మరి చిరంజీవి ఆ పని చేస్తారా?
ఇలా కాంగ్రెస్ వైపు నుంచి అయితే మెగాస్టార్ హస్తం పార్టీ వారే అని అంటారు.
By: Tupaki Desk | 14 Dec 2024 1:56 AM GMTమెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఉన్నారా అంటే లేరు అనే చెబుతారు. అదే మాటను కాంగ్రెస్ జాతీయ పెద్దలను అడిగితే ఆయన మావాడే అని అంటారు. అంతే కాదు ఆయనకు పార్టీ మెంబర్ షిప్ ఇస్తారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ ని ఎన్నుకోవడానికి కూడా ఓటు హక్కు ఇస్తారు. ఇలా కాంగ్రెస్ వైపు నుంచి అయితే మెగాస్టార్ హస్తం పార్టీ వారే అని అంటారు.
ఏపీలోని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా చిరంజీవిని ఇప్పటికీ కాంగ్రెస్ మనిషిగా చూస్తారు. అయితే వీరంతా ఒక ఎత్తు తెలంగాణాలో కాంగ్రెస్ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి చిరంజీవిని మెగాస్టార్ గా చూస్తారా లేక పార్టీ మనిషిగా చూస్తారా అంటే ఆయన కాంగ్రెస్ నేతగా చిరంజీవిని చూస్తున్నారు అని చెప్పారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ లో ఎలాంటి రాజకీయం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. చట్టం తన పని తాను చేస్తోంది అని ఆయన ప్రయత్నం చేశారు. తన వద్దనే హోం శాఖ ఉందని అన్నారు.
సినిమా నటులు లాభాల కోసం సినిమాలు తీస్తారని ఆయన అంటూ వారు ఏమైనా సైనికులా అని కూడా ప్రశ్నించారు. పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లో నిలబడి యుద్ధాలు ఏమీ చేయలేదు కదా అని కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక తల్లి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిందని కుమారుడు కోమాలో ఉన్నారని రేవంత్ రెడ్డి అంటూ ప్రాణాలు పోయినా కేసులు పెట్టకూడదా అని నిలదీశారు. చట్టానికి ఎవరూ ఎక్కువ కారని ఆయన అన్నారు.
ఇక తనకు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కుటుంబం బంధువులు అవుతారని కొత్త విషయం చెప్పారు. అంతే కాదు అల్లు అర్జున్ మామ, అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ కాంగ్రెస్ వారే కదా అని ఆయన మరో మాట అన్నారు. అయినా కూడా పార్టీలు బంధుత్వాలు ఏవీ చూడకుండా చట్టం తన పని తాను చేసుకుని పోతుందని రేవంత్ రెడ్డి అన్నారు
ఇవన్నీ పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ వారే అని రేవంత్ రెడ్డి చెప్పడమే ఇపుడు చర్చగా ఉంది. తాను రాజకీయాల నుంచి విరమించుకున్నాను అని అనేక సందర్భాలలో మెగాస్టార్ చెప్పినా కాంగ్రెస్ మాత్రం ఆయన మావాడే అంటోంది. ఇక బీజేపీ నేతలు అయితే చిరంజీవిని తమ వాడే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
మొత్తం మీద మెగాస్టార్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకీ రాజీనామా చేయలేదన్న లాజిక్ పాయింట్ ని తీసుకునే ఈ విధంగా అంటున్నారు అని తెలుస్తోంది. మరి చిరంజీవి తాను ఆ పార్టీకి రాజీనామా చేశాను అని అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది అపుడు ఎవరూ ఆయనను హస్తం పార్టీ వారు అని క్లెయిం చేయరని అంటున్నారు. మరి చిరంజీవి ఆ పని చేస్తారా లేక పోతే మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ వారే అని చెప్పేందుకు ఇలాగే చేస్తారని అంటున్నారు.