ఆ ఫైర్ బ్రాండ్ రాజ్య సభకు.. దీని వెనుక భారీ వ్యూహం
ఇటీవల తెలంగాణ నుంచి ఇద్దరిని రాజ్య సభకు ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయాలకు పెట్టింది పేరుగా నిలిచింది
By: Tupaki Desk | 21 Feb 2024 4:01 PM GMTఇటీవల తెలంగాణ నుంచి ఇద్దరిని రాజ్య సభకు ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయాలకు పెట్టింది పేరుగా నిలిచింది. రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా, రెండింటిలోనూ పెద్దగా పోటీకి వినిపించని పేర్లను ఖరారు చేసి ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి కాంగ్రెస్ నుంచి రాజ్య సభ సీటును పదుల సంఖ్యలో నాయకులు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే పెద్ద సముద్రం. నాయకులకు కొదవలేని పార్టీ. కానీ అందరికీ సీట్లు, టికెట్లు ఇవ్వలేరు కదా?
ఆమె ఎంపికే అనూహ్యం..
అటు ఉమ్మడి ఏపీలో కానీ, ఇటు తెలంగాణలో కానీ రేణుకా చౌదరి అంటే ఫైర్ బ్రాండ్. ఖమ్మం నుంచి రెండుసార్లు గెలిచిన ఆమె.. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2009లో ఓటమి అనంతరం మరోసారి గెలవలేదు. అయినప్పటికీ 15 ఏళ్లుగా ఖమ్మంతో అనుబంధం కొనసాగిస్తూ వస్తున్నారు. ఓ దశలో వచ్చే ఏపీ ఎన్నికల్లో ఆమె గుడివాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ జరిగింది. చివరికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం రేణుకా చౌదరిని రాజ్య సభకు ఎంపిక చేసి కాంగ్రెస్ అధిష్ఠానం తన ప్రత్యేకతను చాటింది.
చక్రంతిప్పినదెవరో?
రేణుకా చౌదరి వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధం అవుతున్నారు. అసలే ఖమ్మం.. అందులోనూ కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆమె ఆ సామాజికవర్గ ప్రాబల్యం అధికంగా ఉండే స్థానాన్ని ఎందుకు వదులుకుంటారు..? రేణకా గనుక గట్టిగా పట్టుబడితే ఖమ్మం సీటు దక్కే పరిస్థితి. కానీ, ఆమెకు రాజ్యసభ దక్కింది. దీనివెనుక ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత చక్రం తిప్పినట్లు సమాచారం. తన ఇంటి వ్యక్తికి టికెట్ వచ్చేలా చేసేందుకు ఆయన ఈ ఎత్తు వేసినట్లు పేర్కొంటున్నారు. రేణుకాను రంగం నుంచి తప్పించడంతో ఆ నేత బంధువుకు టికెట్ దాదాపు దగ్గరకు వచ్చినట్లే. సీఎంతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా నేడో, రేపో కాంగ్రెస్ ప్రకటించే లోక్ సభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉండొచ్చని చెబుతున్నారు.
సోనియా రాజ్య సభలో రేణుకా అండ
రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్. అనర్గళంగా ఇంగ్లిష్ లో దంచేయగలరు. అలాంటి నాయకురాలు చట్ట సభల్లో ఉండడం.. అందులోనూ మోదీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టాల్సిన సమయంలో ఉండడం కాంగ్రెస్ కు కచ్చితంగా అవసరం. ఈ లెక్కన రేణుకా ఇకపై సోనియా గాంధీకి రాజ్య సభలో అండాదండగా ఉండనున్నారు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆమెకు కీలక మంత్రి పదవీ దక్కడం ఖాయం.