Begin typing your search above and press return to search.

వ్యతిరేక గళం విప్పారు.. సొంత పార్టీలో ట్రంప్ నకు భారీ షాక్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 5:45 AM GMT
వ్యతిరేక గళం విప్పారు.. సొంత పార్టీలో ట్రంప్ నకు భారీ షాక్!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈసారి జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు సినిమాటిక్ మలుపులు చోటుచేసుకోవటం తెలిసందే. ట్రంప్ వర్సస్ బైడెన్ వేళ.. ట్రంప్ అధిక్యతను ప్రదర్శించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిడితో బైడెన్ పోటీ నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అధ్యక్ష బరిలో ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమలా హారిస్ ను అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ సెలవు తీసుకున్నారు.

అప్పటివరకు అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల హవా నడుస్తున్న దానికి భిన్నంగా డెమోక్రాట్ల అధిక్యత షురూ అయ్యింది. చూస్తుండగానే కమలా హారిస్ అధిక్యతను ప్రదర్శిస్తూ ట్రంప్ కంటే స్వల్ప ముందంజలో ఉన్న విషయం సర్వేల్లో వెల్లడైంది. ఇదిలా ఉండగా.. ఒకప్పటి డెమోక్రాట్ నేత కం భారత మూలాలు ఉన్న తులసీ గబార్డ్ ట్రంప్ నకు మద్దతు ప్రకటించటం కమలకు ఇబ్బందికర పరిస్థితిని తెచ్చింది. అక్కడితో ఆగని తులసి.. కమలా హారిస్ కంటే ట్రంప్ మెరుగైన అభ్యర్థిగా పేర్కొన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా మరో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి చెందిన 200 మంది నేతలు కమలా హారిస్ కు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో ట్రంప్ ను తాము వ్యతిరేకిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ట్రంప్ తో పోలిస్తే కమలా హారిస్ నాయకత్వంలోనే అమెరికా భద్రత కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కమలా హారిస్ కు మద్దతు పలికిన వారిలో నేతలంతా జార్జిబుష్ హయాంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన వారే కావటం విశేషం.

తాజాగా వారంతా ట్రంప్ నకు వ్యతిరేకంగా.. కమలా హారిస్ కు మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. ట్రంప్ ను రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే దేశానికి విపత్తు ఖాయమని వారు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన బహిరంగ లేఖలో ట్రంప్ ను వ్యతిరేకిస్తూ.. తమ మద్దతు కమలా హారిస్ కు ఇస్తున్నట్లు పేర్కొన్న పరిణామం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లోనూ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ రిపబ్లికన్ల నేతలు పలువురు తమ అభిప్రాయాన్ని వెల్లడించినప్పటికి ట్రంప్ వారిని పట్టించుకోకుండా బరిలో నిలవటం తెలిసిందే. తాజా పరిణామం ట్రంప్ కు భారీ షాక్ గా పేర్కొంటున్నారు. చూస్తుంటే.. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు ఖాయమన్న మాట వినిపిస్తోంది.