Begin typing your search above and press return to search.

కౌశిక్ రెడ్డి అరెస్టు ఎపిసోడ్ లో మైలేజీ ఎవరికి? డ్యామేజ్ మరెవరికి?

బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   6 Dec 2024 5:35 AM GMT
కౌశిక్ రెడ్డి అరెస్టు ఎపిసోడ్ లో మైలేజీ ఎవరికి? డ్యామేజ్ మరెవరికి?
X

బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు నాన్ స్టాప్ గా సాగిన హైడ్రామా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయటంతో ఈ ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చినట్లైంది. ఇంతకూ కౌశిక్ రెడ్డి అరెస్టులో అర్థముందా? పోలీసులు సరైన రీతిలోనే వ్యవహరించారా? అరెస్టు చేయాల్సిన అవసరం ఉందా? కౌశిక్ రెడ్డి అరెస్టులో అర్థముందా? బీఆర్ఎస్ నేతల ఆగ్రహంలో పాయింట్ ఉందా? అసలు అరెస్టు చేసేంతగా కౌశిక్ రెడ్డి ఏం చేశారు? ఈ మొత్తం ఎపిసోడ్ లో మైలేజ్ ఎవరికి? డ్యామేజ్ ఎవరికి? అన్న లోతుల్లోకి వెళితే..

తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిలపై కంప్లైంట్ చేయటానికి బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అయితే.. ఆయన కంప్లైంట్ ను అక్కడి వారికి ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. అదే సమయంలో సీఐ బయటకు వెళుతున్నారు. తన కంప్లైంట్ ను సీఐ మాత్రమే తీసుకోవాలంటూ హడావుడి చేశారు కౌశిక్ రెడ్డి.

ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటమే ముఖ్యమైతే.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేయొచ్చు. అందుకు భిన్నంగా తాను ఎమ్మెల్యేను కాబట్టి.. ఫలానా అధికారి మాత్రమే తన ఫిర్యాదును తీసుకోవాలని డిమాండ్ చేయటం.. తన విధి నిర్వహణలో భాగంగా బయటకు వెళుతున్న సీఐ రాఘవేంద్రను అడ్డుకోవటమే కాదు.. తనను చూసి సీఐ పారిపోతున్నట్లుగా తన అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పోస్టు చేసి వైరల్ చేయించారు.

ఒక ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్ కు వెళ్లినప్పుడు.. తాను ఇవ్వాలనుకున్న కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా అధికారులతో వాదనలకు దిగటం.. వారి విధులను అడ్డుకోవటం.. వారిని బెదిరింపులకు గురి చేయటంలో అర్థం లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూసినప్పుడు చిన్న విషయానికి అంత పెద్ద రచ్చ చేయటం వెనుక కౌశిక్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న విమర్శ ఉంది. అంతేకాదు.. స్టేషన్ కు వచ్చిన కౌశిక్ రెడ్డి.. తన కారును పోలీసు వాహనానికి అడ్డుగా పెట్టటమే కాదు.. స్టేషన్ లో ఒక రేంజ్ హడావుడి చేశారు.

తనకు తానుగా రచ్చ చేసుకున్న కౌశిక్ రెడ్డి.. పోలీసు అధికారుల తీరుపైనా తప్పుడు ప్రచారానికి కారణమయ్యారన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ స్పెక్టర్ కంప్లైంట్ మేరకు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు తమను అరెస్టు చేయటం ద్వారా విపక్ష నేతలు మైలేజీ మూట కట్టుకుంటారు. కౌశిక్ రెడ్డి వ్యవహరారం చూస్తే.. మైలేజీ కాదు డ్యామేజ్ చేసుకుంటున్నారన్న భావన కలుగక మానదు. కారణం.. తన మీద సానుభూతికి భిన్నంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇంత రచ్చ చేసుకోవటం అవసరమా? అన్న భావన కలుగక మానదు. అదే పనిగా తమను చిరాకు పెట్టిస్తున్న కౌశిక్ రెడ్డికి పోలీసులు అనూహ్యంగా అరెస్టు షాకిచ్చారన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. చిన్న విషయాలకు రచ్చ చేయటం మానేసి.. ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తే కౌశిక్ రెడ్డి ఇమేజ్ పెరిగే వీలుందని చెప్పక తప్పదు.