Begin typing your search above and press return to search.

కేసీఆర్ ‘చంద్రబాబు’ బూచికి రేవంత్ క్లారిటీ

తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని పట్టించుకోవట్లేదన్న గులాబీ బాస్ వాదనకు కౌంటర్ అటాక్ షురూ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

By:  Tupaki Desk   |   22 Feb 2025 4:25 AM GMT
కేసీఆర్ ‘చంద్రబాబు’ బూచికి రేవంత్ క్లారిటీ
X

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ కత్తి బయటకు తీసి.. రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మించినోళ్లు మరొకరు ఉండరనే చెప్పాలి. పరిస్థితులు తనకు అనుకూలంగా లేని వేళలో.. ఎంతకాలమైనా ఓపిగ్గా వెయిట్ చేసే ఆయన.. ఒకసారి సిట్యూవేషన్ తనకు అనుకూలంగా ఉందన్న భావన కలిగినంతనే చెలరేగిపోతారు. ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ విరుచుకుపడతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం కామ్ గా ఉండిపోయిన కేసీఆర్.. ఇటీవల పార్టీ కార్యాలయానికి రావటం.. ఆ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడిన క్రమంలో సెంటిమెంట్ కత్తిని బయటకు తీసేందుకు వీలుగా గ్రౌండ్ వర్కు మొదలు పెట్టారు.

ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ నీటి వనరుల్ని దోచుకుంటున్నారని.. ఆయన శిష్యుడైన తెలంగాణ సీఎం కామ్ గా ఉన్నట్లుగా పేర్కొంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణ నీళ్లను ఏపీ పట్టుకెళ్లిపోతున్నా.. రేవంత్ సర్కారు చూస్తూ ఉండిపోతుందే తప్పించి.. తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని పట్టించుకోవట్లేదన్న గులాబీ బాస్ వాదనకు కౌంటర్ అటాక్ షురూ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన నిర్వాకం వల్లే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణకు పంచాయితీ వచ్చిందన్న రేవంత్.. ‘గత పదేళ్లలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేసి ఉంటే.. ప్రస్తుతం చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదు. నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే.. నిదులు కేసీఆర్ తీసుకుపోయి పాలమూరుకు అన్యాయం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి రూ.16 వేల కోట్లతో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేసి రూ.35 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో శ్రీశైలం నుంచి తీసుకున్నారు. ఇప్పుడు అదే పాలమూరుకు శాపంగా మారింది. రూ.35 వేల కోట్ల ప్రాజెక్టును రూ.55 వేల కోట్లకు పెంచారు. గత ఎన్నికల్లో పాలమూరులో 13 సీట్లు గెలిపించటమే మేం చేసిన పాపమా?’’ అంటూ ఫైర్ అయ్యారు.

అప్పట్లో వైఎస్సార్ ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడును 4 వేల క్యూసెక్యుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచుతుంటే హరీశ్ రావు మంత్రిగా ఉంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఊడిగం చేశారన్న రేవంత్.. ‘క్రిష్ణా జలాలను రాయలసీమకు తరలించటానికి కేసీఆర్ అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత వైఎస్ కొడుకు ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక అధికారిక ప్రగతి భవన్ కు పిలిచి.. రాయలసీమ లిఫ్టునకు పథకం రచించింది కేసీఆర్ కాదా? పోతిరెడ్డిపాడుకు హారతి పట్టించి.. ముచ్చుమర్రి నిర్మిస్తే ఒక్కరోజు అడ్డుకోకుండా వీరతిలకం దిద్ది.. పంచభయ్యాలు పెట్టింది కేసీఆర్ కాదా? తొందర్లోనే రాయలసీమ లిఫ్టు పూర్తి అయితే రోజుకు 10 టీఎంసీల చొప్పున నెల రోజుల్లో 300 టీఎంసీలు తరలించుకుపోయేందుకు పునాదులు వేసింది కేసీఆరే. దీంతో పాలమూరు ఎడారిగా మారింది. లగచర్లతో పరిశ్రమలు పెడతామంటే కలెక్టర్ ను చంపే ప్రయత్నం చేశారు. పదేళ్లు నా మీద కక్షతో నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టలేదు. ఇప్పుడు పనులు చేపడితే సర్వేను అడ్డుకున్నారు’’ అంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులను ఉంచుతుందని.. దమ్ముంటే బీఆర్ఎస్ కూడా డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే అభ్యర్థులను పోటీలో నిలుపుతారా? అంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘పదేళ్లు అధికారంలో ఉండి డబుల్ బెడ్రూం పేరుతో ఆశ చూపారు. మోసం చేశారు. ఇందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తాం. ఏటా ప్రతి ఇంటికి రూ.5 లక్షలు అందజేస్తాం. అవసరమైతే నియోజకవర్గానికి 5 వేల ఇళ్లు కేటాయిస్తాం’’ అని వ్యాఖ్యానించారు.

డెవలప్ మెంట్ మీద చెబుతామంటే అసెంబ్లీకి రాని కేసీఆర్.. గట్టిగా కొడతానని చెబుతున్నారంటూ కేసీఆర్ మీద ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ.. ‘‘గట్టిగా కొడతానని అంటున్నారు. గట్టిగా కొట్టాలంటే ఫుల్ లేదా హాఫ్ కొట్టాలి. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు నడుపుతున్న కేటీఆర్.. ఢిల్లీలో లిక్కర్ దందా చేసి తెలంగాణ పరువు తీసిన కవిత.. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతికి పాల్పడిన హరీశ్ రావును గట్టిగా కొట్టాలి. అప్పుడే వారికి బుద్ధి వస్తుంది’’ అంటూ నిప్పులు చెరిగారు.