Begin typing your search above and press return to search.

బుట్టా నిరీక్షణ ఫలించిందా ?

మాజీ ఎంపీ బుట్టా రేణుక నిరీక్షణ ఫలించినట్లే అనిపిస్తోంది. చాలా కాలంగా మాజీ ఎంపీ బుట్టారేణుక లూప్ లైన్లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 11:30 AM GMT
బుట్టా నిరీక్షణ ఫలించిందా ?
X

మాజీ ఎంపీ బుట్టా రేణుక నిరీక్షణ ఫలించినట్లే అనిపిస్తోంది. చాలా కాలంగా మాజీ ఎంపీ బుట్టారేణుక లూప్ లైన్లో ఉన్నారు. ఆమెచేసిన తప్పువల్లే జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీని లూప్ లైన్లో ఉంచేశారు. అయితే ఆ లూప్ లైన్ను ఆమె కూలింగ్ పీరియడ్ గా భావించి ఎక్కడా సహనం కోల్పోకుండా, నోరుజారకుండా ఓపికగా భరించారు. దానికి ప్రతిఫలం రాబోయే ఎన్నికల్లో దక్కబోతోందని సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే బుట్టా పేరును ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్ధిగా జగన్ దాదాపు ఫైనల్ చేసినట్లు టాక్ వినబడుతోంది.

కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చేనేతల ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎంఎల్ఏ ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వయోభారం కారణంగా రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అయితే తనకు బదులుగా టికెట్ తన కొడుకు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని కోరారు. ఎంఎల్ఏ కోరికను జగన్ కొట్టేశారు. సర్వే రిపోర్టుల ఆధారంగా ఇక్కడ ప్రస్తుతం కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ లేదా బుట్టా రేణుక అయితే బాగుంటుందని తేలింది.

అయితే సంజీవ్ కుమార్ ను ఎంఎల్ఏగా వద్దని పార్టీ నేతల్లో చాలామంది చెప్పారట. అందుకనే బుట్టాపేరు దాదాపు ఖాయమైనట్లే అని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 2014లో వైసీపీ తరపున కర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా కొంత కాలానికే టీడీపీకి దగ్గరైపోయారు. పార్లమెంటులో కూడా టీడీపీ ఎంపీగానే చెలామణి అవటానికి ఇష్టపడ్డారు. అయితే పార్టీ ఫిరాయించినపుడు తనకిచ్చిన హామీలను చంద్రబాబునాయుడు నిలుపుకోలేదు. దాంతో 2019 ఎన్నికలకు ముందు బుట్టా తిరిగి వైసీపీలో చేరటానికి ప్రయత్నించారు.

బుట్టాను చేర్చుకోవటానికి జగన్ ముందు అంగీకరించలేదు. అయితే తాను తప్పుచేసినట్లు మీడియా ముందు బుట్టా చెంపలేసుకున్నారు. మరోసారి అలాంటి తప్పు చేయనని బహిరంగంగా చెప్పారు. దాంతో పార్టీలో చేర్చుకున్నారు. అప్పటినుండి పోటీచేసే విషయంలో బుట్టా చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారు. రాజ్యసభ, ఎంఎల్సీల భర్తీలో కూడా బుట్టా పేరును జగన్ పరిగణలోకి తీసుకోలేదు. అయినా ఓపికగా ఎదురుచూశారు. ఇపుడు ఎమ్మిగనూరు టికెట్ కు పరిశీలిస్తున్నారంటనే బుట్టా నిరీక్షణ ఫలించినట్లే అనుకోవాలి.