ప్రెస్ మీట్.. చిట్ చాట్ బ్యాక్ గ్రౌండ్ మార్చాలి రేవంత్ సారూ!
ఇక కొన్నిసార్లు మీడియా సమావేశం.. వీలు కాకుంటే చిట్ చాట్ పెడుతున్నారు.
By: Tupaki Desk | 4 Dec 2024 8:07 PM GMTతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిస్సందేంహంగా మీడియాకు అందుబాటులో ఉంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడో కానీ జరగని సీఎం ప్రెస్ మీట్ కు.. ఇప్పుడు తరచూ జరుగుతున్న సీఎం ప్రెస్ మీట్ కూ ప్రజలు పోలిక తెచ్చి చూస్తున్నారు. అంతేకాదు.. రేవంత్ సైతం మీడియాను గౌరవిస్తూ.. హుందాగా జవాబులిస్తూ వస్తున్నారు. ఇక కొన్నిసార్లు మీడియా సమావేశం.. వీలు కాకుంటే చిట్ చాట్ పెడుతున్నారు.
ప్రెస్ మీట్ ఫ్రెండ్లీ సీఎం
మీడియాతో ఇంతగా భేటీ అయ్యే ఒక ముఖ్యమంత్రి ప్రస్తుతం దేశంలోనే ఎవరూ లేరనుకుంటా. ఏడాది కిందటివరకు తెలంగాణకు సీఎంగా ఉన్న కేసీఆర్, ఆరేడు నెలల కిందటి వరకు ఏపీలో సీఎంగా ఉన్న జగన్ మీడియా ముందుకు రావడం చాలా అరుదు. అయితే, రేవంత్ మాత్రం మీడియా సమావేశం నిర్వహించని వారం లేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు.. జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సమస్య పట్ల అత్యంత సానుకూల నిర్ణయాలు తీసుకున్న సీఎంగానూ రేవంత్ జర్నలిస్టు వర్గాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.
అంతా బాగుంది కానీ..
సీఎం రేవంత్ ఇంతగా మీడియాకు అందుబాటులో ఉండడం శుభ పరిణామమే. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలు మీడియా మిత్రుల ద్వారా ఆయనకు నేరుగా చేరుతాయి. అంతా బాగున్నా.. రేవంత్ చిట్ చాట్, మీడియా మీట్ కు సరైన వేదిక లేదా? అనే ప్రశ్న వస్తోంది. ఏవో నాలుగు కుర్చీలు, బల్లలు వేయడం.. సీఎం మంత్రులతో వచ్చి మాట్లాడడం జరిగిపోతోంది.
అత్యంత సాదాసీదా..
ఓ సీఎం అయి ఉండి కూడా రేవంత్ ఆ హంగూ ఆర్భాటాలు లేకుండా అత్యంత సాదాసీదాగా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. దీనికితగినట్లే బ్యాక్ గ్రౌండ్ ఉంటోంది. కేసీఆర్ హయాంలో అత్యంత సుందరంగా నిర్మించిన ప్రగతి భవన్ హాల్ లో ప్రెస్ మీట్లు జరిగేవి. వెనుక ఆంధ్రప్రదేశ్ లోగో కనిపించేలా ఏపీలో జగన్ సైతం కాస్త మంచి ఏర్పాట్లే చేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబూ ప్రెస్ మీట్ ఏర్పాట్లు బాగానే ఉంటున్నాయి. అయితే, రేవంత్ మాత్రం సాధారణ ఏర్పాట్లతోనే నడిపిస్తున్నారు. ఆడంబరాలకు పోకుండా ఆయన పాటిస్తున్న ఈ పద్ధతి సరైనదే అయినా.. ఓ సీఎం స్థాయిలో ఉండాల్సిన ఏర్పాట్లు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సీఎం క్యాంప్ కార్యాలయం లేకపోవడంతో
సీఎం రేవంత్ ప్రగతి భవన్ ను కాదని జూబ్లీహిల్స్ లోని ఇంట్లోనే ఉంటున్నారు. సచివాలయంలో లేదంటే ఇంటి నుంచే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓ దశలో ఎంసీహెచ్ఆర్డీని సీఎం క్యాంప్ కార్యాలయంగా మారుస్తారన్న కథనాలు వచ్చినా అవేవీ కార్యరూపం దాల్చలేదు.
అధికారులతో సమీక్షలూ
మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ వేదికలే కాదు.. ఉన్నతాధికారులతో సమీక్షలనూ సీఎం రేవంత్ సాదాసీదా ఏర్పాట్లతోనే జరిపేస్తున్నారు. మంత్రులు, అత్యున్నతాధికారులతో సమావేశం, సమీక్షలు జరిపే గదులు కూడా చాలా చిన్నగా ఉంటున్నాయి. సీఎం సమీక్ష స్థాయి దర్పం వాటిలో కనిపించడం లేదు. బహుశా.. వీటన్నిటికీ పరిష్కారం సీఎం రేవంత్ సొంత క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడమే. అయితే, అక్కడ తెలంగాణ పటం, చిహ్నం వంటి యాంబియెన్స్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.