ఏపీలో కూడా హైడ్రా...టార్గెట్ వాళ్ళే !?
ఏపీలో సైతం హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అన్నదే ఇపుడు చర్చగా సాగుతోంది.
By: Tupaki Desk | 27 Aug 2024 10:30 PM GMTతెలంగాణా రాజకీయాలను హడలెత్తిస్తున్న హైడ్రా టాపిక్ ఇపుడు ఏపీలో కూడా హాట్ హాట్ గా సాగుతోంది. ఏపీలో సైతం హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అన్నదే ఇపుడు చర్చగా సాగుతోంది. తెలంగాణాలో ఆక్రమణలకు పాల్పడుతున్న వారి మీద హైడ్రాను ప్రయోగిస్తూ భారీ భవనాలను కూలగొడుతూ హైడ్రా భూకబ్జాదారుల గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తోంది.
వారూ వీరూ అని చూడమని ఎవరైనా ఒక్కటే అంటూ హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చి రేవంత్ రెడ్డి ఒక కొత్త ట్రెండ్ కి తెర తీశారు. దాని వల్ల రేవంత్ రెడ్డికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. దాంతో ఏపీలో సైతం అలాంటి విధానం ఉండాలని ఒక చర్చ అయితే గట్టిగా సాగుతోంది.
ఎందుకంటే కాదేదీ అనర్హం అన్న తీరున ప్రపంచం అంతా భూమి ఎక్కడ ఉంటే అక్కడ కబ్జా సాగుతూనే ఉంది. గజానికి ఒక గాంధారి పుత్రుడు అనేట్లుగా భూమిని చుట్టేస్తున్నారు. ప్రభుత్వ భూములు అంటే అనాధలని వాటి మీద తమకే సర్వ హక్కులు ఉన్నాయని పలుకుబడి కలిగిన వారు అంతా ఆలోచన చేస్తున్నారు. దొరికిన కాడికి దొరినట్లుగా భూములను కప్పేస్తూ కర్చీఫ్ పడేస్తున్నారు.
ఇలా ఏపీలో చూస్తే చెరువులు దిగమింగిన మహానుభావులు ఉన్నారు. కాలువలను కప్పెటేస్తే పెద్ద మనుషులూ ఉన్నారు, చిన్న నీటి గుంటలు ఏరులు సెలయేరులు ఇలా ఏదీ లెక్క లేకుండా అన్నింటా ఆక్రమణలు యధేచ్చగా సాగిపోతున్నాయి. ఫలితంగా వానలు కురిసినా ఆ నీరు చేరడానికి చెరువులు లేవు. పారడానికి ఏరులు లేవు.
ఇక నీటి కొరత కూడా పట్టి పీడిస్తోంది. దీంతో ఈ విధంగా ఆక్రమణలు చేసిన వారి భరతం పట్టాలని ఏపీకి కూడా హైడ్రా రావాలని ఒక డిమాండ్ అయితే సామాన్యుల నుంచి వస్తోంది. దీంతో ఏపీలో కూడా హైడ్రా వస్తుంది అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఏపీలో హైడ్రా అవసరం ఉందని కూడా అంతా ఆయన మాటలను సమర్ధిస్తున్నారు. ఇక విశాఖ జిల్లాలో తాజాగా పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఆక్రమణదారులు తాముగా భూములు ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తే ఓకే. లేకపోతే ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
గత వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములనే కాదు ఆఖరికి పార్కులను కూడా ఆక్రమించారని ఆయన మండి పడ్డారు. ఆనాడు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కూడా ఆయన నిందించారు. ఇలాంటి ఆక్రమణదారుల భరతం పట్టే విధంగా కూటమి ప్రభుత్వం చట్టాలలో మార్పు చేస్తుందని నారాయణ సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు.
దీంతో ఏపీలో హైడ్రా వస్తే ఎలా ఉంటుంది. దాని యాక్షన్ ఏమిటి అన్నది చర్చకు తావిస్తోంది. తెలంగాణాలో హైడ్రా అయితే కొంతవరకూ ఉక్కు పాదమే పెద్దల మీద మోపుతోంది. అదే సమయంలో ఇంకా కీలక వ్యక్తుల మీద హైడ్రా పాదాలు మోపలేదని విమర్శలు ఉన్నాయి. హైడ్రాని రాజకీయ కక్షల కోసం ఉపయోగించుకోకుండా అందరి భరతం పట్టాలని కూడా తెలంగాణా ప్రభుత్వానికి సూచనలు వస్తున్నాయి.
అదే తీరున ఏపీలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ వస్తే మాత్రం కేవలం గత ప్రభుత్వం అని వైసీపీ వారినే టార్గెట్ చేస్తే సరిపోదు అని అంటున్నారు. విశాఖలో భూ కబ్జాలలో అన్ని పార్టీల హ్యాండ్ ఉంది. అలాగే ఏపీలో జరిగిన భూ కబ్జాలలో అందరూ ఉన్నారు. దాంతో ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించుకున్నా హైడ్రా లాంటి వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా తన పని తాను చేసుకుని పోయేలా ఉండాలని కోరుతున్నారు. మొత్తానికి ఏపీలో హైడ్రా అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.