Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి రా సామీ...కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు

వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు

By:  Tupaki Desk   |   20 Nov 2024 11:30 PM GMT
అసెంబ్లీకి రా సామీ...కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
X

వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. నిన్న, హన్మకొండలో కేసీఆర్ పై దూకుడుగా వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..ఈ రోజు కాస్త మెత్తబడ్డట్లు కనిపించారు. అసెంబ్లీకి ఒక్కసారి రా సామీ..అంటూ రేవంత్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

హన్మకొండలో నిన్న కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని ప్రశ్నించిన రేవంత్..ఈ రోజు అందుకు భిన్నంగా కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని నవ్వుతూ ఆహ్వానించారు. ‘‘చివరగా చంద్ర శేఖర్ రావుగారికి మాత్రం ఒక మాట చెబుతున్నా...అసెంబ్లీకి రా సామీ..రా...వచ్చి కూసుందాం...రా...నీ 80 వేల పుస్తకాలేంజదివినవో మాట్లాడదం..ఒక్కసారి రావయ్యా సామి...వస్తే ఒక రోజంతా చర్చ జేద్దం..చేస్తే ఏందో తెలుస్తది లెక్క’’ అంటూ నవ్వుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ తర్వాత కేసీఆర్ పై పదునైన విమర్శలు చేశారు రేవంత్. రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి కేసీఆర్‌ నెట్టారని విమర్శించారు. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశాడని విమర్శించారు. దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్ అని, పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావు అని కొనియాడారు. గతంలో వేములవాడ ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీకి వెళ్లాల్సి వచ్చేదని, ఈ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారని చెప్పారు.

పదేళ్లలో రుణమాఫీ చేయలేదని, ఆ పని తాము చేస్తుంటే నొప్పిగా ఉందా అని బీఆర్ఎస్ నేతలపై రేవంత్ మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు తేలుస్తానని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. 50 వేల ఉద్యోగాలిచ్చామని, ఒక్కరు తక్కువగా ఉన్న క్షమాపణలు చెబుతానని స్పష్టం చేశారు.