యూత్ కాంగ్రెస్ శక్తికి చంద్రబాబు, కేసీఆర్ నిదర్శనం.. రేవంత్ వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన.. కాంగ్రెస్ కార్యకర్తలకు, యూత్ కాంగ్రెస్ నేతలకు కీలక సూచనలు చేశారు.
By: Tupaki Desk | 14 Feb 2025 12:42 PM GMTఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్స్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తాయి, ఉన్నత స్థానాలకు వెళ్తారు అని చెప్పే క్రమంలో వీరిద్దరి ప్రస్థావన తెచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
అవును... జక్కిడి శివచరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన.. కాంగ్రెస్ కార్యకర్తలకు, యూత్ కాంగ్రెస్ నేతలకు కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా.. ఢిల్లీ నుంచి పదవులు వచ్చే రోజులు పోయాయని అన్నారు.
నాయకుల ఫ్లెక్సీలు కడితేనో.. నేతలు కనిపించినప్పుడు దండం పెట్టి, దండేస్తేనో పదవులు రావని.. అలా పదవులు దక్కించుకుందామని ఎవరైనా అనుకుంటే అవి మరిచిపోవాలని.. కష్టపడి పని చేస్తేనే పదవులు దక్కుతాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ప్రజాభిమానంతో గెలిచారు కానీ డబ్బుతో కాదని అన్నారు.
ఎన్నికల్లో డబ్బులే గెలిపిస్తాయని అనుకుంటే కేసీఆర్ 100 సీట్లు వచ్చేవని.. ఆయన వద్ద, ఆయన కొడుకు వద్ద, బిడ్డ వద్ద, మేనల్లుడు వద్ద లారీల లారీల డబ్బు ఉందని.. అయినా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని తెలిపారు. అసలు ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమికి కవితే కారణమని.. వారి అవినీతి చూసే తెలంగాణ ప్రజలు బీఆరెస్స్ ను బండకేసి కొట్టారని తెలిపారు.
ఈ నేపథ్యలోనే తెలుగు రాష్ట్రాల్లోని అగ్రనాయకులు యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని రేవంత్ తెలిపారు. చంద్రబాబు, కేసీఆర్ ఆ కోవకే చెందుతారని.. యూత్ కాంగ్రెస్ కు అంత శక్తి ఉందని స్పష్టం చేశారు. ఒక్కసారి కాదు.. మరో 20 ఏళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని.. ప్రధాని మోడీపై యూత్ కాంగ్రెస్ తో కలిసి తాము యుద్ధానికి సిద్ధమని రేవంత్ తెలిపారు.