ఈజ్ ఆఫ్ డూయింగ్.. ఫ్యూచర్ సిటీపై రేవంత్ ఫోకస్
హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By: Tupaki Desk | 11 Jan 2025 3:30 PM GMTతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదులో మరో కీలక నగరాన్ని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. అత్యంత సులభతరమైన వ్యాపారంతో పర్యావరణ వ్యవస్థను రూపొందించాలని లక్ష్యంతో హైదరాబాద్‌ను కాలుష్య రహిత, నెట్ జీరో నగరంగా మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు వ్యాఖ్యానించారు. సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు తన ఆలోచనను వెల్లడించారు. భవిష్యత్తు నగరంగా పిలువబడే నాలుగో నగరాన్ని హైదరాబాదులో నిర్మించాలని తాము నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో హైదరాబాద్ నగరం న్యూయార్క్, లండన్, టోక్యో, దుబాయిలతో పోటీ పడనుందని రేవంత్ జోస్యం చెప్పారు. దేశంలోనే హైదరాబాద్‌ను గొప్ప నగరంగా నిర్మించాలని తాము భావిస్తున్నామని, ఈ నగరం అంతా కార్బన్ జీరోను లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు. 3,200 బస్సుల స్థానంలో ఈవీ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, శీతల గడ్డంగులు, గెడ్డంగుల మౌలిక సదుపాయాలను పెంపొందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని, ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగంపై మొగ్గు చూపించేలా అవగాహనను కల్పించడంతోపాటు అందుకు అనుగుణంగా ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను వరదలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఏపీలోని బందర్ పోర్టుకు ప్రత్యేక రహదారిని, రైల్వే అనుసంధానం జరుగుతోందని వెల్లడించారు. మచిలీపట్నం ఓడరేవుకు రోడ్డు, రైలు మార్గాన్ని నిర్మించే ప్రతిపాదనలో ఉన్నాయని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.