Begin typing your search above and press return to search.

కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్..? గవర్నర్‌తో రేవంత్ భేటీ వెనుక రహస్యమేంటి..?

ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగానూ కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   7 Nov 2024 4:41 AM GMT
కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్..? గవర్నర్‌తో రేవంత్ భేటీ వెనుక రహస్యమేంటి..?
X

తెలంగాణ రాష్ట్రంలో బిగ్ బాంబులు పేలబోతున్నాయా..? మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ కీలక నేత అరెస్టు కాబోతున్నారా..? ఫార్ములా ఈ-కార్ రేసింగులో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుందా..? ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కాబోతున్నదా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేల్చిన బాంబులకు సమయం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగానూ కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ కేడర్‌లోనూ మరింత ఉత్కంఠ నెలకొంది.


ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేటు లిమిటెడ్, పురపాలక శాఖల మధ్య ఒప్పందం మేరకు 2022లో లాంగ్ ఫాం అగ్రిమెంట్ జరిగింది. 9,10,11,12 సీజన్ల కార్ రేస్‌లు నిర్వహించేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. తొమ్మిదో సీజన్ కార్ రేసును 2023 ఫిబ్రవరి 10,11 తేదీల్లో హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో నిర్వహించారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఈ ఒప్పందం జరిగింది. శాఖకు అధిపతిగా తాను ఎంవోయూ చేశానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఇప్పటికే ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అయితే.. ఆ సమయంలో రూ.55 కోట్లు ఎలాంటి ఆర్థిక అనుమతులు లేకుండానే విదేశీ కంపెనీలకు మళ్లించారు. అయితే.. వాటిని మళ్లించడానికి ముఖ్యకారణం అప్పటి మున్సిపల్ మంత్రేనని ఐఏఎస్ అరవింద్ స్పష్టం చేశారు. ఆయన ఆదేశాల మేరకే తాము ఆ ఫండ్స్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. దాంతో ఈ కేసు ఇప్పుడు కేటీఆర్‌ మెడకు చుట్టుకుంది. పురపాలక శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ దీనిపై విచారణ చేపట్టింది.

ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సడన్‌గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ కావడం చర్చకు దారితీసింది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న కులగణన సర్వేపై చర్చించినట్లుగా తెలిసింది. దాంతో పాటే మరో కీలక అంశాన్ని సైతం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఫార్ములా ఈ -కార్ రేసులో జరిగిన గోల్‌మాల్ అంశాన్ని గవర్నర్‌తో డిస్కస్ చేసినట్లుగా సమాచారం. ఈ కార్ రేసింగ్‌లో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది.

ఇప్పటికే కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. దీనిపై గవర్నర్ న్యాయ సలహా కోరినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు అప్పటి రాజకీయ పెద్దలపై కూడా ఈ కేసుకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో అన్నింటిపైనా చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా అప్పటి అధికారి అరవింద్ కుమార్ కూడా ఇందులో భాగస్వామిగా ఉండడంతో ఆయనపై చర్యలపైనా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారని సమాచారం. అయితే.. ఇప్పటికే అధికారిపై చర్యలకు ఏసీబీ అనుమతి కోరగా.. ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసు విషయంలో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఒక్కసారిగా హీటెక్కాయి. ఎఫ్ఐఆర్ నమోదు అయితే.. కేటీఆర్‌ను విచారించి తప్పదా అన్న చర్చ నడుస్తోంది.