నిన్న 'ఇథనాల్'.. నేడు 'లగచర్ల'.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
రేవంత్ సమీప బంధువుల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 29 Nov 2024 9:15 AM GMTప్రజల కోణంలో తెలంగాణలో వరుసగా పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పరిధి లగచర్లలో ఫార్మా క్లస్టర్ ను వ్యతిరేకిస్తూ ప్రజలు అధికారులపై దాడులకు దిగారు. ఇంతలోనే నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలంటూ పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం వారిని ఉపశమింపజేసేలా ఉన్నతాధికారులను పంపింది. అయితే, ఇప్పటికీ లగచర్ల భూములకు సంబంధించి రాజకీయ రగడ జరుగుతూనే ఉంది. రేవంత్ సమీప బంధువుల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. అది చల్లారక ముందే దిలావర్ పూర్ ఇష్యూ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాస్త ఆత్మరక్షణలో పడింది.
ఇథనాల్ పై మథనం
దిలావర్ పూర్ లో ఇథనాల్ పరిశ్రమకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తయారీకీ అనుమతులు వచ్చాయి. కేవలం ఇథనాల్ తయారీకే ఈ అనుమతులు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర ఉత్పత్తులకూ ఓకే చెప్పింది. దీంతో మొత్తం ఉత్పత్తులను రద్దు చేయాలా? ఇతర ఉత్పత్తులను రద్దు చేయాలా? అనే సందిగ్థం నెలకొంది.
లగచర్ల రగడ తీరినట్లే..
ఫార్మా విలేజ్/ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను లిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆలోచనలను, ప్రజా ఉద్యమాలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టింది. కాగా, లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ను ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
ఇథనాల్ పాపం బీఆర్ఎస్ దే
లగచర్లలో భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూనే.. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ లోని ఇథలాల్ కంపెనీకి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే దీనికి అనుమతులు మంజూరు చేశారంటూ ఆధారలను విడుదల చేసింది. బీఆర్ఎస్ సర్కారు ప్రజలను మోసం చేసిందని పేర్కొంది. పర్యావరణ శాఖ అనుమతులను ఉల్లంఘించి నిబంధనలను తుంగలో తొక్కారని తెలిపింది. కేంద్రం ఫ్యూయల్ ఇథనాల్ కు మాత్రమే అనుమతి ఇచ్చిందని.. వాటిని పట్టించుకోకుండా.. ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తులకు అప్పటి మంత్రివర్గం అనుమతి జారీ చేసిందని వివరించింది. ఫ్యూయల్ ఇథనాల్ సాకుతో కంపెనీకి అనుకూలంగా పర్మిషన్లు ఇచ్చారని తెలిపింది. అయితే ఈ మేరకు మినహాయంపు కోసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీ అడ్డదారులు అనుసరించిందని ప్రభుత్వం మండిపడింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థలు ఎన్‌వోసీ తీసుకోవాలి. అదేమీ లేకుండా పీఎంకే డిస్టిలేషన్స్ గత ప్రభుత్వ అండతో కాంపౌండ్ వాల్ కట్టిందని.. 2022 అక్టోబర్ 22న 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఇతర ఉత్పత్తుల కోసం ఎల్‌వోఐ జారీ అయిందని తెలిపింది.