Begin typing your search above and press return to search.

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. డిసైడ్ చేసిన సీఎం

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. దీనికి సంబంధించిన డేట్ ను సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేశారు.

By:  Tupaki Desk   |   3 Feb 2025 4:32 AM GMT
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. డిసైడ్ చేసిన సీఎం
X

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. దీనికి సంబంధించిన డేట్ ను సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేశారు. మంగళవారం ఉదయం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు.. ఎస్సీ వర్గీకరణ నివేదికపై ప్రత్యేకంగా చర్చించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై ఇప్పటికే సిద్ధమైన ఎజెండాను ఖరారు చేయనున్నారు. సమగ్ర ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక.. సామాజిక..రాజకీయ స్థితిగతులపై సర్వే నిర్వహించిన ప్రణాళికా విభాగం.. సంబంధిత రిపోర్టును ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించింది.

అదే సమయంలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్ కూడా ఉత్తమ నాయక్తవంలోని మంత్రివర్గ ఉప సంఘానికి ఈ రోజు (సోమవారం) నివేదిక ఇవ్వనుంది. ఇంకోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై విశ్రాంత అధికారి బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి.. ఈ నివేదికలను సమీక్షించనున్నారు. అనంతరం ఈ అంశాల మీద చర్చించేందుకు వీలుగా తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ అంశాలపై చర్చ ముగిసే వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి.

ముస్లింలతో కలుపుకొని రాష్ట్రంలో బీసీ జనాభా 56.33 శాతానికి చేరిన విషయం సమగ్ర కుల గణన సర్వే తేల్చింది. ఈ వివరాల ఆధారంగానే బూసాని వెంకటేశ్వరరావు కమిషన్.. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై రిపోర్టు ఇవ్వనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు. కులగణన సర్వే ప్రకారం ఎస్సీ.. ఎస్టీ జనాభా 27.88 శాతం మేరకు ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో 27-28 శాతం వరకు రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీలకు దక్కే రిజర్వేషన్ 22 - 23 శాతం మాత్మే. బీసీ జనాభా దామాషా ప్రకారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయటంతో పాటు తొమ్మిదో షెడ్యూల్ లో పేర్కొనాల్సి ఉంటుంది. ఈ మేరకు సమగ్ర వివరణతో కూడిన నివేదికను బూసాని కమిషన్ ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి.. కేంద్రానికి పంపాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచన. అదే సమయంలో ఎస్సీ వరగీకరణపైనా అసెంబ్లీలో చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికలకు ముందే జిల్లా.. మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానిక ఎన్నికలను త్వరగా నిర్వహించాలన్న ఒత్తిడి అధికార పార్టీ మీద ఉంది. దీంతో.. పార్టీ గుర్తుపై జరిగే జడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల్ని ముందుగా నిర్వహించాలన్న యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతామని.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే స్థానిక ఎన్నికల ముందు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి.

దీంతో.. ముఖ్యమంత్రి ఈ రెండు అంశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు కాంగ్రెస్ సర్కారు కట్టుబడి ఉందన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. దీనికి పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లటం ద్వారా.. తమ మీద ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలిసింది.

తాము అనుకున్నట్లుగా బడ్జెట్ సమావేశాల్లోపు చట్ట సవరణ జరిగితే సరి. అలా కాని పక్షంలో పాత రిజర్వేషన్ల ప్కారమే జిల్లా.. మండల పరిషత్ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఎన్నికల్లో హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన.. తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్న సంకేతాల్ని ఇచ్చేందుకు వీలుగా బీసీలకు 42 శాతం టికెట్లను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. అలా జరిగితే.. విపక్షాల ఎదురుదాడికి చెక్ పెట్టినట్లే అవుతుందన్న ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లుగా తెలుస్తోంది.