Begin typing your search above and press return to search.

కేసీఆర్ పలవరింత కాదు పాలన మీద ఫోకస్ చేయ్ రేవంత్

పదవిని చేపట్టిన క్షణం మొదలు ఇప్పటివరకు గులాబీ బాస్ కేసీఆర్ ను మాటలతో ఉతుకుడు కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్.

By:  Tupaki Desk   |   12 Oct 2024 5:30 AM GMT
కేసీఆర్ పలవరింత కాదు పాలన మీద ఫోకస్ చేయ్ రేవంత్
X

రాజకీయ ప్రత్యర్థిని ఎలా డీల్ చేయాలన్నది ఒక ఎత్తు అయితే.. గులాబీ బాస్ కేసీఆర్ లాంటి అధినేతను డీల్ చేసే విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఈ విషయంలో ఏ చిన్న తేడా కొట్టినా మొదటికే మోసం కలగటం ఖాయమన్న విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి దగ్గర దగ్గరగా ఏడాది కావొస్తోంది. పదవిని చేపట్టిన క్షణం మొదలు ఇప్పటివరకు గులాబీ బాస్ కేసీఆర్ ను మాటలతో ఉతుకుడు కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్.

ఇలాంటి తీరు కొత్తల్లో బాగానే ఉన్నా.. పోను పోను ఈ తీరుకు ప్రజలు నెగిటివ్ గా స్పందించే వీలుంది. ఎందుకుంటే.. గత ప్రభుత్వం.. ప్రభుత్వాధినేత తప్పు చేసిన కారణంగానే అధికార బదిలీ జరిగిందన్న విషయాన్ని తాజా పాలకులు గుర్తించాలి. వారి తప్పుల్ని ఎత్తి చూపటం తప్పు కాదు. కానీ.. అది మాత్రమే పని. వేరే పని లేదన్నసంకేతాలు ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని రేవంత్ గుర్తించాలి.

వేదిక ఏదైనా.. ప్రోగ్రాం మరేదైనా సరే గత ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపైనా.. ఆయన తీసుకున్న నిర్ణయాలపైనా అదే పనిగా దుమ్ముత్తి పోయటం మొదట్లో ఆసక్తిని కలిగించేలా ఉన్నా.. పోను పోను అదో మోనాటనీలా మారుతుందన్న విషయాన్ని రేవంత్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అన్నింట్లోనూ తప్పులు చేశాడు.. పొరపాటు నిర్ణయాలు తీసుకున్నారంటూ మాటలతో మంట పుట్టే మాటలు బాగానే ఉన్నా.. మరి.. ఏడాది (దగ్గర దగ్గరగా)కి వచ్చేస్తున్న వేళలోనూ.. పాత తీరులోనే కేసీఆర్ ను ఉతుకుడు ప్రోగ్రాం పెడితే ఏం బాగుంటుంది చెప్పండి?

తాజాగా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్.. ఎప్పటిలానే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రభుత్వ విధానాల్ని విమర్శించారు. తమ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్ని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో భ్రష్టు పట్టిన విద్యాశాఖను ప్రక్షాళన చేసేందుకు ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నట్లు చెప్పిన రేవంత్.. 'టీచర్ల కష్టాల్ని గుర్తించి 21 వేల మందికి పదోన్నతలు ఇచ్చాం. బదిలీలు చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల విధి నిర్వహణకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాం'' అని చెప్పటం బాగానే ఉన్నా.. ఈ సందర్భంగానూ కేసీఆర్ ను మాటలతో ఉతుకుడు ప్రోగ్రాం చేపట్టటం అంతగా సూట్ కాలేదన్న వాదన వినిపిస్తోంది.

తెలంగాణ డెవలప్ మెంట్ పేరుతో కేసీఆర్ పదేళ్ల కాలంలో రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేశారని.. రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లుగా పేర్కొన్నారు. పేద పిల్లలకు విద్యను అందించాలని మాత్రం అనుకోలేదంటూ మండిపడ్డారు. గురుకులాలకు ఏటా రూ.10 కోట్లు ఇచ్చినా కనీస సౌకర్యాలు సమకూరేవని.. ఎస్సీలను చెప్పులు కుట్టుకోమని.. ఎస్టీలు పందులు పట్టుకోమని.. బీసీలు గొర్రెలు.. బర్రెలు యామని.. చేపలుపట్టమని.. గౌడన్నలు ఈదులు గీసుకోమని చెప్పారంటూ మండిపడ్డారు.

''బీసీ ప్రజలు గొర్రెలు.. బర్రెలు కాస్తూ బతకాలా? మీ కుటుంబంలో మాత్రం కొడుకు.. అల్లుడికి మంత్రుల ఉద్యోగాలు.. బిడ్డకు ఎమ్మెల్సీ.. తోడల్లుడి కుమారుడికి ఎంపీ సీటు ఇప్పించుకున్నారు. మేం సమతా మార్గంలో ముందుకు వెళుతుంటే.. బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శిగా పని చేశారు కదా? మీ హయాంలో గురుకుల పాఠశాలల్లో అసౌకర్యాలపై చర్యలు ఎందుకు చేపట్టలేదు?'' అని ప్రశ్నించారు సీఎం రేవంత్.

ఈ ప్రశ్నలు బాగానే ఉన్నా.. వాటికి సమాధానంగా తమ పాలనను చూపించాల్సిన అవసరం సీఎం రేవంత్ మీద ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నారు. ఇంకెంతకాలం ప్రశ్నలు? తన పాలనతో సమాధానాలు చూపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. విమర్శలు ఒక స్థాయి వరకు మాత్రమే బాగుంటాయన్నది రేవంత్ ఎప్పుడు గుర్తిస్తారు. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన మొదట్లో కేసీఆర్ కాస్త మాట్లాడినా.. ఆ తర్వాత నుంచి మాట్లాడటం మానేశారు. ఆ మాటకు వస్తే.. ఆయన రాజకీయానికి దూరంగా ఉన్నట్లుగా వ్యవహరిస్తూ ఫాంహౌస్ కు పరిమితం అయ్యారు.

ఇలాంటి వేళలో.. గత పాలకుడ్ని మరపించేలా వ్యవహరించాల్సిన రేవంత్.. కేసీఆర్ పాలనను గుర్తు చేసుకునే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వటం ఇప్పుడో చర్చగా మారింది. హైడ్రా కావొచ్చు.. మూసీ ప్రక్షాళన కావొచ్చు.. రియల్ ఎస్టేట్ తిరుగోమనం కావొచ్చు.. ఇవన్నీ ప్రభుత్వానికి ప్రతికూల అంశాలే. రాజకీయాల్లో చురుకుగా ఉండాల్సిన ప్రతిపక్ష నేత వానప్రస్థానానికి వెళ్లినట్లుగా వ్యవహరిస్తున్న వేళ.. తనకు మరెవరూ ప్రత్యామ్నాయం లేరన్న భావనను కలిగించటం అవసరం కదా? ఇప్పటికి కేసీఆర్ ను.. ఆయన పాలనను దూషించటం వల్ల వచ్చే కొత్త లాభం ఏమిటి? అన్న ప్రశ్నలు చాలా అవసరం. ఈ విషయాన్ని రేవంత్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.