సోనియా పేరుతో ఓట్లు అడిగితే ఏం లాభమో చెప్పిన సీఎం రేవంత్
ఎన్నికల వేళలో.. తాము సోనియాగాంధీ పేరుతోనే ఓట్లు అడుగుతామని.. తన పేరుతో ఓట్లు అడిగితే జరిగే నష్టాన్ని భలేగా అభివర్ణించారు.
By: Tupaki Desk | 10 Feb 2025 4:46 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలే మాటలన్నట్లుగా ఆయన మాట్లాడతారు. జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టిన బాగానే ఉంటుందన్నట్లుగా మాటలు బాగా చెప్పే సీఎం రేవంత్ తరచూ తన సత్తా చాటుతూ ఉంటారు. అవకాశం లభించిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ అధినాయకత్వం మీద తనకున్న విధేయతను చాటేందుకు అస్సలు వెనుకాడరు. అందుకోసం తనను తాను తగ్గించుకోవటానికి సిద్ధపడుతుంటారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించిన ఆయన..రేవంత్ తెలివే తెలివి అన్న భావన కలిగేలా చేశారని చెప్పాలి.
ఎన్నికల వేళలో.. తాము సోనియాగాంధీ పేరుతోనే ఓట్లు అడుగుతామని.. తన పేరుతో ఓట్లు అడిగితే జరిగే నష్టాన్ని భలేగా అభివర్ణించారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో బీజేపీ స్థానిక ఎన్నికల్లోనూ ఓట్లు అడుగుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రజలను జాతీయ నాయకుల పేరుతో ఓట్లు అడిగితే ఫలితం ఉంటుందన్న రేవంత్ వాదనను ఆయన మాటల్లో చూస్తే.. ‘‘సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీజేపీ మోడీ పేరుతో ఓట్లు అడుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పేరుతో ఓట్లు అడిగితే.. ఓటరు అగ్రకులాన్ని చూస్తాడు. తాము బీసీలమని.. రేవంత్ కు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తారు. అదే సోనియాగాంధీ పేరుతో ఓట్లు అడిగితే కులాన్ని పెద్దగా పట్టించుకోరు. మేం అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా గాంధీ పేరుతోనే ఓట్లు అడిగాం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను గెలిపించాలని కోరాం’ అంటూ చెప్పారు.
సీఎం రేవంత్ మాటల్ని విన్నప్పుడు ఆయన గడుసుతనం కనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వాతావరణం వేరు. ఆ సందర్భంగా కేసీఆర్ మీద కంటే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ఆ పార్టీ కొంపముంచింది. దీనికి తోడు కేసీఆర్ ఫ్యామిలీ మీద ఉన్న కోపం తప్పించి.. గులాబీ బాస్ కేసీఆర్ మీద వ్యతిరేకత పెద్దగా లేదనే చెప్పాలి. నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అతి కొద్దిమందిని మార్చారే తప్పించి.. వ్యతిరేకత ఉన్న వారిని మార్చేసి.. కొత్త అభ్యర్థులను బరిలోకి దించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కానీ.. విజయం సాధించిన రేవంత్.. వేరే రాష్ట్రంలో జరిగిన కార్యక్రమంలో తమ పార్టీ విజయం వెనుక ఉన్న కారణం సోనియా అంటూ క్రెడిట్ మొత్తం ఆమె ఖాతాలో వేయటం ద్వారా.. తన విధేయతను జాతీయ స్థాయిలో చాటుకున్నారని చెప్పాలి.
రేవంత్ పేరుతో ఓట్లు అడిగితే బీసీలు ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతారంటూ కొత్త వాదనను వినిపించిన సీఎం తన వాదనలోలాజిక్ మిస్ అయ్యారు. రేవంత్ పేరుతో ఓట్లు అడిగితే.. బీసీలు ప్రశ్నిస్తారన్నప్పుడు.. సోనియా పేరుతో ఓట్లు అడిగితే.. విదేశీయురాలన్న ప్రశ్నను ఓటర్లు ఎందుకు లేవనెత్తరు? అన్న ప్రశ్నకు సీఎం రేవంత్ ఏమని బదులిస్తారు? 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల వేళలో సోనియాగాంధీ జాతీయతను తరచూ ప్రశ్నించటం ద్వారానే బీజేపీలబ్థి పొందిన విషయాన్ని రేవంత్ మర్చిపోయారా? అన్నది ప్రశ్న. ఏమైనా.. పార్టీ పట్ల.. పార్టీ అధినాయకత్వం విషయంలో తనకున్న కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని చాటి చెప్పటం ద్వారా.. రేవంత్ తన తెలివిని మరోసారి ప్రదర్శించారని మాత్రం చెప్పక తప్పదు.