ఆ పాపం తగిలి కేసీఆర్ కుక్క చావు చస్తారు: రేవంత్
మూసీకి కేసీఆర్ అడ్డుపడితే ఆ పాపం తగిలి కుక్క చావు చస్తారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
By: Tupaki Desk | 8 Nov 2024 4:51 PM GMTతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూసీలో బోట్ లో ప్రయాణించిన రేవంత్ రెడ్డి స్వయంగా బాటిల్ లో మూసీ నది నీరు పట్టి ఎంత మేర కలుషితమైందో పరిశీలించారు. ఆ తర్వాత నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే కేసీఆర్ కుక్కచావు చస్తారని షాకింగ్ కామెంట్లు చేశారు.
మూసీని ప్రక్షాళన చేయకుంటే తన జన్మ దండగ అని రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. మూసీ నది విషంగా మారిందని, ఈ నది నీటి వల్ల పిల్లలు కాలు వంకర, నడుము వంకరతో పుడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పిల్లలను మంచానికి కట్టేసి వారి తల్లులు కూలి పనులకు వెళుతున్నారని రేవంత్ భావోద్వేగానికి గురయ్యారు. 3 నెలలు నీ బిడ్డ జైల్లో ఉంటే నీకు దు:ఖం వచ్చింది..మరి, ఈ బిడ్డలు అనారోగ్యంతో ఏళ్ల తరబడి బాధపడుతుంటే వారికి దు:ఖం రాదా అని కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. మూసీకి కేసీఆర్ అడ్డుపడితే ఆ పాపం తగిలి కుక్క చావు చస్తారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
నల్గొండను ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ పీడిస్తోందని, ఈ ప్రాంతంలో గౌడన్నలు కల్లు అమ్ముకునే పరిస్థితి లేదని, మూసీ నదిఒడ్డున పెంచే గొర్రె మాంసాన్ని కొనే పరిస్థితి లేదని ఆవేదన చెందారు. ఈ ప్రాంతంలో గేదె, ఆవు పాలను కొనే పరిస్థితి లేదని అన్నారు. బాధిత రైతుల బాధలు స్వయంగా అడిగి తెలుసుకున్నానని, బీఆర్ఎస్ కు దోచుకోవడమే తప్ప మేలు చేయడం తెలియదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ కు అణుబాంబు కంటే ప్రమాదం మూసీ నది అని రేవంత్ చెప్పారు. నగరాన్ని విధ్వంసం చేస్తుంటే రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మూసీ నది వరంగా మారాల్సింది శాపంగా మారితే బాగుచేయొద్దా అని రేవంత్ ప్రశ్నించారు.