తెలంగాణాలో మళ్లీ గెలిచేది కాంగ్రెసే... ఇది సర్వే కాదు !
తెలంగాణాలో రాష్ట్ర అవతరణ తరువాత పదేళ్ళకు కాంగ్రెస్ అధికారం చేపట్టింది.
By: Tupaki Desk | 16 Sep 2024 3:35 AM GMTతెలంగాణాలో రాష్ట్ర అవతరణ తరువాత పదేళ్ళకు కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీఎం అయి తొమ్మిది నెలలు గడిచిపోయాయి. ఆయన పాలన ఎలా ఉంది అంటే బాగానే అన్న మాట ఉంది. అసంతృప్తి అయితే ప్రస్తుతానికి లేదు.
అయితే అదే సమయంలో బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ కి ఇదే చివరి చాన్స్ అంటోంది. 2028లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెబుతోంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 2023లో జరిగిన ఎన్నికలు సెమీ ఫైనల్స్ అన్నారు. ఫైనల్స్ 2028లో ఉన్నాయని ఆ ఫైనల్స్ లో విన్నర్ కూడా కాంగ్రెస్ పార్టీ అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దానికి ఆయన చెప్పిన కారణాలు తర్కానికి అందేలా ఉన్నాయి. ఈ తొమ్మిది నెలలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంది అని అన్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజలకు చేరువగా ప్రభుత్వం ఉందని ఆ విధంగా ప్రజలు కూడా తమను నమ్ముతున్నారు అని ఆయన అంటున్నారు
రైతు రుణ మాఫీ హామీని నిలబెట్టుకున్నామని అలాగే తాము అధికారంలోకి వచ్చిన యువతతో పాటు మహిళలకు ఇతర వర్గాలకు న్యాయంచేశామని అన్నారు. అందువల్ల్ల ప్రజలు తమను దీవిస్తారు అని ఆయన అంటున్నారు.
ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ మరో లాజిక్ పాయింట్ చెప్పారు.1994 నుంచే తెలంగాణా ప్రజలు ఒక పార్టీని రెండు సార్లు వరసగా ఆదరిస్తున్నారు అని అన్నారు. అలా చూస్తే 2023, 2028 కూడా కాంగ్రెస్ దే విజయం అని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ని బాధ్యతలు అప్పగించిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. తాను 38 నెలల పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నాను అని అన్నారు పార్టీ హై కమాండ్ ఆదేశాల మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు తాను తన విధులను నిర్వహించాను అని అన్నారు. ఈ విధంగా కొత్త పీసీసీ చీఫ్ గా పనిచేయాలని అన్నారు.
ఇవన్నీ పక్కన పెడితే 1994 నుంచి ఏ పార్టీకి అయినా రెండు సార్లు ప్రజలు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మరోసారి చాన్స్ కాంగ్రెస్ దే అని రేవంత్ రెడ్డి అనడం రాజకీయంగా చర్చకు తావిస్తోంది. అదే సమయంలో ఆయన చెప్పినది చూస్తే 1994 , 1999లలో టీడీపీ రెండు సార్లు గెలిచింది. 2004, 2009లలో కాంగ్రెస్ రెండు సార్లు గెలిచింది. 2014, 2018 లలో బీఆర్ఎస్ గెలిచింది. ఇక 2023లో అధికారం చేపట్టినా 2028లోనూ గెలుస్తుంది అని లెక్క చెప్పేశారు.
అలాగే సెమీ ఫైనల్స్ గా 2023 ఎన్నికలను ఆయన పేర్కొనడం వెనక అర్ధాలు ఉన్నాయని అంటున్నారు. ఆ ఎన్నికలో ఓడినా బీఆర్ఎస్ కి మరో చాన్స్ ఉంది. అదే ఫైనల్ బాటిల్ అన్న మాట. అలా చూస్తే 2028లో బీఆర్ఎస్ ని ఓడిస్తే ఇక కాంగ్రెస్ కి తెలంగాణాలో తిరుగు ఉండదని చెప్పారని అంటున్నారు. బీఆర్ ఎస్ ఆశల మీద ఆలా రేవంత్ రెడ్డి నీళ్ళు చల్లేశారు.
ఒక టెర్మ్ కాదు రెండు టెర్ములు అంటున్నారు. ఆ మీదట కూడా మాదే పవర్ అని బిగ్ సౌండ్ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ అయితే సంస్థాగతంగా అన్నీ కూడదీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరి నాలుగేళ్లకు పైగా నిండా ఉన్న సమయం బీఆర్ ఎస్ కి రాజకీయంగా కఠిన పరీక్ష అని అంటున్నారు. రేవంత్ రెడ్డి దూకుడు కూడా మామూలుగా లేదు అనే అంటున్నారు. ఆయనకు సన్నిహితుడైన మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీ చీఫ్ గా చేసుకున్నారు. ఈ జోడీ మరోసారి తెలంగాణాలో సక్సెస్ మ్యాజిక్ ని కంగ్రెస్ కి రిపీట్ చేస్తారు అని అంటున్నారు.