ఒకే సీన్లోకి అసద్.. రేవంత.. మోడీ.. నారాయణ పేట కుర్రాడు ఊరికి వచ్చాడు
నారాయణపేటకు చెందిన సయ్యద్ మహమ్మద్ సుఫియన్ 2021లో దుబాయ్ వెళ్లాడు.
By: Tupaki Desk | 17 Sep 2024 4:58 AM GMTరాజకీయాల్లో సవాలచ్చ ఉండొచ్చు. కష్టం వచ్చినప్పుడు సాయం కోసం అడగాలే కానీ.. మిగిలిన విషయాల్నిపక్కన పెట్టేసి అపన్నహస్తాన్ని అందించే రాజకీయ అధినేతలు మన చుట్టూ ఇంకా ఉన్నారన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. దుబాయ్ లో ఉద్యోగం అంటే వెళ్లి.. అక్కడికి వెళ్లాక రెట్టింపు జీతంతో రష్యాలో జాబ్ అంటే వెళ్లి.. అడ్డంగా బుక్ అయిన వ్యక్తిని తిరిగి ఇండియాకు తీసుకురావటానికి పడిన కష్టం.. అందులో ఇన్ వాల్వ్ అయిన అధినేతల కాంబినేషన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఇలా కూడా జరుగుతుందా? అన్నట్లుగా ఉన్న ఈ ఉదంతం చూశాక.. మానవత్వం ముందు.. రాజకీయ శత్రుత్వం మంచుముక్కలా కరిగిపోతుందన్న సత్యం అర్థమవుతోంది. మనం మనం కొట్టుకోవచ్చు. కానీ.. మన మీదకు బయటోడు వస్తే మాత్రం.. మనమంతా ఒక్కటేనన్న భావన కలిగేలా నేతల తీరు ఉందని చెప్పాలి. దేశం కాని దేశంలో చిక్కుకుపోయిన మనోడ్ని క్షేమంగా మన గడ్డ మీదకు తీసుకురావటానికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా జతకలవటంతో ఇష్యూ ఒక కొలిక్కి రావటమే కాదు.. మనోడు ఊరికి వచ్చేసిన ఉదంతంగా దీన్ని చెప్పాలి.
నారాయణపేటకు చెందిన సయ్యద్ మహమ్మద్ సుఫియన్ 2021లో దుబాయ్ వెళ్లాడు. నెలకు రూ.30వేల జీతంతో వంట విభాగంలో పని చేశాడు. కట్ చేస్తే.. రష్యాలో సెక్యూరిటీ గార్డు జాబ్ ఉందని.. నెలకు రూ.లక్ష జీతంగా చెప్పటంతో ఓకే చెప్పేశాడు.అంతేకాదు.. రూ.3 లక్షలు ఏజెంట్ కు ఇచ్చి మరీ రష్యాకు వెళ్లాడు. సయ్యద్ ను మాస్కోలో వదిలిన ఏజెంట్ తన దారిన తాను వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడికి సైనికుల దుస్తులు వేసి.. హెలికాఫ్టర్ లో రష్యా - ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో ఒక శిబిరంలో వదిలేశారు.
గన్స్ కాల్చటం.. బాంబులు విసరటం.. బంకర్లు తవ్వటం.. యుద్ధంలో గాయపడిన రష్యా సైనికుల్ని మోసుకెళ్లటం.. ఫస్ట్ ఎయిడ్ లాంటి సేవల్ని అందించటం లాంటి పనులు చేయించారు. భాషా సమస్య.. తినేందుకు సరైన తిండి లేకపోవటం.. అన్నింటికి మించిన ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు. దీంతో బిత్తరపోయిన అతను. .తనను ఏజెంట్ మోసం చేశాడన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు.
ఎనిమిది నెలల నరకం తర్వాత సోషల్ మీడియా ద్వారా తన వేదనను వీడియో రూపంలో పోస్టు చేయగా.. అతడి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని నారాయణ పేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికారెడ్డికి చేరింది. వారు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో మజ్లిస్ అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సైతం ఎంట్రీ ఇవ్వటంతో.. ప్రధానమంత్రి మోడీ ద్రష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.
దీంతో స్పందించిన ఆయన.. సయ్యద్ మహమ్మద్ సుఫియన్ ను క్షేమంగా భారత్ కు తీసుకొచ్చేందుకు తగిన ప్రయత్నాలు చేశారు. వీరికి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించి రష్యా ప్రభుత్వంతో మాట్లాడారు. చివరకు వారిని ఒప్పించి.. విముక్తి కల్పించారు. గతంలో ఇదే తరహాలో హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అఫ్సాన్ అనే కుర్రాడు ఇలానే జాబ్ కోసం వెళ్లి.. ఉక్రెయిన్ యుద్ధంలో మరణించాడు. తాజా ఎపిసోడ్ లో మాత్రం సయ్యద్ ఊరికి చేరుకొని తల్లిదండ్రుల్ని కలిసిన వైనంతో కథ సుఖాంతమైంది.