నిప్పుల మీద ఉప్పు చల్లిన రేణుకా చౌదరి ?
ఈ నేపథ్యంలో ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
By: Tupaki Desk | 9 May 2024 7:07 PM GMTమూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు, నిప్పు మీద ఉప్పు చల్లినట్లు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యవహారం మారింది. అసలే ఖమ్మం కాంగ్రెస్ టికెట్ తన సతీమణికి రాలేదన్న బాధలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నాడు.
ఇక తన కుమారుడు తుమ్మల యుగంధర్ కోసం ప్రయత్నించి మంత్రి తుమ్మల ఉసూరుమన్నాడు. అక్కడ తన పలుకుబడిని ఉపయోగించి ఎట్టకేలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డికి తెప్పించుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 'మల్లు భట్టి విక్రమార్క భార్యకు గానీ, తుమ్మల కుమారుడికి గానీ ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోలేదని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మండవ వెంకటేశ్వర రావుకి ఇవ్వడానికి నాన్ లోకల్ ప్లాబ్లం రావడంతో పొంగులేటి వియ్యంకుడికి ఇచ్చారని' అభిప్రాయపడ్డారు.
ఇక నిజామాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అనవసరంగా టికెట్ ఇచ్చారని, అక్కడ స్థానికుడు అయిన మండవ వెంకటేశ్వర్ రావుకు టికెట్ ఇచ్చి ఉండాల్సిందని రేణుకా చౌదరి అన్నారు. ఇప్పుడు అనవసరంగా ఎన్నికల ముందు పార్టీ అంతర్గత విషయాలను రేణుక గెలికిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. రేణుక వ్యాఖ్యలు ఎక్కడి వరకు దారి తీస్తాయో వేచిచూడాలి.