలా ఉన్న మనిషితోనే సినిమాలు చేయించిన ఘనచరిత్రతో పోల్చినప్పుడు.. శ్యాంబాబు వ్యవహారం అంత సూటిగా తగిలేదు కాదు.

తన ఆక్రోశం.. ప్రపంచ బాధ అన్నట్లుగా అంబటి చేసిన హడావుడితో.. అందరి పోకస్ పడిన పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో జరిగే చర్చ మొత్తం తన చుట్టూనే తిరుగుతుందని ఆనందానికి గురి కావొచ్చు. కానీ.. ఆ చర్చ రచ్చగా మారి తనకు డ్యామేజ్ జరుగుతుందన్న చిన్న లాజిక్ ను అంబటి మిస్ అవుతున్నారని చెప్పాలి. శ్యాంబాబు పాత్రతో తన మీద రెండు మూడు సన్నివేశాల్ని తన సినిమాలో పవన్ పెట్టిన దానికి ప్రతిగా.. పవన్ మీద సినిమాలు.. వెబ్ సిరీస్ కు ప్లాన్ చేస్తున్నామని చెప్పటం తెలిసిందే.

దీనిపై పవన్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ స్పందిస్తూ.. ఒక తల్లిగా తన అభ్యర్థ అంటూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో.. "పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లల్ని అందులోకి లాగకండి. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా పిల్లల తండ్రి నటుడు.. రాజకీయ నేత. నా పిల్లల్నే కాదు.. ఏ పిల్లల్ని.. ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయం ఏమైనా ఉంటే మీరూ మీరూ చూసుకోవాలి" అని కోరారు.

ఈ వ్యాఖ్యలు సహజంగానే రేణు మీద సానుభూతిని పెంచేలా.. అంబటి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా మారాయి.అంబటికి ఏమైనా ఉంటే.. పవన్ మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం బాగుంటుంది కానీ.. అందులో మాజీ భార్యల్ని.. పిల్లల్ని.. కుటుంబాన్ని లాగాల్సిన అవసరం ఏమి వచ్చిందన్నది చర్చగా మారింది. రాజకీయాలతో సంబంధం లేని వారి గురించి మాట్లాడటం.. వారిని రాజకీయాల్లోకి లాగటాన్ని ప్రజలు హర్షించరన్న లాజిక్ ను అంబటి మిస్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే పవన్ పేరుతో లాగింది చాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇదే రీతిలో లాగుతూ పోతే.. పవన్ కే అనుకూలంగా మారుతుందన్న విషయాన్ని అంబటి ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. ఈ మాటలు అంబటికి వినిపిస్తున్నాయంటారా?