రిపబ్లిక్ డే ముఖ్య అతిథి ఫిక్స్... జరిగితే ఇది ఆరోసారి!
అ దేశం నుంచి ఈ వేడుకకు ముఖ్య అతిథులు రావడం ఇది ఆరోసారి కావడం గమనార్హం.
By: Tupaki Desk | 22 Dec 2023 8:20 AM GMTప్రతి సంవత్సరం భారతదేశం తన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా విదేశీ నాయకులను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్-19 మహమ్మారి కారణంగా 2021, 2022లలో రెండేళ్ల పాటు మాత్రమే రిపబ్లిక్ డే వేడుకలకు విదేశాలనుంచి ముఖ్య అతిథిని ఆహ్వానించలేదు. ఈ క్రమంలో 2024లో జరగబోయే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిని ఫిక్స్ చేశారు. అ దేశం నుంచి ఈ వేడుకకు ముఖ్య అతిథులు రావడం ఇది ఆరోసారి కావడం గమనార్హం.
అవును... వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిని భారత్ ఫైనల్ చేసింది. ఇందులో భాగంగా జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడికి భారత్ నుంచి ఆహ్వానం వెళ్లిందని సమాచారం. దీంతో.. ఈ దఫా రిపబ్లిక్ వేడుకలకు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చీఫ్ గెస్ట్ అని అంటున్నారు.
వాస్తవానికి రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ముందుగా భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ఆహ్వానించింది. అయితే కొన్ని ప్రత్యేక కారణాలతో ఆయన హాజరుకాలేకపోతున్నారట. దీంతో సెకండ్ ఆప్షన్ గా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ను భారత ప్రభుత్వం ఆహ్వానించింది!
ఈ నేపథ్యంలో అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జనవరి 26న భారత్ కు రానున్నారు. అదే జరిగితే ఐదు నెలల వ్యవధిలో ఆయన రెండోసారి భారత్ లో పర్యటించినట్లు అవుతుంది. కాగా... ఈ ఏడాది సెప్టెంబరులో భారతదేశం నిర్వహించిన జీ20 సమ్మిట్ కోసం మాక్రాన్ ఢిల్లీని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో చర్చలు జరిపారు.
ఈ చర్చల అనంతరం భారత్ – ఫ్రాన్స్ సంబంధాల పురోగతి కొత్త శిఖరాలను తాకేలా తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే బైడెన్ బిజీగా ఉండటంతో వెంటనే మక్రాన్ ను ఆహ్వానించారు మోడీ. ఈ వేడుకలకు హాజరైతే... ఇండియా రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన ఆరో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ నిలవనున్నారు. ఇప్పటివరకు ఐదుగురు ఫ్రెంచ్ నేతలు రిపబ్లిక్ వేడుకలకు హారయ్యారు.
కాగా... జులైలో పారిస్ లో జరిగిన బాస్టిల్ డే (ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం) వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోడీ హాజరైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్‌సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.