రేవంత్ ధీమాకు ఒక లెక్క ఉంది !
ఆ మీదట అక్కడ నుంచి సీఎం గానూ ప్రతిష్టించింది. ఈ మధ్యలో ఎందరు సీనియర్లు అలకలు పోయినా కాంగ్రెస్ అయనకే చాన్స్ అని చెప్పేసింది.
By: Tupaki Desk | 27 Dec 2024 5:30 AM GMTకాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఏ రకమైన ఇబ్బందులూ లేకుండా ఏడాది పాలనను పూర్తి చేసుకోవడం అన్నది తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించిన ఘనత గానే చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ అనే మహా సముద్రంలో ఎందరో నాయకులు ఉంటారు. అందరూ కాకలు తీరిన యోధులే. అంతే కాదు అందరూ పాత కాపులూ అనుభవంలో రాటు తేలిన వారే. వారి మధ్యన పట్టుమని పదేళ్ల పాటు కూడా కాంగ్రెస్ నాయకుడిగా ముద్ర లేని రేవంత్ రెడ్డి సీఎం హోదాలో నిభాయించుకుని రావడం అంటే మాటలు అయితే కానే కాదు.
అయితే రేవంత్ రెడ్డికి ఇది ఎలా సాధ్యమైంది అంటే ఆయన వెనక అండగా కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది. తెలంగాణాను ప్రకటించినా కూడా తమకు అధికారం దక్కకపోయింది కదా అన్న చింతలో ఉన్న కాంగ్రెస్ కి అధికారాన్ని తెచ్చి చూపించిన వారు రేవంత్ రెడ్డి. ఆయన మాస్ లీడర్. జనంలోకి వెళ్తే వారిని ఆకట్టుకునేలా మాట్లాడగల దిట్ట.
అందుకే కాంగ్రెస్ ఆయనను ఏరి కోరి పీసీసీ చీఫ్ గా చేసింది. ఆ మీదట అక్కడ నుంచి సీఎం గానూ ప్రతిష్టించింది. ఈ మధ్యలో ఎందరు సీనియర్లు అలకలు పోయినా కాంగ్రెస్ అయనకే చాన్స్ అని చెప్పేసింది. ఎందుకు అంటే కేసీఆర్ లాంటి మాటకారిని దూకుడు నేతను అంతే స్థాయిలో ఎదుర్కొనే సత్తా ఉన్న వారుగా ఆయనను కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది. అందుకే ప్రోత్సహిస్తోంది.
ఇది ఒక విధంగా రేవంత్ రెడ్డికి అదృష్టంగానే చెప్పాలి. వైఎస్సార్ తరువాత కాంగ్రెస్ సీఎంలలో ఆ మాదిరి స్వేచ్చను అందుకున్న నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక కాంగ్రెస్ కి దేశంలో అప్రతిహత విజయాలు కూడా ఏమీ దక్కడం లేదు. అందుకు కూడా తెలంగాణాను కెలకాలని అనుకోవడం లేదు. అది కూడా రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ గా మారుతోంది.
ఇక రాజకీయంగా చూస్తే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వారు. ఆయనకు అక్కడ నేతలతోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయి. తనకంటూ ఒక వర్గాన్ని ఆయన డెవలప్ చేసుకున్నారు. ఈ రోజున కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో చూస్తే ఆయన కోసం ఉండేవారే అధికంగా కనిపిస్తారు. ఆ మీదట తెలంగాణాలో రాజకీయ సమీకరణలు కూడా రేవంత్ రెడ్డి సీఎం పదవిని కాపు కాస్తున్నాయి.
చాన్స్ దొరికితే దూసుకుని పోదామని చూస్తున్న బీజేపీ అవసరం అయితే ఏమైనా చేస్తుంది అన్నది కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు అని అంటారు. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి బలమైన నాయకుడిగా కనిపించారు. ఆయననే కొనసాగిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దాని వల్ల కాంగ్రెస్ ఇబ్బందులు పడుతుందా లేదా అన్నది భవిష్యత్తు చెబుతుంది. సినీ పరిశ్రమతో ఏ ముఖ్యమంత్రీ కూడా పెట్టుకోరు. మరీ ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం గట్టిగానే ఉంటున్నారు.
వారిని పిలిచి మాట్లాడినపుడు ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు పెట్టారు కానీ వారి విన్నపాలను ఏ మేరకు అంగీకరించారో తెలియదు. పైగా బెనిఫిట్ షోలు లేవు అనేశారని టికెట్లు పెంపు ఉండదని చెప్పేశారని కూడా అంటున్నారు.
ఇది సినీ పరిశ్రమను షాక్ లోకి నెట్టెదే అంటున్నారు. ముంగిటలో సంక్రాంతి వంటి బ్రహ్మాండమైన సీజన్ ని ఉంచుకుని ఈ విధంగా చేసుకోవడం అంటే కచ్చితంగా నష్టపోతామన్న భయం అయితే సినీ పరిశ్రమలో ఉంది. దానికి తోడు ఒక పాన్ ఇండియా హీరో అరెస్ట్, మరో పాపులర్ హీరోకి చెందిన కన్వెషన్ ని కూల్చివేయడం వంటివి కూడా చర్చకు వద్దన్నా వస్తాయనే అంటున్నారు.
ఇక హైడ్రా పేరుతో చేసిన దూకుడు కూడా సామాన్యులకు అది చేరనంతవరకే వారి చప్పట్లకు నోచుకుంది. మూసీ నది సుందరీకరణ అంటూ చేసిన ప్రయత్నాలకు బ్రేకులు పడడం వెనక సామాన్యుడి రెడ్ సిగ్నల్ ఉందని అంటున్నారు. ఇలా నిర్ణయాలు ఎపుడూ అందరినీ సంతృప్తి పరచవు. అదే విధంగా పాలన చేసినపుడు అందరినీ కలుపుకుని పోవడానికి కుదరకపోయినా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా కనిపించాలి.
విపక్షం మీద అదే దూకుడు రాజకీయంతో రేవంత్ రెడ్డి సాగుతున్నారు. కేటీయార్ మీద ఏసీబీ కేసు నమోదు అయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి మీద విచారణ జరిపించాలనుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి.
ఇక ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహాన్ని తెలంగాణాలో ఏర్పాటుకు స్థలం ఇస్తామని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ తెలంగాణా వాదానికి మళ్లీ ఊతమిచ్చినట్లుగా ఉంటుందని కాంగ్రెస్ లో ఒక వైపు చర్చ సాగుతోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన నిర్ణయాలను దూకుడుగానే తీసుకుంటున్నారు.
ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఆయనకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ లోపలా బయటా ఏమి జరుగుతుందో తెలుసు. తెలంగాణా రాజకీయమూ తెలుసు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రాజకీయమూ ఎన్డీయే రాజకీయమూ తెలుసు. వీటిని ఆకళింపు చేసుకున్న మీదటనే ఆయన తన స్పీడ్ ని పెంచుకుంటూ పోతున్నారు. ఆయనలో ధీమాకు ఒక లెక్క ఉంది. అది అర్ధం అయిన వారికే అవుతుంది.