Begin typing your search above and press return to search.

చీరలు పాయె... పైసలూ పాయె.. బతుకమ్మ కానుక ఏదీ రేవంతన్న..?

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఏటా మహిళలంతా బతుకమ్మ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు.

By:  Tupaki Desk   |   6 Oct 2024 7:20 AM GMT
చీరలు పాయె... పైసలూ పాయె.. బతుకమ్మ కానుక ఏదీ రేవంతన్న..?
X

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఏటా మహిళలంతా బతుకమ్మ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. తొమ్మిది రోజులపాటు అంతా ఒకదగ్గర చేరి ఆడిపాడుతుంటారు. ఇప్పటికే రాష్ట్రమంతటా బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో సద్దుల బతుకమ్మను కూడా జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్‌పై మహిళల్లో ఒకింత చర్చ నడుస్తోంది.

ఏటా బతుకమ్మ పండుగ వస్తోందంటే ప్రభుత్వం తరఫున రేషన్ కార్డులు కలిగిన మహిళలకు చీరలు పంపిణీ చేసేవారు. ఒక్కో మహిళకు ఒక్కో చీరను అందించేవారు. అలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇస్తున్నారు. అంటే పదేళ్లుగా మహిళలకు చీరలు అందిస్తున్నారు. ఆడబిడ్డకు బతుకమ్మ కానుక అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చీరలను అందించింది. ఏటా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభంలోనే మహిళలకు చీరలు అందేలా చర్యలు తీసుకునే వారు.

అయితే.. పదేళ్ల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. వచ్చినప్పటి నుంచి ఆయా స్కీములను అమలు చేస్తున్నప్పటికీ బతుకమ్మ చీరలను పక్కన పెట్టేశారు. గత ప్రభుత్వం హయాంలో చీరల పథకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ఆరోపించారు. వాటికి సంబంధించి విచారణ సైతం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. దాంతో ఈ ఏడాది నేతన్నలకు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇవ్వలేదు. నేతన్నలు కూడా బతుకమ్మ చీరలను తయారుచేయలేదు.

కట్ చేస్తే.. ఈ ఏడాది బతుకమ్మ చీరలకు బదులు ఒక్కో మహిళకు రూ.500 చొప్పున ప్రభుత్వం తరఫున ఇస్తారని ప్రచారం జరిగింది. రాష్ట్ర మహిళలు కూడా అలానే భావించారు. చీరలు ఇవ్వకపోయినప్పటికీ.. డబ్బులు ఇస్తున్నారని తెలియడంతో కాస్త సంతోష పడ్డారు. కానీ.. పండుగ ముగిసేందుకు సమయం దగ్గర పడుతున్నపటికీ ఇంతవరకు రేవంత్ సర్కార్ నుంచి బతుకమ్మ కానుక ప్రస్తావన రావడం లేదు. దీంతో ప్రభుత్వం నుంచి చీరలు లేకుండా.. పైసలు లేకుండా బతుకమ్మను జరుపుకోవాల్సి వస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.